దుర్గా రాణీ సింగ్‌గా...
‘జజ్బా’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఐశ్వర్యారాయ్ కెరీర్ మంచి జోరు మీద ఉంది. ‘జజ్బా’లో లాయర్‌గా విభిన్నమైన పాత్రలో కనబడ్డ ఆమెను వరుసగా వైవిధ్యమైన పాత్రలే వరిస్తున్నాయి. పాకిస్తాన్ జైలులో మగ్గిన భారతీయ ఖైదీ సరబ్‌జీత్ సింగ్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న చిత్రంలోనూ, కరణ్‌జోహార్ తీస్తున్న ‘‘అయ్ దిల్ హై ముష్కిల్’లోనే ఆమె నటిస్తున్నారు. తాజాగా ఓ పోలీస్ పాత్ర ఆమెను వరించింది. ‘కహానీ’ ఫేం సుజోయ్ ఘోష్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యారట.
ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఆధారంగా నిజజీవిత కథతో రూపొందనున్న చిత్రం ‘దుర్గా రాణీ సింగ్’. మొదట ఈ పాత్ర కంగనా రనౌత్, విద్యాబాలన్ చేస్తారనే వార్తలు వినిపించాయి. కానీ ఈ రోల్ ఐశ్వర్యారాయ్‌ను వరించింది. ఇటీవలే దర్శకుడు సుజోయ్ ఘోష్ ‘ద డివోషన్ ఆఫ్ మిస్టర్ ఎక్స్’, ‘దుర్గా రాణీ సింగ్’ కథలతో నన్ను సంప్రతించారు. కానీ, ‘దుర్గా...’ కథ నాకు బాగా నచ్చింది. అన్నీ కుదిరితే అదే చేసే చాన్స్ ఉంది’’ అని ఐశ్వర్యారాయ్ చెప్పారు.