డేరింగ్ అండ్ డాషింగ్ కానిస్టేబుల్ సునీతా యాదవ్ (ఫైల్)
ఆమె మంచికోసమే చెప్పి ఉంటారు. ‘వదిలెయ్.. వాళ్లు పెద్దవాళ్లు..’ అని! అంటే... డ్యూటీని వదిలేయమనా?! లా అండ్ ఆర్డర్‌ని వదిలేయమనా?! మనమేం చేయలేం, చేతులు ఎత్తేయమనా?! పోలిస్ అయింది.. పట్టుకోడానికి కానీ వదిలేయడానికా! మొత్తంగా ఉద్యోగాన్నే వదిలేసింది సునీత. ఆర్డర్‌లో ఉంచలేనప్పుడు యూనిఫామ్ ఎందుకనుకున్నట్లుంది.
లేడీ ‘సింగం’ గర్జిస్తే ఎలా ఉంటుంది? లేడీ ‘సింగం’ తీక్షణంగా చూస్తే ఎలా ఉంటుంది? సినిమాల్లో కాదు. నిజంగానే ఒక లేడీ పోలీస్.. ‘లా అండ్ ఆర్డర్’ డ్యూటీలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? నెట్‌లోకి వెళ్లి చూడండి. ఒక ఆడియో, ఒక వీడియో! గత మూడు రోజులుగా దేశమంతా సునీతా యాదవ్ గర్జనని ఆడియోలో వింటోంది. ఆమె తీక్షణతను వీడియోలో చూస్తోంది. బాలీవుడ్ నటి స్వరాభాస్కర్.. ‘వారెవ్వా.. సునీతా!’ అని హ్యాట్సాఫ్ చెప్పారు. మరో నటి తాప్సీ పన్ను ‘సెల్యూట్ సునీతా’ అన్నారు. ఇండియన్ పోలిస్ ఫౌండేషన్.. సునీత ‘సెన్సాఫ్ డ్యూటీ’ని, ‘బ్రేవరీ’ని ప్రశంసించింది. ‘‘ఒక మహిళా పోలిస్ తన విధి నిర్వహణలో గట్టిగా నిలబడితే, ఆమె పైనున్న అధికారులు జారిపోకూడదు’’ అని ఫౌండేషన్ ఆమెకు గట్టి మద్దతునిస్తూ మాట్లాడింది. అయినా జారిపోయారు. ఒక్కొక్కరూ సునీత పక్కనుంచి తప్పుకున్నారు.
మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొడుకు స్నేహితుడిని నోరు మూయిస్తున్న సునీత
మొదట ఆమెను ఉన్నఫళంగా ఆమె చేస్తున్న వరచ్ఛ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ఫ్యూ నైట్ పెట్రోలింVŠ డ్యూటీ నుంచి తప్పించారు. తర్వాత ఆమెను సిక్ లీవుపై వెళ్లమన్నారు. తర్వాత ఆమెను సూరత్‌లోనే వేరే చోటికి ట్రాన్స్‌ఫర్ చేశారు. తర్వాత ఆమెపై ఎంక్వయిరీ పెట్టించారు. పేరుకు అది ‘ఆనాటి ఘటన’పై ఎంక్వయిరీ. వాస్తవానికైతే సునీతపై ఎంక్వయిరీ. రిజైన్ చేసేశారు సునీత. తనంతట తను రాజీనామా చేసిందని గుజరాత్ పోలిస్ డిపార్ట్‌మెంట్ రిలీఫ్‌గా ఫీల్ అవచ్చు. సునీత ఎందుకు రిజైన్ చేయవలసి వచ్చిందో దేశమంతా చూసింది. అయితే ఆమె రాజీనామాను సంతోషంగా అంగీకరించడం ఆమె పైఅధికారులకు తేలికేమీ కాబోవడం లేదు.
