Jadeja Given Out On Review After DRS Mix-Up, With UltraEdge Shown For Wrong Ball - Sakshi
Sakshi News home page

#Jadeja: ఔటయ్యింది ఒక బంతికి.. చూపించింది మరో బంతిని

Published Sat, Jul 22 2023 8:20 AM

Jadeja Given-Out Review-DRS-Mix-up-With UltraEdge Shown Wrong-Ball - Sakshi

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగించే యోచనలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు టీమిండియా ఆలౌట్‌ కాగా.. రెండోరోజు ఆట ముగిసే సమయానికి విండీస్‌ వికెట్‌ నష్టానికి 86 పరుగులతో ప్రతిఘటిస్తుంది. విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 352 పరుగులు వెనుకబడి ఉంది.

ఇక టీమిండియా ఇన్నింగ్స్‌లో కోహ్లి సెంచరీతో మెరిస్తే.. అశ్విన్‌, జడేజా, యశస్వి జైశ్వాల్‌లు అర్థసెంచరీలతో రాణించారు. ఇక కోహ్లితో కలిసి ఐదో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పిన జడేజా ఔటైన తీరు సక్రమమే అయినప్పటికి డీఆర్‌ఎస్‌లో ఎంత లోపం మరోసారి బయటపడింది.

విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ 104వ ఓవర్‌లో కీమర్‌ రోచ్‌ వేసిన ఆఖరి బంతిని జడేజా డ్రైవ్‌షాట్‌ ఆడే క్రమంలో మిస్‌ అయ్యాడు. దీంతో బంతి కీపర్‌ జోషువా దసిల్వా చేతిలో పడింది. కీపర్‌ వెంటనే ఔట్‌ అంటూ అప్పీల్‌ చేశాడు. కానీ ఫీల్డ్‌ అంపైర్‌ మరాయిస్‌ ఎరాస్మస్‌ నాటౌట్‌ అని ప్రకటించాడు. దీంతో విండీస్‌ ఆటగాళ్లు రివ్యూకు వెళ్లారు.

కాగా రివ్యూను పరిశీలించిన టీవీ అంపైర్‌ మైకెల్‌ గాఫ్‌ తొలుత అన్ని యాంగిల్స్‌లోనూ బంతి బ్యాట్‌కు తాకిందా లేదా అని చూశారు. కాని బంతి బ్యాట్‌కు దగ్గరగా వెళ్లింది కానీ తాకిందా లేదా అన్నది క్లారిటీ రాలేదు. దీంతో థర్డ్‌ అంపైర్‌ అల్ట్రాఎడ్జ్‌కు రిక్వెస్ట్‌ చేశాడు. బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకుతూ స్పైక్‌ కనిపించింది. దీంతో థర్డ్‌ అంపైర్‌ జడేజాను ఔట్‌ అని ప్రకటించాడు. అయితే ఇక్కడ ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. తొలుత అల్ట్రాఎడ్జ్‌లో జడ్డూ ఔటైన బంతికి బదులుగా.. జడ్డూ ఆడిన మరో బంతిని డిస్‌ప్లే చేయడం వైరల్‌గా మారింది.

అయితే యాదృశ్చికంగా రెండింటిలోనూ జడ్డూ బ్యాట్‌కు బంతి తగిలివెళ్లినట్లుగా స్పైక్‌ కనిపించింది. ఇక్కడ విండీస్‌ ఆటగాళ్లను.. అటు థర్డ్‌ అంపైర్‌ను తప్పుబట్టలేం. ఎందుకంటే జడేజా ఔట్‌లో ఎలాంటి పొరపాటు లేదు. కేవలం సాంకేతిక లోపంతో జడ్డూ ఔటైన బంతిని కాకుండా తప్పుడు బంతిని చూపించడండలో తప్పు జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: 352 పరుగుల వెనుకంజలో విండీస్‌.. భారత్‌ పట్టు బిగిస్తుందా? 

Advertisement
Advertisement