మందేసి..చిందేసి | she teams atack on rave party | Sakshi
Sakshi News home page

మందేసి..చిందేసి

Published Tue, Feb 20 2018 12:04 PM | Last Updated on Tue, Feb 20 2018 12:04 PM

she teams atack on rave party - Sakshi

పట్టుబడిన యువతులు ,పోలీసుల దాడితో చెల్లాచెదురైనా తినుబండారాలు

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలులో ఆదివారం అర్ధరాత్రి రేవ్‌ పార్టీ కలకలం సృష్టించింది. నగరంలోని ఒక ప్రదేశంలో ఒక  ఎరువుల కంపెనీ తమ డీలర్లకు విందును ఏర్పాటు చేసి ముగ్గురు యువతులతో ఆశ్లీల నృత్యాలు చేయించింది. ఈ పార్టీలో గతంలో నగరంలోని వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో పని చేసిన సీఐ, ఇద్దరు వ్యవసాయాధికారులు ఉన్నట్లు సమాచారం.  ఈ విషయాన్ని తెలుసుకున్న షీ టీమ్‌ పోలీసులు రాత్రి 11 గంటల సమయంలో దాడి చేశారు. అయితే సదరు సీఐతో సహా అధికారులు తప్పించుకొని పారిపోయారు. అక్కడ సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

అర్ధరాత్రి దాడి..
గతంలో కర్నూలులో రేవ్‌ పార్టీలు, ఆశ్లీల నృత్యాలు చేసిన దాఖలాలు లేవు. అయితే ఒక్కసారిగా ఆదివారం అర్ధరాత్రి రేవ్‌ పార్టీపై షీటీమ్‌ పోలీసులు దాడి చేయడం కలకలం సృష్టిస్తోంది. నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ ఎరువుల కంపెనీ తమ డీలర్లకు విందు పార్టీని ఏర్పాటు చేసింది. ఇందులో నృత్యాలు చేయడానికి హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువతులను తీసుకొచ్చింది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన పార్టీ రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. రాత్రి 9 గంటల నుంచి యువతులు ఆశ్లీలంతో నృత్యాలు చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. దాదాపు 25 మంది ఉన్న పార్టీలో అందరూ తాగి తూగుతూ ఆశ్లీలంగా యువతులతో కలసి నృత్యాలు చేస్తున్నారు. ఇంతలోనే విషయం షీ టీమ్‌ ఎస్‌ఐ విజయలక్ష్మీకి ఫోన్‌ ద్వారా చేరింది.

వెంటనే ఆమె రాత్రి 11 గంటల ప్రాంతంలో దాడి చేయగా.. సీఐ, ఇద్దరు వ్యవసాయాధికారుల గుట్టు రట్టయింది. పోలీసులను చూడగానే ఆ సీఐ వారిపైనే దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. చివరకు పోలీసులను భయభ్రాంతులకు గురి చేసి వారిని తోచుకుంటూ సీఐతో సహా అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇంతలోనే టూ టౌన్‌ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సీఐ డేగల ప్రభాకర్‌ విందు పార్టీ చేసిన హాల్‌లో ఉన్న సీసీ ఫుటేజ్‌ని స్వాధీనం చేసుకున్నారు.అంతేగాక  ప్రసాదరెడ్డి, పాండు, భానుచందర్‌రెడ్డి, ఎస్‌కే షంషద్‌ బేగం, మహేందర్‌రెడ్డి,  ఎరువుల కంపెనీ మేనేజర్లు సురేష్, సుబ్బారావు, పవన్‌ కల్యాణ్‌రెడ్డి, కొమ్ము వెంకటేశ్వర్లు, ముగ్గురు యువతులను అరెస్టు చేశారు. ఇందులో ముగ్గురు యువతులపై తప్ప మిగిలిన 9 మందిపై కేసులు నమోదు చేశారు. 

సీఐపై కేసుకు వెనుకాడుతున్న పోలీసులు
రేవ్‌ పార్టీలో పోలీసులు సీసీ ఫుటేజిని స్వాధీనం చేసుకోవడం కీలకంగా మారింది. అరెస్టు చేసేందుకు వెళ్లిన షీ టీమ్‌ పోలీసులను పక్కకు తోచి పారిపోయిన సీఐతోసహా వ్యవసాయాధికారుల వ్యవహారం కీలకంగా మారింది. అయితే సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకొని దాదాపు 30 గంటలకుపైగా అయినా ఇంకా చూస్తున్నామని పోలీసులు చెబుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. సీఐను కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిస్తున్నాయి.

సదరు సీఐ జిల్లాలోని ఓ ప్రముఖ ప్రజాప్రతినిధిని ఆశ్రయించి పోలీసులపై కేసు లేకుండా ఒత్తిడి చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే  సమయంలో డిపార్టుమెంట్‌ పరువు వీధిన పడకుండా చూసేందుకు కొందరు పోలీసులు అధికారులు కూడా రంగంలోకి దిగి సీఐపై కేసు నమోదు కాకుండా చూస్తున్నట్లు సమాచారం. మరోవైపు సదరు సీఐ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా, ఎరువుల కంపెనీ పార్టీకి వీఆర్‌లో ఉన్న సీఐ ఎందుకెళ్లాడనేది అంతుచిక్కని ప్రశ్న. ఈ విషయంపై పోలీసులు లోతుగా విచారణ జరపాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement