మైనర్లు కాదు..ముదుర్లు
మైనర్లు కాదు..ముదుర్లు
Published Mon, Oct 24 2016 11:36 PM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM
► షీ బృందాలకు చిక్కుతోంది కుర్రాళ్లే
►18 నుంచి 20 ఏళ్ల లోపు వారు 41 శాతం
► తర్వాతి స్థానంలో 21 నుంచి 40 ఏళ్ల వయస్సువారు
► మైనర్లు 23 శాతం
► నగర షీ టీమ్‌కు రెండేళ్లు పూర్తి
► 20 శాతం తగ్గిన నేరాలు
సాక్షి, సిటీబ్యూరో: అమ్మాయిల్ని వేధించడంలో కుర్రకారు అగ్రభాగంలో నిలిచింది. కాలేజీలు, బస్టాప్‌లు, రైల్వేస్టేషన్లు...ఇలా బహిరంగ ప్రాంతాల్లో యువతులను వేధిస్తూ...షీ బృందాలకు చిక్కడంలోనూ ముందు వరుసలో నిలిచి ఆకతాయితనాన్ని చాటుతున్నారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో షీ టీమ్స్ ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం నగర సీసీఎస్ డీసీపీ అవినాశ్ మహంతితో కలిసి క్రైమ్స్ అండ్ సిట్ అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా రెండేళ్లలో షీ టీమ్స్ సాధించిన ఫలితాలు, కేసుల వివరాలను వెల్లడించారు. అమ్మాయిలను వేధిస్తూ పట్టుబడిన వారిలో 18 నుంచి 20 ఏళ్ల లోపు వారు 41 శాతం మంది ఉండగా, ఆ తర్వాతి స్థానంలో 21 నుంచి 40 ఏళ్ల వయస్సు వారు 35 శాతం మంది ఉన్నారు. మైనర్లు 23 శాతం మంది ఉండటం గమనార్హం. ఇంట్లో బుద్ధిమంతులుగా ఉంటున్న మైనర్లు...బయటకు రాగానే బస్టాప్‌లు, పాఠశాలల్లో అమ్మాయిలను వేధిస్తూ షీ బృందాలకు అడ్డంగా దొరికిపోతున్నారు.
బహిరంగ ప్రాంతాల్లో వేధిస్తే నిర్భయ...
నగరంలో ఇప్పటివరకు షీ టీమ్ అమ్మాయిలను వేధిస్తున్న 800 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. వారిలో 222 మంది మైనర్లు ఉండగా, 577 మంది మేజర్లు ఉన్నారు. ఈ ఆకతాయిలపై ఇప్పటివరకు రెండు పీడీ యాక్ట్ కేసులు, ఒక పోక్సో యాక్ట్ కేసు, 40 నిర్భయ కేసులు, 33 ఐపీసీ, ఐటీ యాక్ట్ కేసులతో పాటు 1897 పెట్టీ కేసులను నమోదుచేశాయి. వీరిలో 41 మంది జైలుశిక్ష పడగా, 242 మందికి జరిమానా విధించారు. 392 మందికి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. అయితే బహిరంగ ప్రాంతాల్లో మహిళలను వేధిస్తే నిర్భయ కేసులు నమోదు చేస్తున్నారు.
20 శాతం తగ్గిన నేరాలు...
షీ టీమ్ అవిర్భావం నుంచి ఇప్పటివరకు మహిళలపై జరిగే నేరాలు దాదాపు 20 శాతం వరకు తగ్గాయి. 2014 సెప్టెంబర్ వరకు 1,606 నేరాలు జరగగా, 2014 సెప్టెంబర్ నుంచి 2015 సెప్టెంబర్ వరకు 1521, 2015 సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 1296 నేరాలు జరిగినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. అలాగే షీ టీమ్స్ 200 కాలేజీలు, 100 పాఠశాలలు, 300 ప్రైవేట్,వర్కింగ్ ఉమె¯Œ్స హాస్టల్‌లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. బస్టాప్, రైల్వేస్టేషన్లు, పార్కులు, షాపింగ్ మాల్స్, లేబర్ అడ్డాలు, మురికివాడ ప్రాంతాలు, సినిమా థియేటర్లు, ఆర్‌టీసీ బస్సులు షీ సభ్యులు నిఘా వేసి ఆకతాయిలను పట్టుకుంటున్నారు.
బస్సులో వేధిస్తే నేరుగా ఠాణాకే...
‘మహిళల భద్రతపై భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. బస్సులో ఎవరైనా మహిళలు వేధింపులకు గురైతే వెంటనే ఆ బస్సును సమీప ఠాణాకు తీసుకొచ్చేలా ఆ సిబ్బందికి అవగాహన కల్పిస్తాం. కళాశాలలో జరిగే వేధింపుల సమస్యలను షీ టీమ్ దృష్టికి తీసుకొచ్చేందుకు ఆయా విద్యాసంస్థల నుంచి నోడల్ ఆఫీసర్లుగా ఓ విద్యార్థిని, మహిళా లెక్చరర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. షీకి పట్టుబడుతున్న వారిలో మైనర్లు బాగానే ఉండటంతో స్కూళ్లలోనూ అమ్మాయిలను వేధిస్తే భవిష్యత్ కష్టాలే ఉంటాయనే సంకేతాన్ని తీసుకెళ్లేందుకు విస్తృత కార్యక్రమాలు చేపడతాం. వందశాతం మహిళల భద్రతకు సిటీ సేఫ్‌గా ఉండేలా కృషి చేస్తామ’ని స్వాతిలక్రా అన్నారు.
Advertisement
Advertisement