
పోలీస్ స్టేషన్లలో 33 శాతం మహిళా ఉద్యోగులు
♦ మహిళల రక్షణపై అవగాహన కార్యక్రమంలో డీజీపీ
♦ పాల్గొన్న హీరో రాంచరణ్, మంచు లక్ష్మి
హైదరాబాద్: రానున్న రోజుల్లో రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో 33 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు నిర్భయంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆదివారం నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర సీఐడీ, హైదరాబాద్ సిటీ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో మహిళల రక్షణ, శిక్షణపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహిళలు ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రతి పోలీస్‌స్టేషన్‌లో 33 శాతం మహిళా ఉద్యోగులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఇది హైదరాబాద్‌కే పరిమితం కాకుండా గ్రామాలు, పట్టణాలకు కూడా అమలయ్యేలా చూస్తామన్నారు. నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో 100 ‘షీ’టీమ్‌లు పనిచేస్తున్నాయన్నారు. మహిళా భద్రతను దృష్టిలో ఉంచుకుని లక్ష సీసీ కెమెరాలతో అన్ని ప్రాంతాలను కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేసి 24/7 నిఘా ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. పుట్టిన పాపకు మంచి డ్రెస్‌లు వేసి అందంగా ఉన్నావని ఎలా అంటామో.. ఎదిగిన తరువాత కూడా తల్లిదండ్రులు ధైర్యం, భరోసా ఇవ్వాలని నటుడు రాంచరణ్‌తేజ్ సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, కేవలం మన దేశంలోనే మహిళలను దేవతలా పూజించే గొప్ప సంప్రదాయం ఉందని నటి మంచు లక్ష్మి అన్నారు. అనంతరం మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్, ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలనే అంశాలపై విద్యార్థినులకు, యువతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కరాటే చాంపియన్ సైద లఖన్, ఏసీబీ డెరైక్టర్ చారుసిన్హా, ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ జితేందర్, అధికారులు వేణుగోపాల్‌రావు, అనసూయ, సునీత, వాణీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
షీటీమ్స్ వెబ్‌సైట్ ఆవిష్కరణ..
షీ టీమ్స్ వెబ్‌సైట్, పాటల సీడీ, పోస్టర్‌ను డీజీపీ అనురాగ్‌శర్మ, నటుడు రామ్‌చరణ్‌తేజ్, నటి మంచు లక్ష్మి, నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి, స్వాతి లక్రా, సౌమ్యమిశ్రా తదితరులు ఆవిష్కరించారు. అనంతరం ప్రతి మహిళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవితంలో ఎదురయ్యే సంఘటనలను గుణపాఠంగా భావించి ముందుకు సాగాలని ప్రతిజ్ఞచేశారు.