లాక్‌డౌన్ కర్ఫ్యూ నిబంధలను ఉల్లంఘించి ఐదుగురు స్నేహితులతో కారులో తిరుగుతున్న అధికార పార్టీ ఎమ్యెల్యే పుత్రరత్నాన్ని సునీత ఆపినందుకు, ఘర్షణకు దిగిన అతడిని బుక్ చేసినందుకు ఇంతా అయింది! ప్రకాష్ అతడి పేరు. వరచ్ఛ మార్గ్ నియోజకవర్గం ఎమ్మెల్యే కుమార్ కనాని కొడుకు. కుమార్ కనాని ఆరోగ్యశాఖ సహాయ మంత్రి కూడా. గత బుధవారం ప్రకాష్ తన ఫ్రెండ్స్‌ని వేసుకుని కారులో రోడ్డు మీదకు వచ్చినప్పుడు డ్యూటీలో ఉన్న సునీత అతణ్ణి ఆపి వివరాలు అడిగారు. ‘‘ఎమ్మెల్యే కొడుకుని’’ అన్నాడు ప్రకాష్. ఆధార్ కార్డు ఒకటి చాలు ఇన్‌ఫర్మేషన్ అంతా అందులోనే ఉంటుంది అన్నట్లు తండ్రి పేరు చెప్పి ఊరుకున్నాడు. సునీత ఊరుకోలేదు. కారులోంచి దింపి అతడిని, అతడి ఫ్రెండ్స్‌ని నిలబెట్టారు. ఎమ్మెల్యే కొడుగ్గా తనేం చేయగలడో చెప్పాడు ప్రకాష్. పోలీస్‌గా తన డ్యూటీ ఏంటో అది చేశారు సునీత.
చట్టం ముందు అంతా సమానమే. జూలై 8 రాత్రి ఈ ఘర్షణ జరిగితే ఎమ్మెల్యే కొడుకును, అతడి స్నేహితులను అదుపులోకి తీసుకోడానికి నలభై ఎనిమిది గంటలు పట్టింది. వాళ్లను వదిలిపెట్టడానికి నాలుగు నిముషాలు కూడా పట్టలేదు. ‘‘నిన్ను ఇక్కడే, నువ్వు నిలుచున్న చోటే 365 రోజులు నిలబెట్టిస్తాను’’ అని సునీతను బెదిరించాడు ఆ ఎమ్మెల్యే కుమారుడు సునీతతో ఘర్షణకు దిగినప్పుడు! అయితే ఆ పంతం మరోలా నెరవేర్చుకున్నాడు. ఆ చోటులో ఆమె మళ్లీ నిలబడకుండా చేశాడు. అయితే అతడు పైచేయి సాధించింది సునీత మీద కాదు. పోలిస్ డిపార్ట్‌మెంట్ మీద.
ఎమ్మెల్యే కొడుకును ఆపి ప్రశ్నిస్తున్నందుకు పై అధికారుల నుంచి సునీతకు ఫోను!
సునీత యంగ్ పోలీస్ కానిస్టేబుల్. ‘చూసుకుని పోవడం’ అనే విద్య ఆమెకు ఇంకా పట్టుబడలేదు. రిజైన్ కూడా చేసేశారంటే అలాంటి విద్యలకు తను పట్టుబడటం ఆమెకు ఇష్టం లేదనే అర్థమౌతోంది. సునీత గురించి ఆమె ధైర్యం ఒక్కటే ఇప్పుడు ఆమె వ్యక్తిగత వివరాలలో ప్రతిచోటా కనిపిస్తోంది. అది చాలు.. గుజరాత్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆమెకు ఒక ప్రమోషన్ ఇచ్చి తనని తను గౌరవించుకునేందుకు. ప్రమోషన్ అంటే ఏం లేదు. చేతికి లాఠీ ఇచ్చి, తిరిగి అదేచోట.. ఎక్కడైతే ఆమెను ఏడాది పాటు నిలబెడతానని ఎమ్మెల్యే పుత్రుడు శపథం చేశాడో.. సరిగ్గా అక్కడే మళ్లీ డ్యూటీ వెయ్యడం. అంత ధైర్యం డిపార్ట్‌మెంట్‌కి ఉందా?!
Comments
Please login to add a commentAdd a comment