
పోలీస్ ఉద్యోగం మగాడిదనుకుంటారు... మగాడు తనను తాను పోలీస్ అనుకుంటాడు..ఇంట్లో పోలీస్.. ఆఫీస్‌లో పోలీస్.. తండ్రిగా పోలీస్.. అన్నగా పోలీస్.. భర్తగా పోలీస్..అలాంటి సమాజంలో ఒక షీ పోలీస్ ఆఫీసర్ ఎంతటి ఒత్తిడికి గురవుతుందన్నదే సోనీ కథ!
ఢిల్లీ...చలికాలం..
చీకటి పడింది. ఒక అమ్మాయి సైకిల్ మీద వెళ్తోంది. కాస్త దూరమే వెళ్లాక వెనక సైకిల్ మీదే ఒకతను వెంటాడటం మొదలుపెట్టాడు. ఆమె పట్టించుకోకుండా ఇంకా ముందుకు సాగుతూనే ఉంది. అతను ఆమెను కామెంట్ చేస్తూ సీరియస్‌గా ఫాలో అవుతున్నాడు. ఓ చిన్న అడ్డదారిలోకి వెళ్లి ఆగుతుంది. అతనూ ఆగుతాడు. సైకిల్ దిగి.. అతన్ని పట్టుకుని కొడ్తుంది ఆమె. ఇంతలోకి ఓ మహిళా నాయకత్వంలోని పోలీసుల బృందం వచ్చి ఆమెను ఆపుతుంది. తన వెంటపడ్తున్న వ్యక్తిని కొట్టిన అమ్మాయి కూడా పోలీసే. పేరు సోనీ. సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నాయకత్వం వహించిన మహిళ ఎస్.పి. కల్పన.
సోనీ కూడా ఆమె దగ్గరే పనిచేస్తూంటుంది. నెట్‌ఫ్లిక్స్ ప్రొడక్షన్ ‘సోని’ అనే సినిమాలోనిది ఆ దృశ్యం. పోలీస్ వ్యవస్థలో వేర్వేరు కేడర్‌లో ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు మహిళల కథ ఇది. ఐపీఎస్‌గా ఎంత ధీశాలి అయినా ఇల్లు, కుటుంబ విషయాలకు వచ్చేసరికి సగటు ఒత్తిళ్లను తప్పక భరించే సాధారణ స్త్రీ ఆమె. భర్త కూడా ఐపీఎస్ అయితే.. తన ఉద్యోగంలో ఆయన జోక్యాన్ని సహించాల్సిన సర్వసాధారణ భార్యే ఆమె. సబ్ ఇన్‌స్పెక్టర్ హోదాలో ఉన్న అమ్మాయికి ఈ భారం మరింత ఎక్కువ.
పోలీస్ హైరార్కీలోని నిరంకుశత్వంతో పాటు అదనంగా మహిళా ఉద్యోగుల పట్ల ఉన్న వివక్ష, మధ్యతరగతి నివాసాల్లోని మోరల్ పోలీసింగ్, విలువల వల్లింపులు, వదిలించేసుకున్నా వీడని బంధాల బేడీలు.. ఆమె మోయాల్సిన బరువులు! రెండు జీవితాలు, రెండు నేపథ్యాలు, రెండు స్థాయిల మధ్య ఉన్న వ్యత్యాసాలు.. వీటన్నిటికీ స్థానం కల్పించిన సమాజపు బుద్ధి, తీరుకు ఫ్రేమే ‘సోనీ’ మూవీ.
కథలోకి ..
పైన చెప్పిన ఉపోద్ఘాతమే సినిమా స్టార్టింగ్ సీన్. అసలు ఈ కథకు ప్రేరణ.. 2012, నిర్భయ ఘటన. ఆ విషాదం తర్వాత ఢిల్లీలో మహిళా భద్రతను సవాల్‌గా తీసుకుని నేరం జరుగుతున్న, జరిగే ప్రమాదం ఉన్న పరిసరాలను గుర్తించే ఆపరేషన్ చేపడ్తుంది కల్పన. ఆ టాస్క్ కోసం ఓ టీమ్‌ను ఫామ్ చేస్తుంది. అందులో సోనీ కీలక వ్యక్తి. కల్పన ఆలోచనకు వేగంగా కార్యరూపం ఇవ్వగల సామర్థ్యం ఆమెది. అందులో భాగంగానే అలా రాత్రిపూట గస్తీకి వెళ్తారు. ఒకసారి ఒక నేవీ ఆఫీసర్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో సోనీ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే.. అతని దవడ పగలకొడ్తుంది సోనీ. ఆ వ్యక్తి రాజకీయంగా తనకున్న పలుకుబడితో సోనీ మీద క్రమశిక్షణ చర్య తీసుకునేలా ప్రెజర్ తెస్తాడు.
దాంతో ఆమెను ఆ ఆపరేషన్ నుంచి తప్పించి రికార్డ్స్ రూమ్‌కి పరిమితం చేస్తారు. ఇది సోనీకే కాదు కల్పనకూ కష్టంగానే మారుతుంది. టాస్క్‌లో సోనీ రీ అప్పాయింట్‌మెంట్ కోసం కమిషనర్ అయిన తన భర్త సందీప్ సహాయం కోరుతుంది కల్పన. సాయమేమో కాని కింది ఉద్యోగులతో ఎలా ఉండాలో పాఠాలు చెప్తాడు. సబార్డినేట్స్ పట్ల అంత సానుభూతి అక్కర్లేదని క్లాస్ తీసుకుంటాడు. మౌనంగా వింటుంది. భర్త దగ్గర కల్పన పాత్ర అది. ఆమెకు పిల్లలు ఉండరు. అత్తగారు పిల్లల కోసం షంటుతూ ఉంటుంది. ఆడబిడ్డా తనకు మంచి గైనకాలజిస్ట్ తెలుసని, వెళ్లి కలవమని సలహా ఇస్తుంది. ఇక్కడా మౌనమే ఆమె ఆయుధం.
ఆవేశం
కల్పనకు వ్యతిరేకం సోనీ. అన్నిటికీ ఆవేశంగా రియాక్ట్ అవుతూంటుంది. సహనానికీ హద్దు ఉండాలి అన్నది ఆమె ఫిలాసఫి. కెరీర్‌లోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ అడ్డంకులను ఎదుర్కొంటుంది. భర్త నవీన్‌తో విడాకులైపోయి ఒంటరిగా ఉంటూంటుంది. అయినా రెండు రోజులకు ఒకసారి ఆమె ఉండే చోటికి వచ్చి ఇబ్బంది పెడ్తూంటాడు. చుట్టుపక్కల వాళ్లు సోనీ దగ్గర సొద పెడ్తూంటారు.. ఎన్నాళ్లు ఇలా ఒంటరిగా ఉంటావ్.. ఆడదానికి పెళ్లే పరమావధి ఎట్‌సెట్రా.. ఎట్‌సెట్రా అంటూ! నన్ను నేను చూసుకోగలను అని గట్టిగానే సమాధానమిస్తుంది సోనీ. ఆమె వ్యక్తిగత ఇబ్బందుల గురించి తెలుసుకున్న కల్పన సోనీ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపు తుంది. అంత ఆవేశం పనికిరాదని సుతిమెత్తగా హెచ్చరిస్తూంటుంది.
లేడీస్ వాష్‌రూమ్‌లో..
ఒక రాత్రి.. పహారా కాస్తూ.. ఆకలిగా ఉంటే దార్లో ఉన్న హోటల్‌కి వెళ్తారు. టిఫిన్ ఆర్డర్ ఇచ్చాక వాష్ రూమ్‌కి వెళ్తుంది సోనీ. అప్పటికే అక్కడ తన అయిదేళ్ల కూతురితో ఓ అమ్మ ఉంటుంది క్యూలో. వాళ్లతో ఆ మాటా ఈ మాటా మాట్లాడ్తూండగానే ‘‘అమ్మా....అర్జంట్’’ అంటూ ఆ పాప ఇబ్బంది పడ్తుంది. అప్పుడు ఆ పాప తల్లి ‘‘చాలా సేపయింది. లోపల ఉన్నవాళ్లు బయటకే రాలేదు’’ అని చెప్తుంది సోనీతో. ‘‘అవునా?’’ అంటూ సోనీ వాష్‌రూమ్ తలుపు తడ్తుంది. రెస్పాన్స్ ఉండదు. మళ్లీ తడ్తుంది కొంచెం గట్టిగా. ఈసారీ నో రెస్పాన్స్. దబదబ బాదుతుంది సోనీ. ఒక్కసారిగా వాష్ రూమ్ తలుపు తెరుచుకుంటుంది. గుమ్మంలో జులపాలతో ఓ అబ్బాయి.
లోపల మరో నలుగురు అబ్బాయిలు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్‌తో. ‘‘లేడీస్ వాష్‌రూమ్‌లో ఏం చేస్తున్నారు?’’ అంటూ ప్రశ్నిస్తుంది సోనీ. గుమ్మంలో ఉన్న అబ్బాయి అమర్యాదగా మాట్లాడ్తాడు. లోపలున్న వాళ్లు నవ్వుతారు. ‘‘మర్యాదగా బయటకు రండి’’ అంటూ హెచ్చరిస్తుంది. హేళన చేస్తూ తలుపు వేయబోతాడు. అడ్డుకుంటుంది సోనీ. బూతులు మొదలుపెడ్తాడు. చెంప చెళ్లు మనిపిస్తుంది సోనీ. కోపంతో ఆ అబ్బాయి సోనీ జుట్టుపట్టుకొని లోపలికి ఈడుస్తాడు. గొడవ పెద్దదవుతుంది. ఈ వివాదమూ సోనీ కెరీర్‌కే చుట్టుకుంటుంది. ఎందుకంటే అవతలి అబ్బాయి సెంట్రల్ కేబినెట్‌లో ఉన్న ఓ మంత్రికి ఎలక్షన్ ఫండింగ్ చేస్తున్న వ్యక్తి కొడుకు. ఈ సంఘటనలోనూ కల్పన భర్త నుంచి కల్పనకు సుద్దులు, బుద్ధులు, చీవాట్లు, జాగ్రత్తలు యాజ్‌యూజ్‌వల్.
మరుసటి రాత్రి..
సోనీ వాళ్లింటికి వస్తుంది కల్పన. సోనీ చేతికి ఉన్న కట్టును చూస్తూ ‘‘ఈ గాయం వాడు చేసిందేనా?’’ ప్రశ్నిస్తుంది కల్పన. సోనీకి చిర్రెత్తుకొస్తుంది. ‘‘అన్నీ తెలిసీ మీరూ అలాగే మాట్లాడుతున్నారా?’’ అంటూ బరస్ట్ అవుతుంది సోనీ. ‘‘నువ్వు వాడి మీద చేయి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నేను అక్కడే ఉన్నా కదా? నాకు చెప్పి ఉంటే అరెస్ట్ చేసేవాళ్లం.ఈ గతి పట్టేది కాదు’’ అంటుంది కల్పన చాలా స్థిరంగా. ‘‘ఇప్పుడూ అరెస్టే కదా చేశాం’’ అని సోనీ అంటూండగానే ఆమె డైనింగ్ ఏరియా కిటికీ అద్దాలు భళ్లున పగుల్తాయి. కిటికీ వైపు దూసుకెళ్లి కిందకు చూస్తుంది. బైక్స్ మీద పారిపోతూ కనిపిస్తారు ఆకతాయిలు.
నేను లేకపోతేనే..
ఇంట్లో దాడి జరిగిన రాత్రే సోనీ భర్త వస్తాడు. ‘‘నేనుంటే ఇలా జరిగేది కాదు’’ అంటాడు. తీక్షణంగా చూస్తుంది భర్తను. తల వంచుకుంటాడు. అప్పటిదాకా తను చేసిన తప్పులన్నిటినీ క్షమించి కలిసి ఉండటానికి ఒప్పుకోమని బతిమాలుతాడు సోనీని. ఇక నుంచి బాధ్యతగా ఉంటానని చెప్తాడు. అతనిని నమ్మక తప్పని పరిస్థితిని కల్పిస్తాడు. ఇటు ఉద్యోగంలో పై అధికారుల సపోర్ట్ లభించకపోయేసరికి రాజీనామా చేయాలని నిశ్చయించుకుంటుంది సోనీ. ఆ మర్నాడు కల్పన.. వాళ్ల ఆడపడచు ఇంటికి వెళ్తుంది. టెన్త్ క్లాస్ చదువుతున్న తన మేనకోడలు దిగులుగా తన గదిలో కూర్చుని ఉంటుంది.
ఏమైంది అని అడిగితే.. పీరియడ్స్ వల్ల మాటిమాటికి వాష్‌రూమ్ వెళ్తుంటే క్లాస్‌లో బాయ్స్ ఏడిపించారని. తన ఫ్రెండ్స్ కూడా వంతపాడారని చెప్తుంది. ‘‘ఏడిస్తే ఎవరైనా ఏడిపిస్తారు. లెక్క చేయకపోతే ఎవరూ జోలికి రారు’’ అని ధైర్యం చెప్తుంది. తన మేనకోడలికి మోరల్ సపోర్ట్ ఇస్తూన్నప్పుడే సోనీ గుర్తొస్తుంది కల్పనకు. వెంటనే ఆమె దగ్గరకు బయలుదేరుతుంది.. ‘‘రసీదీ టికెట్’’ అనే అమృతా ప్రీతమ్ ఆటోబయోగ్రఫీ బుక్ తీసుకుని! దాన్ని సోనీకి ఇస్తుంది చదవమని. అలాగే రాజీనామా చేయొద్దనీ చెప్తుంది.
ఆఫీస్‌లో..
లేడీస్ వాష్‌రూమ్‌లో చేరి సిగరెట్, మందు కొడ్తున్న వాళ్ల మీద బలమైన కేసులు పెట్టమని తన కింది అధికారులకు పురమాయిస్తుంది కల్పన.అన్ని ఒత్తిళ్లకూ ఫుల్‌స్టాప్ పెట్టి.. పని చేయడానికి సిద్ధ పడ్తుంది. టాస్క్‌ను ముందుకు సాగిస్తుంది. ఇక్కడితో ఎండ్ అయిన ఈ సినిమా అంతా దాదాపుగా సింగిల్ టేక్స్‌లో షూట్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేని ‘సోనీ’ ఇప్పటికే చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి వెళ్లింది. దర్శకుడు ఇవన్ అయ్యర్. సోనీగా.. గీతికా విద్యా ఒహ్లయాన్, కల్పనగా సలోనీ బాత్రా నటించారు.
Comments
Please login to add a commentAdd a comment