lady police officer
-
Eksha Hangma Subba: సూపర్ ఉమన్!
ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు విమానాలను కూడా అవలీలగా నడిపేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో నైపుణ్యంతో రాణిస్తూంటే ‘ఇక్షా హంగ్మా సుబ్బ’ మాత్రం నాలుగు నైపుణ్యాలతో వందమందిలో ఒక్కటిగా దూసుకుపోతుంది. ఇక్షా హంగ్మా సుబ్బ.. ఏంటీ అనిపిస్తుంది కదూ! అవును ఈ పేరు పలకడానికి, వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నట్టుగానే ఇక్షా వృత్తినైపుణ్యాలు ఒకదానికి ఒకటి పొంతన లేకపోయినప్పటికీ, తనదైన శైలిలో రాణిస్తూ అందరిచేత సూపర్ ఉమన్ అనిపిస్తోంది. బోల్డ్ అండ్ బ్యూటిపుల్‌గా పేరొందిన ఇక్షా.. సిక్కిం పోలీస్ ఆఫీసర్, జాతీయ స్థాయి బాక్సర్, బైకర్, ఎమ్‌టీవీ సూపర్ మోడల్. సిక్కిం రాష్ట్రంలోని పశ్చిమ జిల్లా సొంబారియా గ్రామంలో ఐతరాజ్, సుకర్ణి సుబ్బా దంపతులకు 2000 సంవత్సరంలో ఇక్షా జన్మిచింది. ఒక సోదరుడు ఉన్నాడు. ప్రైమరీ,సెకండరీ విద్యాభ్యాసం అంతా సొంతూరులోనే పూర్తి చేసింది. తరువాత గ్యాంగ్‌టక్‌లోని బహదూర్ భండారీ కాలేజీలో డిగ్రీలో చేరింది. ఈ సమయం లోనే ఎన్ఎస్ఎస్లోలో చేరింది. చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండే ఇక్షాకు నటన అన్నా... మోడలింగ్ అన్నా అమితాసక్తి. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల మూలంగా డిగ్రీ చదువుతూనే పోలీసు ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యి మంచి మార్కులతో సిక్కిం పోలీస్ విభాగంలో చేరింది. 14 నెలల శిక్షణ తరువాత ‘యాంటీ రైట్ ఫోర్స్’ విభాగంలో పోలీస్ ఆధికారిగా చేరింది. ఉద్యోగంలో చేరి, కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడుతున్నప్పటికీ చిన్నప్పటినుంచి ఉన్న మోడలింగ్ ఆసక్తి వెలితిగా తోచింది తనకు. మిస్ సిక్కిం.. పోలీస్ ఉద్యోగం చేస్తున్నప్పటికీ స్కూల్లో ఉన్నప్పుడు వివిధ మోడలింగ్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లలో పాల్గొని గెలిచిన సందర్భాలు, కాలేజీలో ‘మిస్ ఫ్రెషర్’గా టైటిల్‌ను గెలుచుకున్న సందర్భాలు తనకి గుర్తొచ్చేవి. తన గ్రామం నుంచి రాష్ట్రస్థాయి మోడలింగ్ పోటీలలో పాల్గొని మిస్ సిక్కిం టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో ఇక్షాకు మోడలింగ్‌లోకి వెళ్లేందుకు నమ్మకం కుదిరింది. అక్కడి నుంచి వివిధ రకాల మోడలింగ్ కాంపిటీషన్స్ లో పాల్గొనేది. ఈ క్రమంలోనే ఎమ్‌టీవీ సూపర్ మోడల్ –2 రియాల్టీ షో ఆడిషన్స్‌కు హాజరై సెలక్ట్ అయింది. ఈ సెలక్షన్స్ ద్వారా ఇక్షా గురించి అందరికీ తెలిసింది. మొత్తం పదిహేనుమంది పాల్గొన్న ఈ షోలో మొదట టాప్ నైన్లో చోటు సంపాదించుకుని పాపులర్ అయ్యింది. పోటాపోటీగా జరుగుతున్న ఈ షోలో ప్రస్తుతం మూడవ స్థానంలో కొనసాగుతూ అందర్ని ఆకట్టుకుంటోంది. టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా సూపర్ మోడల్‌గా ఇక్షాను పొగుడుతూ ట్వీట్ చేయడం, షో న్యాయనిర్ణేతలు కూడా ఇక్షాను అభినందిస్తుండంతో అంతా ఆమెను అభినందనలలో ముంచెత్తుతున్నారు. ఇక్షా ఆసక్తిని గమనించిన ఆమె తండ్రి శారీరకంగా ఫిట్‌గా ఉండేందుకు ఆటలు బాగా పనికొస్తాయని ప్రోత్సహించడంతో స్థానికంగా నిర్వహించే బాక్సింగ్ తరగతులకు హాజరై బాక్సింగ్ నేర్చుకుని జాతీయస్థాయి బాక్సర్‌గా ఎదిగింది. అలా ఒకపక్క బాక్సింగ్ చేస్తూనే మరోపక్క ఉద్యోగం చేస్తూ తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ సూపర్ ఉమన్‌గా నిలుస్తోంది. ఇక్షాకు మోడలింగ్‌తోపాటు డ్రైవింగ్ కూడా చాలా ఇష్టం. అందుకే ఆమె కేటీఎమ్ ఆర్సీ 200 మోటర్ బైక్ నడుపుతూ లాంగ్ రైడ్స్‌కు వెళ్తుంటుంది. చిన్న వయసులో ఇన్ని రకాల నైపుణ్యాలతో దూసుకుపోతూ ఎంతోమంది యువతీయువకులకు ప్రేరణగా నిలుస్తోంది ఇక్షా. -
DSP Shilpa Sahu; ‘అమ్మ’ఆన్ డ్యూటీ
అవసరం అయితే తప్ప ఇళ్లలోంచి కదలవద్దని జనానికి చెప్పడానికి.. ఇంట్లో ఉండవలసిన అవసరం ఉన్నప్పటికీ బయటికి వచ్చి ఎర్రటి ఎండలో డ్యూటీ చేస్తున్నారు ఐదు నెలల గర్భిణీ అయిన దంతెవాడ డీఎస్పీ శిల్పా సాహూ!! ‘సురక్షితంగా ఉండండి, మాస్కులు ధరించండి’ అని చెప్పడానికి, నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారిని హెచ్చరించడానికి లాఠీ చేతపట్టి.. తన కడుపులోని బిడ్డకు ప్రమాదమేమో అని కూడా తలవకుండా కరోనా సెకండ్ వేవ్ లో, సూర్యుడి భగభగల్లో, మావోయిస్టుల కదలికల నడుమ.. ఆమె తన విధులు నిర్వహిస్తున్నారు! ఎప్పుడూ గుడిలో దర్శనమిచ్చే దంతేశ్వరీ దేవి మంగళవారం మధ్యాహ్నం ఎర్రటి ఎండలో దంతెవాడ పట్టణ ప్రధాన కూడళ్లలో కర్ర పట్టి తిరుగుతూ, ప్రజలు కరోనా బారినపడకుండా జాగ్రత్తలు చెబుతూ ఉన్నట్లే అనిపించి ఉండవచ్చు అక్కడి వారికి కొందరికైనా! ఆ ‘దంతేశ్వరీ దేవి’ పేరు శిల్పా సాహూ (29). దంతెవాడ డిప్యూటీ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్. దంతెవాడ చత్తీస్‌గఢ్ జిల్లాలో ఉంది. సాధారణంగా మావోయిస్టులను గుర్తుకు తెచ్చే ఈ ప్రాంతం.. కరోనా లాక్డౌన్ విధుల నిర్వహణలో డీఎస్పీ శిల్పా సాహూ చూపిన అంకితభావం కారణంగా ఎవరికైనా శక్తిమాతను గుర్తు తెచ్చి ఉంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. దేశంలోని మొత్తం యాభై రెండు శక్తి పీఠాలలో ఒకటైన దంతేశ్వరీదేవి ఆలయం దంతెవాడలో ఉంది. ఆ తల్లి తన బిడ్డల్ని అదిలించి, కదిలించి, సంరక్షించిన విధంగానే ఇప్పుడు శిల్ప తన పౌరుల్ని కరోనా నిర్లక్ష్యం నుంచి అదిలిస్తూ, త్వరగా చేరమని ఇళ్లకు కదిలించే డ్యూటీలో ఉన్నారు. నిజానికైతే ఆమె కూడా ఇంట్లోనే ఉండిపోవలసిన పరిస్థితే. గాలి సోకితే చాలు కరోనా వచ్చేలా ఉంది. ఎండ ఆవిర్లు వదులుతోంది. మావోయిస్టులు ఎక్కడ మాటువేసి ఎటుగా వస్తోరో తెలియదు. అయినా పోలీస్ డ్యూటీ పోలీస్ డ్యూటీనే. అన్నిటినీ తట్టుకోవాలి. పౌరుల్ని కాపాడాలి. డిఎస్పీ శిల్ప కూడా అదే డ్యూటీ ఉన్నారు కానీ, ఆమె కాస్త ప్రత్యేకమైన పరిస్థితిలో డ్యూటీ చేస్తున్నారు. ఐదవ నెల గర్భిణి ఆమె. ఇక నుంచి ఆమె మరింతగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఆమెకు చెప్పే ఉంటారు. అయితే సెకండ్ వేవ్ కరోనాలో ప్రజలు మరింతగా భద్రంగా ఉండాలని చెప్పడం కోసం ఆమె బయటికి వచ్చారు. లాఠీ పట్టుకుని దంతెవాడ ప్రధాన రహదారులలో డ్యూటీ చేశారు. మాస్క్ వేసుకోని వాళ్లను, అనవసరంగా బయటికి వచ్చినవాళ్లను ఆపి, మందలించారు. కరోనా బారిన పడకుండా, ఇతరులను పడేయకుండా ఉండటానికి జాగ్రత్తలు చెప్పి పంపారు. సాటి మానవులు చెబితే కోపం వస్తుందేమో కానీ, డీఎస్పీ చెబితే వినకుండా ఉంటారా? ఇప్పుడామె చేస్తున్నది బాధ్యతల్ని గుర్తు చేసే డ్యూటీ. ఒకరు గుర్తు చేయాల్సినంతగా నిర్లక్ష్యాన్ని, ఉదాసీనతను ప్రదర్శిస్తున్న పౌరులు.. గర్భిణిగా ఉండి కూడా మిట్ట మధ్యాహ్నపు ఎండలో డ్యూటీ చేయడం చూసి సిగ్గుపడే ఉంటారు. తనకు, కడుపులో ఉన్న తన బిడ్డకు కరోనా సోకుతుందేమోనన్న భయం లేకుండా శిల్ప పౌరుల క్షేమం కోసం పాటు పడటం మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవాన్నే పెంచింది. గర్భంతో ఉండి కూడా ఆమె డ్యూటీ చేస్తున్నప్పటి ఫొటోను ఐపీఎస్ ఆఫీసర్, చత్తీస్‌గఢ్ అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దీపాంశు కబ్రా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయగానే ‘డ్యూటీ మైండెడ్’ శిల్పపై గత 48 గంటలుగా ట్విట్టర్లో ధారాపాతంగా ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. ‘సెల్యూట్ టు డీఎస్పీ శిల్పా సాహూజీ! డీజీపీ శ్రీ అవస్థిగారూ.. ఆమెకు అవార్డు ప్రకటించంది. అలాగే ఆమె కోరుకుంటే కనుక ఆమెను రాయ్‌పుర్ బదలీ చేయండి’ అని ఒకరు, ‘గుడ్ జాబ్ మేమ్, ఐ రిక్వెస్ట్ యు ప్లీజ్ స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ’ అని ఇంకొకరు.. పదులు, వందల్లో ఆమెను అభినందిస్తూ, జాగ్రత్తలు చెబుతున్నారు. రాయ్‌పుర్ చత్తీస్‌గఢ్ రాజధాని. అక్కడికి, దంతెవాడకు ఏడున్నర గంటల ప్రయాణం. రాయ్‌పుర్‌లో అయితే శిల్పకు ఈ సమయంలో సౌకర్యంగా ఉంటుందని కూడా ట్విటిజెన్‌లు ఆలోచిస్తున్నారు. సీఎం ఆమెను ఒక ఆదర్శ మహిళా అధికారిగా కీర్తించారు. ఇంతకంటే కఠిమైన డ్యూటీలనే చేశారు శిల్పి. ఎ.కె.47 ధరించి ‘ఆపరేషన్’లలో పాల్గొన్నారు. దంతేవాడలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏర్పాటైన ‘దంతేశ్వరి ఫైటర్స్’ (మహిళా కమాండోలు) కు నాయకత్వం వహించారు. వాటికంటే కష్టమైన పని.. కరోనా లాక్డౌన్ నిబంధనల్ని జనం ఉల్లంఘించకుండా చూడటం అని ఇప్పుడామె గ్రహించే ఉంటారు. ‘‘నేను బయట ఉంటేనే.. వాళ్ల లోపల ఉంటారు’’ రోడ్డు మీద వెళుతూ అధాటున చూసిన వారికి మామూలు దుస్తుల్లో ఉన్న శిల్పా సాహు మొదట సాధారణ మహిళగా అనిపించవచ్చు. కానీ, గర్జించే ఆమె స్వరం.. ఆమె పోలీసు అన్న వాస్తవాన్ని ఆ వెంటనే తెలియజేస్తుంది. ‘వాపస్ జావో, ఘర్ జావో’ (వెనక్కు వెళ్లు.. ఇంటికి వెళ్లు) అని గట్టిగా అరచి చెప్పినా వినని వారికి ఆమె చేతిలోని లాఠీ చక్కగా అర్థమయ్యేలా చెప్పేందుకు సిద్ధమౌతుంది. ఏప్రిల్ 18 నుంచి దంతెవాడ జిల్లా (దక్షిణ బస్తర్) లాక్డౌన్లో ఉంది. ఆ రోజు నుంచీ శిల్ప లాక్డౌన్ డ్యూటీలో ఉన్నారు. ‘‘గర్భిణిగా ఉండి మీరు బయటికి రావడం ఎందుకు?’’ అనే ప్రశ్నకు.. ‘‘నేను బయట ఉంటేనే వాళ్లు లోపల ఉంటారు’’ అంటున్నారు శిల్ప. -
మహిళా పోలీస్తో జడేజా వాగ్వాదం
రాజ్‌కోట్: భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, ఆయన సతీమణి రివాబా వివాదంలో చిక్కుకున్నారు. ‘మాస్క్ పెట్టుకోలేదు... జరిమానా చెల్లించండి’ అని ప్రశ్నించిన మహిళా కానిస్టేబుల్‌తో వీరు వాగ్వాదానికి దిగారని సమాచారం. ప్రాథమిక సమాచారం మేరకు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. జడేజా తన భార్య రివాబాతో కలిసి రాత్రి 9 గంటల ప్రాంతంలో కారులో వెళ్తుండగా... మహిళా కానిస్టేబుల్ సోనాల్ గొసాయ్ వీరిని కిసాన్‌పరా చౌక్ దగ్గర ఆపింది. ఆ సమయంలో జడేజా మాస్క్‌ను ధరించి ఉన్నా... అతడి భార్య వేసుకోకపోవడంతో... జరిమానా చెల్లించాల్సిందిగా జడేజాను కోరింది. ఈ విషయంపై జడేజాకు, కానిస్టేబుల్‌కు మధ్య వాదన పెరిగి తీవ్రంగా దూషించుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై రాజ్‌కోట్ డీసీపీ మనోహర్ సింగ్ జడేజా స్పందించారు. తమ ప్రాథమిక దర్యాప్తులో జడేజా మాస్క్ వేసుకున్నాడని అయితే అతడి భార్య వేసుకోలేదని తేలినట్లు వెల్లడించారు. -
లేడీ అండ్ ఆర్డర్
ఆమె మంచికోసమే చెప్పి ఉంటారు. ‘వదిలెయ్.. వాళ్లు పెద్దవాళ్లు..’ అని! అంటే... డ్యూటీని వదిలేయమనా?! లా అండ్ ఆర్డర్‌ని వదిలేయమనా?! మనమేం చేయలేం, చేతులు ఎత్తేయమనా?! పోలిస్ అయింది.. పట్టుకోడానికి కానీ వదిలేయడానికా! మొత్తంగా ఉద్యోగాన్నే వదిలేసింది సునీత. ఆర్డర్లో ఉంచలేనప్పుడు యూనిఫామ్ ఎందుకనుకున్నట్లుంది. లేడీ ‘సింగం’ గర్జిస్తే ఎలా ఉంటుంది? లేడీ ‘సింగం’ తీక్షణంగా చూస్తే ఎలా ఉంటుంది? సినిమాల్లో కాదు. నిజంగానే ఒక లేడీ పోలీస్.. ‘లా అండ్ ఆర్డర్’ డ్యూటీలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? నెట్లోకి వెళ్లి చూడండి. ఒక ఆడియో, ఒక వీడియో! గత మూడు రోజులుగా దేశమంతా సునీతా యాదవ్ గర్జనని ఆడియోలో వింటోంది. ఆమె తీక్షణతను వీడియోలో చూస్తోంది. బాలీవుడ్ నటి స్వరాభాస్కర్.. ‘వారెవ్వా.. సునీతా!’ అని హ్యాట్సాఫ్ చెప్పారు. మరో నటి తాప్సీ పన్ను ‘సెల్యూట్ సునీతా’ అన్నారు. ఇండియన్ పోలిస్ ఫౌండేషన్.. సునీత ‘సెన్సాఫ్ డ్యూటీ’ని, ‘బ్రేవరీ’ని ప్రశంసించింది. ‘‘ఒక మహిళా పోలిస్ తన విధి నిర్వహణలో గట్టిగా నిలబడితే, ఆమె పైనున్న అధికారులు జారిపోకూడదు’’ అని ఫౌండేషన్ ఆమెకు గట్టి మద్దతునిస్తూ మాట్లాడింది. అయినా జారిపోయారు. ఒక్కొక్కరూ సునీత పక్కనుంచి తప్పుకున్నారు. మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొడుకు స్నేహితుడిని నోరు మూయిస్తున్న సునీత మొదట ఆమెను ఉన్నఫళంగా ఆమె చేస్తున్న వరచ్ఛ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ఫ్యూ నైట్ పెట్రోలింVŠ డ్యూటీ నుంచి తప్పించారు. తర్వాత ఆమెను సిక్ లీవుపై వెళ్లమన్నారు. తర్వాత ఆమెను సూరత్‌లోనే వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత ఆమెపై ఎంక్వయిరీ పెట్టించారు. పేరుకు అది ‘ఆనాటి ఘటన’పై ఎంక్వయిరీ. వాస్తవానికైతే సునీతపై ఎంక్వయిరీ. రిజైన్ చేసేశారు సునీత. తనంతట తను రాజీనామా చేసిందని గుజరాత్ పోలిస్ డిపార్ట్మెంట్ రిలీఫ్‌గా ఫీల్ అవచ్చు. సునీత ఎందుకు రిజైన్ చేయవలసి వచ్చిందో దేశమంతా చూసింది. అయితే ఆమె రాజీనామాను సంతోషంగా అంగీకరించడం ఆమె పైఅధికారులకు తేలికేమీ కాబోవడం లేదు. లాక్డౌన్ కర్ఫ్యూ నిబంధలను ఉల్లంఘించి ఐదుగురు స్నేహితులతో కారులో తిరుగుతున్న అధికార పార్టీ ఎమ్యెల్యే పుత్రరత్నాన్ని సునీత ఆపినందుకు, ఘర్షణకు దిగిన అతడిని బుక్ చేసినందుకు ఇంతా అయింది! ప్రకాష్ అతడి పేరు. వరచ్ఛ మార్గ్ నియోజకవర్గం ఎమ్మెల్యే కుమార్ కనాని కొడుకు. కుమార్ కనాని ఆరోగ్యశాఖ సహాయ మంత్రి కూడా. గత బుధవారం ప్రకాష్ తన ఫ్రెండ్స్‌ని వేసుకుని కారులో రోడ్డు మీదకు వచ్చినప్పుడు డ్యూటీలో ఉన్న సునీత అతణ్ణి ఆపి వివరాలు అడిగారు. ‘‘ఎమ్మెల్యే కొడుకుని’’ అన్నాడు ప్రకాష్. ఆధార్ కార్డు ఒకటి చాలు ఇన్ఫర్మేషన్ అంతా అందులోనే ఉంటుంది అన్నట్లు తండ్రి పేరు చెప్పి ఊరుకున్నాడు. సునీత ఊరుకోలేదు. కారులోంచి దింపి అతడిని, అతడి ఫ్రెండ్స్‌ని నిలబెట్టారు. ఎమ్మెల్యే కొడుగ్గా తనేం చేయగలడో చెప్పాడు ప్రకాష్. పోలీస్‌గా తన డ్యూటీ ఏంటో అది చేశారు సునీత. చట్టం ముందు అంతా సమానమే. జూలై 8 రాత్రి ఈ ఘర్షణ జరిగితే ఎమ్మెల్యే కొడుకును, అతడి స్నేహితులను అదుపులోకి తీసుకోడానికి నలభై ఎనిమిది గంటలు పట్టింది. వాళ్లను వదిలిపెట్టడానికి నాలుగు నిముషాలు కూడా పట్టలేదు. ‘‘నిన్ను ఇక్కడే, నువ్వు నిలుచున్న చోటే 365 రోజులు నిలబెట్టిస్తాను’’ అని సునీతను బెదిరించాడు ఆ ఎమ్మెల్యే కుమారుడు సునీతతో ఘర్షణకు దిగినప్పుడు! అయితే ఆ పంతం మరోలా నెరవేర్చుకున్నాడు. ఆ చోటులో ఆమె మళ్లీ నిలబడకుండా చేశాడు. అయితే అతడు పైచేయి సాధించింది సునీత మీద కాదు. పోలిస్ డిపార్ట్మెంట్ మీద. ఎమ్మెల్యే కొడుకును ఆపి ప్రశ్నిస్తున్నందుకు పై అధికారుల నుంచి సునీతకు ఫోను! సునీత యంగ్ పోలీస్ కానిస్టేబుల్. ‘చూసుకుని పోవడం’ అనే విద్య ఆమెకు ఇంకా పట్టుబడలేదు. రిజైన్ కూడా చేసేశారంటే అలాంటి విద్యలకు తను పట్టుబడటం ఆమెకు ఇష్టం లేదనే అర్థమౌతోంది. సునీత గురించి ఆమె ధైర్యం ఒక్కటే ఇప్పుడు ఆమె వ్యక్తిగత వివరాలలో ప్రతిచోటా కనిపిస్తోంది. అది చాలు.. గుజరాత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆమెకు ఒక ప్రమోషన్ ఇచ్చి తనని తను గౌరవించుకునేందుకు. ప్రమోషన్ అంటే ఏం లేదు. చేతికి లాఠీ ఇచ్చి, తిరిగి అదేచోట.. ఎక్కడైతే ఆమెను ఏడాది పాటు నిలబెడతానని ఎమ్మెల్యే పుత్రుడు శపథం చేశాడో.. సరిగ్గా అక్కడే మళ్లీ డ్యూటీ వెయ్యడం. అంత ధైర్యం డిపార్ట్మెంట్కి ఉందా?! -
షీ ఇన్స్పెక్టర్
పోలీస్ ఉద్యోగం మగాడిదనుకుంటారు... మగాడు తనను తాను పోలీస్ అనుకుంటాడు..ఇంట్లో పోలీస్.. ఆఫీస్‌లో పోలీస్.. తండ్రిగా పోలీస్.. అన్నగా పోలీస్.. భర్తగా పోలీస్..అలాంటి సమాజంలో ఒక షీ పోలీస్ ఆఫీసర్ ఎంతటి ఒత్తిడికి గురవుతుందన్నదే సోనీ కథ! ఢిల్లీ...చలికాలం.. చీకటి పడింది. ఒక అమ్మాయి సైకిల్ మీద వెళ్తోంది. కాస్త దూరమే వెళ్లాక వెనక సైకిల్ మీదే ఒకతను వెంటాడటం మొదలుపెట్టాడు. ఆమె పట్టించుకోకుండా ఇంకా ముందుకు సాగుతూనే ఉంది. అతను ఆమెను కామెంట్ చేస్తూ సీరియస్‌గా ఫాలో అవుతున్నాడు. ఓ చిన్న అడ్డదారిలోకి వెళ్లి ఆగుతుంది. అతనూ ఆగుతాడు. సైకిల్ దిగి.. అతన్ని పట్టుకుని కొడ్తుంది ఆమె. ఇంతలోకి ఓ మహిళా నాయకత్వంలోని పోలీసుల బృందం వచ్చి ఆమెను ఆపుతుంది. తన వెంటపడ్తున్న వ్యక్తిని కొట్టిన అమ్మాయి కూడా పోలీసే. పేరు సోనీ. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నాయకత్వం వహించిన మహిళ ఎస్.పి. కల్పన. సోనీ కూడా ఆమె దగ్గరే పనిచేస్తూంటుంది. నెట్‌ఫ్లిక్స్ ప్రొడక్షన్ ‘సోని’ అనే సినిమాలోనిది ఆ దృశ్యం. పోలీస్ వ్యవస్థలో వేర్వేరు కేడర్‌లో ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు మహిళల కథ ఇది. ఐపీఎస్‌గా ఎంత ధీశాలి అయినా ఇల్లు, కుటుంబ విషయాలకు వచ్చేసరికి సగటు ఒత్తిళ్లను తప్పక భరించే సాధారణ స్త్రీ ఆమె. భర్త కూడా ఐపీఎస్ అయితే.. తన ఉద్యోగంలో ఆయన జోక్యాన్ని సహించాల్సిన సర్వసాధారణ భార్యే ఆమె. సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో ఉన్న అమ్మాయికి ఈ భారం మరింత ఎక్కువ. పోలీస్ హైరార్కీలోని నిరంకుశత్వంతో పాటు అదనంగా మహిళా ఉద్యోగుల పట్ల ఉన్న వివక్ష, మధ్యతరగతి నివాసాల్లోని మోరల్ పోలీసింగ్, విలువల వల్లింపులు, వదిలించేసుకున్నా వీడని బంధాల బేడీలు.. ఆమె మోయాల్సిన బరువులు! రెండు జీవితాలు, రెండు నేపథ్యాలు, రెండు స్థాయిల మధ్య ఉన్న వ్యత్యాసాలు.. వీటన్నిటికీ స్థానం కల్పించిన సమాజపు బుద్ధి, తీరుకు ఫ్రేమే ‘సోనీ’ మూవీ. కథలోకి .. పైన చెప్పిన ఉపోద్ఘాతమే సినిమా స్టార్టింగ్ సీన్. అసలు ఈ కథకు ప్రేరణ.. 2012, నిర్భయ ఘటన. ఆ విషాదం తర్వాత ఢిల్లీలో మహిళా భద్రతను సవాల్‌గా తీసుకుని నేరం జరుగుతున్న, జరిగే ప్రమాదం ఉన్న పరిసరాలను గుర్తించే ఆపరేషన్ చేపడ్తుంది కల్పన. ఆ టాస్క్ కోసం ఓ టీమ్‌ను ఫామ్ చేస్తుంది. అందులో సోనీ కీలక వ్యక్తి. కల్పన ఆలోచనకు వేగంగా కార్యరూపం ఇవ్వగల సామర్థ్యం ఆమెది. అందులో భాగంగానే అలా రాత్రిపూట గస్తీకి వెళ్తారు. ఒకసారి ఒక నేవీ ఆఫీసర్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో సోనీ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే.. అతని దవడ పగలకొడ్తుంది సోనీ. ఆ వ్యక్తి రాజకీయంగా తనకున్న పలుకుబడితో సోనీ మీద క్రమశిక్షణ చర్య తీసుకునేలా ప్రెజర్ తెస్తాడు. దాంతో ఆమెను ఆ ఆపరేషన్ నుంచి తప్పించి రికార్డ్స్ రూమ్‌కి పరిమితం చేస్తారు. ఇది సోనీకే కాదు కల్పనకూ కష్టంగానే మారుతుంది. టాస్క్‌లో సోనీ రీ అప్పాయింట్మెంట్ కోసం కమిషనర్ అయిన తన భర్త సందీప్ సహాయం కోరుతుంది కల్పన. సాయమేమో కాని కింది ఉద్యోగులతో ఎలా ఉండాలో పాఠాలు చెప్తాడు. సబార్డినేట్స్ పట్ల అంత సానుభూతి అక్కర్లేదని క్లాస్ తీసుకుంటాడు. మౌనంగా వింటుంది. భర్త దగ్గర కల్పన పాత్ర అది. ఆమెకు పిల్లలు ఉండరు. అత్తగారు పిల్లల కోసం షంటుతూ ఉంటుంది. ఆడబిడ్డా తనకు మంచి గైనకాలజిస్ట్ తెలుసని, వెళ్లి కలవమని సలహా ఇస్తుంది. ఇక్కడా మౌనమే ఆమె ఆయుధం. ఆవేశం కల్పనకు వ్యతిరేకం సోనీ. అన్నిటికీ ఆవేశంగా రియాక్ట్ అవుతూంటుంది. సహనానికీ హద్దు ఉండాలి అన్నది ఆమె ఫిలాసఫి. కెరీర్లోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ అడ్డంకులను ఎదుర్కొంటుంది. భర్త నవీన్‌తో విడాకులైపోయి ఒంటరిగా ఉంటూంటుంది. అయినా రెండు రోజులకు ఒకసారి ఆమె ఉండే చోటికి వచ్చి ఇబ్బంది పెడ్తూంటాడు. చుట్టుపక్కల వాళ్లు సోనీ దగ్గర సొద పెడ్తూంటారు.. ఎన్నాళ్లు ఇలా ఒంటరిగా ఉంటావ్.. ఆడదానికి పెళ్లే పరమావధి ఎట్సెట్రా.. ఎట్సెట్రా అంటూ! నన్ను నేను చూసుకోగలను అని గట్టిగానే సమాధానమిస్తుంది సోనీ. ఆమె వ్యక్తిగత ఇబ్బందుల గురించి తెలుసుకున్న కల్పన సోనీ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపు తుంది. అంత ఆవేశం పనికిరాదని సుతిమెత్తగా హెచ్చరిస్తూంటుంది. లేడీస్ వాష్‌రూమ్‌లో.. ఒక రాత్రి.. పహారా కాస్తూ.. ఆకలిగా ఉంటే దార్లో ఉన్న హోటల్‌కి వెళ్తారు. టిఫిన్ ఆర్డర్ ఇచ్చాక వాష్ రూమ్‌కి వెళ్తుంది సోనీ. అప్పటికే అక్కడ తన అయిదేళ్ల కూతురితో ఓ అమ్మ ఉంటుంది క్యూలో. వాళ్లతో ఆ మాటా ఈ మాటా మాట్లాడ్తూండగానే ‘‘అమ్మా....