సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు విభాగం మహిళా రక్షణకు పెద్దపీట వేస్తోంది. ఓ పక్క షీ–టీమ్స్ ద్వారా క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న అధికారులు... సామాజిక మాధ్యమాల ద్వారానూ సహాయసహకారాలు అందిస్తున్నారు. పోలీసు–ప్రజలకు వారధిగా ఏర్పాటు చేసిన మొబైల్ యాప్ ‘హాక్–ఐ’లోనూ ఇందుకు సంబంధించి ప్రత్యేక అంశాలను చేర్చారు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఎస్‌ఓఎస్...
విపత్కర పరిస్థితుల్లో అతివలకు అండగా ఉండేందుకు ‘ఎస్‌ఓఎస్’ విభాగం ఏర్పాటైంది. ‘హాక్–ఐ’లోని ఈ విభాగంలోకి ప్రవేశించిన తర్వాత ప్రాథమికంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. హెల్ప్, డేంజర్ వంటి అంశాలను పొందుపరచడంతో పాటు సన్నిహితులు, స్నేహితులకు చెందిన ఐదు ఫోన్ నెంబర్లనూ ఫీడ్ చేయాలి. ‘క్రియేట్’ నొక్కడం ద్వారా దీని షార్ట్‌కట్ మెబైల్ స్క్రీన్‌పై వస్తుంది. అత్యవసర సమయాల్లో ఈ ‘ఎస్‌ఓఎస్’ను ప్రెస్ చేస్తే చాలు...జోనల్ డీసీపీ, డివిజనల్ ఏసీపీలతో పాటు సమీపంలో ఉన్న పెట్రోలింగ్ వాహనాలకు సెల్‌ఫోన్ వినియోగదారుల లోకేషన్ జీపీఎస్ వివరాలతో సహా చేరుతుంది. పొందుపరిచిన నెంబర్లకూ సమాచారం వెళ్తుంది. ఓసారి ‘ఎస్‌ఓఎస్’ను నొక్కిన తర్వాత 9 సెకండ్ల కౌంట్‌డౌన్ ఉంటుంది. ఎవరైనా పొరపాటున ప్రెస్ చేసి ఉంటే ఈ సమయంలో క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అధికారులు రంగంలోకి దిగి జీపీఎస్ ద్వారా బాధితురాలు ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు.
ఉమెన్ ట్రావెల్ మేడ్ ఈజీ...
ప్రయాణాల్లో మహిళలకు ఉపకరించేందుకు ‘హాక్–ఐ’లో ఏర్పాటు చేసిన విభాగమే ఉమెన్ ట్రావెల్ మేడ్ ఈజీ. ప్రయాణం ప్రారంభానికి ముందు యాప్‌లోని ఈ విభాగంలోకి ప్రవేశించిన తర్వాత సదరు మహిళ/యువతి ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తున్నారో (డెస్టినేషన్) ఫీడ్ చేయాల్సి ఉంటుంది. వారు ఎక్కుతున్న బస్సు, ఆటో, క్యాబ్ నెంబర్లను ఫొటో లేదా మాన్యువల్‌గా నమోదు చేయాలి. జీపీఎస్ పరిజ్ఞానంతో పనిచేసే ఈ విభాగం ద్వారా ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి అది పూర్తయ్యే వరకు కమిషనరేట్‌లోని ఐటీ సెల్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. నిర్దేశించిన డెస్టినేషన్ కాకుండా సదరు వాహనం వేరే మార్గంలో ప్రయాణిస్తే పోలీసులే గుర్తించి ప్రయాణికురాలిని సంప్రదిస్తారు. మార్గమధ్యంలో ఇబ్బంది ఎదురైనా క్షణాల్లో ఫిర్యాదు చేసేందుకు ఓ బటన్ ఏర్పాటు చేశారు. ప్రయాణికురాలు సురక్షితంగా గమ్యం చేరిన తర్వాత సమాచారం ఇచ్చే వరకు పర్యవేక్షణ కొనసాగుతుంది. ఈ మధ్యలో ఎప్పుడు అవసరమైనా నిమిషాల్లో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుంటారు.
నిరంతర పర్యవేక్షణ
పోలీసులకు సంబంధించిన అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులు, సలహాలు, సూ చనలను నిరంతరం పర్యవేక్షిస్తుంటాం. మహిళల కోస ం ఏర్పాటు చేసిన విభాగాలను ఐటీ సెల్‌లో ఉండే సిబ్బ ంది 24 గంటలూ గమనిస్తూ అందుబాటులో ఉంటారు. – ఐటీ సెల్ అధికారులు
మూడున్నరేళ్లుగా ‘షీ’ సేవలు...
దేశంలోనే తొలిసారిగా షీ–బృందాల కాన్సెప్ట్ 2014 అక్టోబర్ 24న హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. యువతులు, మహిళల రక్షణ కోసం సుశిక్షితమైన కొన్ని బృందాలను పోలీసు విభాగం ద్వారా ప్రభుత్వం రంగంలోకి దింపింది. సాధారణంగా ఎవరైనా మహిళలను వేధిస్తూ దొరికినా అడ్డంగా బుకాయిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు వీడియో ఎవిడెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆయా ప్రాంతాల్లో మాటువేసే షీ–బృందాలు తొలుత ఆకతాయిల వైఖరిపై వీడియో రికార్డింగ్ చేస్తాయి. ఆపైనే వారిని పట్టుకోవడంతో పాటు స్టేషన్‌కు తరలించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నాయి. మహిళల భద్రతకు సంబంధించి హైదరాబాద్ నగరం దేశంలోనే ఉత్తమం అంటూ ‘నెస్ట్ అవే అనే ఆన్‌లైన్’ సంస్థ గతేడాది నిర్వహించిన ఆన్‌లైన్ సర్వే తేల్చింది. ఈ ఘనత సాధించడం వెనుక షీ–టీమ్స్ పాత్ర ఎనలేనిది. వాటి పనితీరు, స్పందనపై అధికారులు ప్రైవేట్ సంస్థలతో సర్వేలు చేయిస్తూ ఫీడ్ బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment