
రాజ్‌కోట్: భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, ఆయన సతీమణి రివాబా వివాదంలో చిక్కుకున్నారు. ‘మాస్క్ పెట్టుకోలేదు... జరిమానా చెల్లించండి’ అని ప్రశ్నించిన మహిళా కానిస్టేబుల్‌తో వీరు వాగ్వాదానికి దిగారని సమాచారం. ప్రాథమిక సమాచారం మేరకు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. జడేజా తన భార్య రివాబాతో కలిసి రాత్రి 9 గంటల ప్రాంతంలో కారులో వెళ్తుండగా... మహిళా కానిస్టేబుల్ సోనాల్ గొసాయ్ వీరిని కిసాన్‌పరా చౌక్ దగ్గర ఆపింది. ఆ సమయంలో జడేజా మాస్క్‌ను ధరించి ఉన్నా... అతడి భార్య వేసుకోకపోవడంతో... జరిమానా చెల్లించాల్సిందిగా జడేజాను కోరింది. ఈ విషయంపై జడేజాకు, కానిస్టేబుల్‌కు మధ్య వాదన పెరిగి తీవ్రంగా దూషించుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై రాజ్‌కోట్ డీసీపీ మనోహర్ సింగ్ జడేజా స్పందించారు. తమ ప్రాథమిక దర్యాప్తులో జడేజా మాస్క్ వేసుకున్నాడని అయితే అతడి భార్య వేసుకోలేదని తేలినట్లు వెల్లడించారు.