అర్జంట్’’ అంటూ ఆ పాప ఇబ్బంది పడ్తుంది. అప్పుడు ఆ పాప తల్లి ‘‘చాలా సేపయింది. లోపల ఉన్నవాళ్లు బయటకే రాలేదు’’ అని చెప్తుంది సోనీతో. ‘‘అవునా?’’ అంటూ సోనీ వాష్‌రూమ్ తలుపు తడ్తుంది. రెస్పాన్స్ ఉండదు. మళ్లీ తడ్తుంది కొంచెం గట్టిగా. ఈసారీ నో రెస్పాన్స్. దబదబ బాదుతుంది సోనీ. ఒక్కసారిగా వాష్ రూమ్ తలుపు తెరుచుకుంటుంది. గుమ్మంలో జులపాలతో ఓ అబ్బాయి. లోపల మరో నలుగురు అబ్బాయిలు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్‌తో. ‘‘లేడీస్ వాష్‌రూమ్‌లో ఏం చేస్తున్నారు?’’ అంటూ ప్రశ్నిస్తుంది సోనీ. గుమ్మంలో ఉన్న అబ్బాయి అమర్యాదగా మాట్లాడ్తాడు. లోపలున్న వాళ్లు నవ్వుతారు. ‘‘మర్యాదగా బయటకు రండి’’ అంటూ హెచ్చరిస్తుంది. హేళన చేస్తూ తలుపు వేయబోతాడు. అడ్డుకుంటుంది సోనీ. బూతులు మొదలుపెడ్తాడు. చెంప చెళ్లు మనిపిస్తుంది సోనీ. కోపంతో ఆ అబ్బాయి సోనీ జుట్టుపట్టుకొని లోపలికి ఈడుస్తాడు. గొడవ పెద్దదవుతుంది. ఈ వివాదమూ సోనీ కెరీర్‌కే చుట్టుకుంటుంది. ఎందుకంటే అవతలి అబ్బాయి సెంట్రల్ కేబినెట్లో ఉన్న ఓ మంత్రికి ఎలక్షన్ ఫండింగ్ చేస్తున్న వ్యక్తి కొడుకు. ఈ సంఘటనలోనూ కల్పన భర్త నుంచి కల్పనకు సుద్దులు, బుద్ధులు, చీవాట్లు, జాగ్రత్తలు యాజ్‌యూజ్‌వల్. మరుసటి రాత్రి.. సోనీ వాళ్లింటికి వస్తుంది కల్పన. సోనీ చేతికి ఉన్న కట్టును చూస్తూ ‘‘ఈ గాయం వాడు చేసిందేనా?’’ ప్రశ్నిస్తుంది కల్పన. సోనీకి చిర్రెత్తుకొస్తుంది. ‘‘అన్నీ తెలిసీ మీరూ అలాగే మాట్లాడుతున్నారా?’’ అంటూ బరస్ట్ అవుతుంది సోనీ. ‘‘నువ్వు వాడి మీద చేయి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నేను అక్కడే ఉన్నా కదా? నాకు చెప్పి ఉంటే అరెస్ట్ చేసేవాళ్లం.ఈ గతి పట్టేది కాదు’’ అంటుంది కల్పన చాలా స్థిరంగా. ‘‘ఇప్పుడూ అరెస్టే కదా చేశాం’’ అని సోనీ అంటూండగానే ఆమె డైనింగ్ ఏరియా కిటికీ అద్దాలు భళ్లున పగుల్తాయి. కిటికీ వైపు దూసుకెళ్లి కిందకు చూస్తుంది. బైక్స్ మీద పారిపోతూ కనిపిస్తారు ఆకతాయిలు. నేను లేకపోతేనే.. ఇంట్లో దాడి జరిగిన రాత్రే సోనీ భర్త వస్తాడు. ‘‘నేనుంటే ఇలా జరిగేది కాదు’’ అంటాడు. తీక్షణంగా చూస్తుంది భర్తను. తల వంచుకుంటాడు. అప్పటిదాకా తను చేసిన తప్పులన్నిటినీ క్షమించి కలిసి ఉండటానికి ఒప్పుకోమని బతిమాలుతాడు సోనీని. ఇక నుంచి బాధ్యతగా ఉంటానని చెప్తాడు. అతనిని నమ్మక తప్పని పరిస్థితిని కల్పిస్తాడు. ఇటు ఉద్యోగంలో పై అధికారుల సపోర్ట్ లభించకపోయేసరికి రాజీనామా చేయాలని నిశ్చయించుకుంటుంది సోనీ. ఆ మర్నాడు కల్పన.. వాళ్ల ఆడపడచు ఇంటికి వెళ్తుంది. టెన్త్ క్లాస్ చదువుతున్న తన మేనకోడలు దిగులుగా తన గదిలో కూర్చుని ఉంటుంది. ఏమైంది అని అడిగితే.. పీరియడ్స్ వల్ల మాటిమాటికి వాష్‌రూమ్ వెళ్తుంటే క్లాస్‌లో బాయ్స్ ఏడిపించారని. తన ఫ్రెండ్స్ కూడా వంతపాడారని చెప్తుంది. ‘‘ఏడిస్తే ఎవరైనా ఏడిపిస్తారు. లెక్క చేయకపోతే ఎవరూ జోలికి రారు’’ అని ధైర్యం చెప్తుంది. తన మేనకోడలికి మోరల్ సపోర్ట్ ఇస్తూన్నప్పుడే సోనీ గుర్తొస్తుంది కల్పనకు. వెంటనే ఆమె దగ్గరకు బయలుదేరుతుంది.. ‘‘రసీదీ టికెట్’’ అనే అమృతా ప్రీతమ్ ఆటోబయోగ్రఫీ బుక్ తీసుకుని! దాన్ని సోనీకి ఇస్తుంది చదవమని. అలాగే రాజీనామా చేయొద్దనీ చెప్తుంది. ఆఫీస్‌లో.. లేడీస్ వాష్‌రూమ్‌లో చేరి సిగరెట్, మందు కొడ్తున్న వాళ్ల మీద బలమైన కేసులు పెట్టమని తన కింది అధికారులకు పురమాయిస్తుంది కల్పన.అన్ని ఒత్తిళ్లకూ ఫుల్స్టాప్ పెట్టి.. పని చేయడానికి సిద్ధ పడ్తుంది. టాస్క్‌ను ముందుకు సాగిస్తుంది. ఇక్కడితో ఎండ్ అయిన ఈ సినిమా అంతా దాదాపుగా సింగిల్ టేక్స్లో షూట్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేని ‘సోనీ’ ఇప్పటికే చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి వెళ్లింది. దర్శకుడు ఇవన్ అయ్యర్. సోనీగా.. గీతికా విద్యా ఒహ్లయాన్, కల్పనగా సలోనీ బాత్రా నటించారు. -
బుల్లెట్ రాణి పోరాటం
-
బుల్లెట్ రాణి పోరాటం
అవినీతి, అక్రమాలను సాగించే సంఘ విద్రోహ శక్తులపై ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి పోరాటం సాగించిందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘బుల్లెట్ రాణి’. నిషా కొఠారీ ప్రధాన పాత్రలో సాజిద్ ఖురేషీ దర్శకత్వంలో ఎం.ఎస్. యూసఫ్ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిషా మాట్లాడుతూ- ‘‘నీతీ, నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నా. సరికొత్త కథాకథనాలతో దర్శకుడు సాజిద్ ఈ చిత్రాన్ని బాగా తెరకెక్కించారు. ఇప్పటివరకు నేను చేసిన చిత్రాలన్నింటి కన్నా ఈ ‘బుల్లెట్ రాణి’ నాకెంతో ప్రత్యేకం. సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు. సాజిద్ ఖురేషీ మాట్లాడుతూ - ‘‘టైటిల్ రోల్‌కు న్యాయం చేయడానికి నిషా రెండు నెలల పాటు కసరత్తులు చేసింది. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం నిర్మించాం. ఇటీవల రషెస్ చూసుకుంటే చాలా సంతృప్తి అనిపించింది. నవంబర్ ద్వితీయార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. -
దుర్గా రాణీ సింగ్‌గా...
‘జజ్బా’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఐశ్వర్యారాయ్ కెరీర్ మంచి జోరు మీద ఉంది. ‘జజ్బా’లో లాయర్‌గా విభిన్నమైన పాత్రలో కనబడ్డ ఆమెను వరుసగా వైవిధ్యమైన పాత్రలే వరిస్తున్నాయి. పాకిస్తాన్ జైలులో మగ్గిన భారతీయ ఖైదీ సరబ్జీత్ సింగ్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న చిత్రంలోనూ, కరణ్‌జోహార్ తీస్తున్న ‘‘అయ్ దిల్ హై ముష్కిల్’లోనే ఆమె నటిస్తున్నారు. తాజాగా ఓ పోలీస్ పాత్ర ఆమెను వరించింది. ‘కహానీ’ ఫేం సుజోయ్ ఘోష్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యారట. ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఆధారంగా నిజజీవిత కథతో రూపొందనున్న చిత్రం ‘దుర్గా రాణీ సింగ్’. మొదట ఈ పాత్ర కంగనా రనౌత్, విద్యాబాలన్ చేస్తారనే వార్తలు వినిపించాయి. కానీ ఈ రోల్ ఐశ్వర్యారాయ్‌ను వరించింది. ఇటీవలే దర్శకుడు సుజోయ్ ఘోష్ ‘ద డివోషన్ ఆఫ్ మిస్టర్ ఎక్స్’, ‘దుర్గా రాణీ సింగ్’ కథలతో నన్ను సంప్రతించారు. కానీ, ‘దుర్గా...’ కథ నాకు బాగా నచ్చింది. అన్నీ కుదిరితే అదే చేసే చాన్స్ ఉంది’’ అని ఐశ్వర్యారాయ్ చెప్పారు. -
లేడీ పోలీస్
ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ అక్రమార్కుల ఆగడాలను ఎలా ఎదుర్కొందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘బుల్లెట్ రాణి’. నిషా కొఠారీ ప్రధాన పాత్రలో ఎం.ఎస్. యూసుఫ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాజిద్ ఖురేషీ దర్శకుడు. ఈ సినిమా ప్రచార చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో విడుదల అయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. త్వరలోనే పాటలను విడుదల చేయనున్నాం. నిషా కొఠారీ గ్లామర్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్‌గా నిలుస్తాయి’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత యూసుఫ్, ఇంకా చిత్ర యూనిట్ పాల్గొన్నారు. -
సూపర్ ఉమెన్ కాప్..
‘తలపైన మూడు సింహాల టోపీ.. ఖాకీ యూనిఫాం.. చేతిలో వైర్లెస్ సెట్.. నడుముకి అధునాతన ఆయుధం.. టూవీలర్‌పై రయ్‌న వచ్చిన ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ సెంటర్లో బండాపి చుట్టూ చూసి దగ్గరలో ఉన్న వారితో మాట్లాడి.. అక్కడ వారికి ఎటువంటి సమస్య లేదనగానే మరో ప్రాంతానికి దూసుకుపోవడమే..’ ఇదేదో సినిమా సీన్లా ఉంది కదూ.. అయితే త్వరలో ఢిల్లీ రోడ్లు ఇటువంటి దృశ్యాలకు వేదిక కానున్నాయి. న్యూఢిల్లీ: నగర రోడ్లపై త్వరలో అధునాతన ఆయుధాలతో ద్విచక్రవాహనాలపై మహిళా పోలీసులు పెట్రోలింగ్ డ్యూటీ చేస్తూ కనిపించనున్నారు. పోలీస్స్టేషన్లలో నమోదైన మహిళా సంబంధ కేసులను పరిష్కరించేందుకు, నగర ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ఢిల్లీ పోలీస్ శాఖలో కొత్తగా మహిళా పోలీసులను నియమించనున్నారు. ప్రస్తుతం శాఖలో పనిచేస్తున్న మహిళా పోలీసుల్లో చాలా కొద్దిమందికే మోటార్ సైకిల్ నడపడం తెలుసు. అందువల్ల పెట్రోలింగ్ డ్యూటీ చేసే వారికి స్కూటీలను కొనిచ్చేందుకు నిర్ణయించింది. నగరంలో మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, అకృత్యాలపై కేంద్ర హోం శాఖ దృష్టి సారించింది. ఏయే ప్రాంతాల్లో మహిళలపై ఎక్కువ దాడులు జరుగుతున్నాయో, ఏ పోలీస్స్టేషన్ల పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయో.. ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్ డ్యూటీ నిర్వహించేందుకు మహిళా పోలీస్ కానిస్టేబుళ్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు నగర పోలీస్ శాఖలో మహిళా పోలీసుల సంఖ్య భారీగా పెరగనుంది. పోలీసు అధికారుల తెలిపిన వివరాల ప్రకారం ఈ మహిళా పోలీసులు నగరంలో రాత్రి పూట కూడా పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తారు. ఒక్కో బృందంలో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటారు. ఈ బృందాలకు అందజేయడానికి ఎన్ని స్కూటీలు అవసరమవుతాయో పట్టిక తయారుచేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీని ఎంహెచ్ఏ కోరింది. ఈ బృందాలకు స్కూటీలతోపాటు వైర్లెస్ సెట్లు, అధునాతన ఆయుధాలు అందజేస్తారు. మామూలు బీట్ కానిస్టేబుళ్ల లాగే వీరికీ విధులు కేటాయించబడతాయి. అయితే వీరికి మహిళా కాలేజీలు, బాలికల పాఠశాలలు, మహిళా హాస్టళ్లు, మార్కెట్ల వద్దే ఎక్కువగా విధులున కేటాయిస్తారు. వీరికి స్కూటీలనే ఎందుకు అందజేస్తున్నారనే విషయమై ఒక ఉన్నత పోలీస్ అధికారి మాట్లాడుతూ..‘ చాలా తక్కువ మంది మహిళలే బైక్‌లను నడపుతారు. అవి ఎక్కువ బరువుండటంతో పాటు బ్యాలన్స్ చేయడం కూడా మహిళలకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి.. అదే స్కూటీలైతే తేలిగ్గా ఉంటాయి. చాలామంది మహిళలు చాలా సులభంగా వీటిని నడపగలుగుతారు.. అందుకే మహిళా కానిస్టేబుళ్లకు స్కూటీలను అందజేయాలనే నిర్ణయించాం..’ అని ఆయన వివరించారు. నగరవ్యాప్తంగా ఎంతమంది మహిళా కానిస్టేబుళ్లు, స్కూటీలు అవసరమో నివేదిక వీలైనంతర త్వరగా అందజేయాలని ఆయా రేంజ్‌లకు సంబంధించిన జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జేసీపీ)లకు సమాచారం అందించామని ఉన్నతాధికారులు తెలిపారు. నగరంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, వేధింపులను నిరోధించేందుకే ఎంహెచ్ఏ ఈ నిర్ణయం తీసుకుందని పోలీస్ వర్గాలు తెలిపాయి. కేంద్రంలో మోడీ సర్కార్ ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారి గత నెల 16వ తేదీన ఢిల్లీ పోలీస్ అధికారులతో కేంద్ర హోం మంత్రి సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా జాతీయ రాజధానిలో మహిళా భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. దాని ఫలితమే సూపర్ పోలీస్ కాప్‌ల ఏర్పాటని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
మహిళాధికారిని వేధిస్తున్న ఇన్స్పెక్టర్ అరెస్ట్
భువనేశ్వర్: ఒడిశాలో మహిళా పోలీస్ అధికారిని లైంగికంగా వేధిస్తున్న పోలీస్ ఇన్స్పెక్టర్ను క్రైం బ్రాంచ్ అధికారులు అరెస్ట్ చేశారు. అజిత్ కుమార్ స్వైన్ అనే అతను 13 సంవత్సరాలుగా మహిళా అధికారిని వేధిస్తున్నట్టు కేసు దాఖలైంది. తనను మానసికంగా, భౌతికంగా వేధించినట్టు బాధితురాలు కేసు పెట్టింది. ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి రెండు నెలలుగా విధులకు రాకుండా అజ్ఞాతంలో ఉన్న అజిత్‌ను బుధవారం భువనేశ్వర్‌లో అదుపులోకి తీసుకున్నారు. గురువారం నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టినట్టు క్రైం బ్రాంచ్ పోలీసులు చెప్పారు.