మహిళల రక్షణ కోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన ‘షీ టీమ్స్’ ప్రభావం కొంత మేర కనిపిస్తోంది. ఈవ్‌టీజర్లతో పాటు మహిళలతో
► కౌన్సెలింగ్‌లతో సరిపెడుతున్న పోలీసు యంత్రాంగం
► ఇప్పటివరకు కేసుల నమోదు అంతంత మాత్రమే
► పాస్‌పోర్టు ఫొటోతో పాటు హామీ పత్రం తీసుకుంటున్న వైనం
► ఫిర్యాదుల విషయంలో పెరుగుతున్న యువతుల భాగస్వామ్యం
► త్వరలోనే మండల స్థాయికి షీటీమ్స్ పంపే యోచనలో ఎస్పీ
► సబ్‌డివిజన్ల వారీగా సిబ్బందిని మరింత పెంచాల్సిన అవసరం
► క్షేత్రస్థాయిలో మరింత పటిష్టపరచాల్సిన నిఘా
► సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఫిర్యాదులకు అవకాశం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మహిళల రక్షణ కోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన ‘షీ టీమ్స్’ ప్రభావం కొంత మేర కనిపిస్తోంది. ఈవ్‌టీజర్లతో పాటు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల ఆగడాలకు చెక్‌పెట్టేందుకు గాను నాలుగు నెలల క్రితం ఏర్పాటు చేసిన షీటీమ్స్ జిల్లాలో సంచలనాలేవీ సృష్టించకపోయినా సానుకూల ఫలితం వైపే వెళుతున్నాయనే భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కళాశాలలకు వెళ్లే యువతలపై జరిగే ఆగడాలకు కళ్లెం వేసే దిశలో షీటీమ్స్ వెళుతున్నా క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం కావాలనే అభిప్రాయం జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతోంది. సబ్‌డివిజన్ స్థాయిలో ఏర్పాటు చేసిన షీటీమ్స్‌ను మరింత విస్తృత పర్చాలని, టీమ్స్‌లో సిబ్బందిని పెంచడంతో పాటు వారి పనితీరును ప్రత్యేకంగా సమీక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి షీటీమ్స్ పనితీరు సంతృప్తికరంగానే ఉన్నా మహిళలపై నేరాలు మరింత అదుపులోనికి రావాలంటే వీటి విస్తృతి పెరగాలనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. జిల్లా పోలీస్‌బాస్ విక్రమ్‌జీత్‌దుగ్గల్ నేతృత్వంలో సీసీఎస్ డీఎస్పీ సునీతామోహన్ పర్యవేక్షణలో నడుస్తోన్న ఈ బృందాలు మరింత విస్తృతం కావాలని, మండల స్థాయిలో ఈ టీమ్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది.
ప్రస్తుతానికి కౌన్సెలింగ్‌తో సరి
షీటీమ్స్ ఆధర్యంలో గస్తీ ఆశించిన స్థాయిలో జరగడం లేదనే భావన జిల్లా ప్రజల్లో కనిపిస్తోంది. సబ్‌డివిజన్ స్థాయిలో ఎస్‌ఐ స్థాయి అధికారి నేతృత్వంలో నలుగురైదుగురు పోలీసు సిబ్బందితో ఏర్పాటు చేసిన షీటీమ్స్ ఆకతాయిలను స్వయంగా గుర్తించి శిక్షించడం ద్వారానే వారిలో భయం కలుగుతుంది. అయితే, జిల్లాలో షీటీమ్స్ ప్రస్తుతానికి పురుటినొప్పులు పడుతున్నాయనే చెప్పాలి. జిల్లా స్థాయిలో పర్యవేక్షణ బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే దానిపై కూడా సమీక్ష జరపాల్సి ఉంది. ఇటీవల జరిగిన ఓ సంఘటనను పరిశీలిస్తే... షీటీమ్‌లో సభ్యుడైన ఓ హెడ్‌కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగి ఉదయం నుంచి సాయంత్రం వరకు గస్తీ నిర్వహించాల్సి ఉండగా, మధ్యాహ్నమే ఆయన విధుల నుంచి వెళ్లిపోయి తన సొంత కార్యక్రమాల్లో బిజీగా ‘మునిగి’ తేలడం లాంటి ఘటనలు జిల్లాలో షీటీమ్స్ పనితీరుకు ఆదిలోనే ఆటంకాలు కలిగిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతానికి ఎవరైనా షీటీమ్‌కు ఫిర్యాదు చేస్తే ఆ నిందితులను తీసుకువచ్చి పోలీస్‌స్టేషన్లలో కౌన్సెలింగ్ ఇచ్చి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వదిలివేస్తున్నారు. ఆ నిందితుల పాస్‌పోర్ట్‌తో పాటు వారి నుంచి మరోసారి తప్పు చేయబోమని హామీ పత్రం కూడా తీసుకుంటున్నారు.
అంతవరకు ఆకతాయిలకు చెక్ పెట్టేందుకు ఉపయోగపడేదే కానీ, ఫిర్యాదును బట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఫిర్యాదు వచ్చినప్పుడే కాకుండా గస్తీలో భాగంగా ఆకతాయిలను గుర్తించి వారిని జైళ్లకు పంపితే మార్పు మరింత వేగవంతమవుతుందనే అభిప్రాయం జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు ఫిర్యాదుల విషయంలో యువతుల భాగస్వామ్యం పెరగడం షీటీమ్స్ సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతుండడం, మరోవైపు సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తుండడంతో యువతులు షీటీమ్స్‌ను ఆశ్రయించేందుకు సంశయించడంలేదు. ముఖ్యంగా షీటీమ్స్‌ను మండల స్థాయికి కూడా త్వరలోనే పంపాలనే యోచనలో జిల్లా ఎస్పీ ఉన్నట్టు తెలుస్తోంది.
జిల్లాలో షీటీమ్స్ పనితీరు ఇది..
జిల్లాలో మొత్తం 6 షీటీమ్ బృందాలున్నాయి. పోలీసులు సబ్‌డివిజన్‌కు ఒకటి చొప్పున షీటీమ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. నల్లగొండ, భువనగిరి, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో ఒక్కొక్క షీటీమ్ బృందం చొప్పున గస్తీ నిర్వహిస్తోంది. ఒక్క షీటీమ్ బృందంలో ఒక ఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక మహిళా కానిస్టేబుల్ వుంటుంది. మొత్తం ఈబృందంలో 30 మంది పోలీసులున్నారు. సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో ఎక్కువగా విద్యాసంస్థలు ఉండటంతో కోదాడకు అదనంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కేవలం 2 కేసులను మాత్రమే నమోదు చేశారు. మహిళల వెంట పడుతున్న 200 మంది యువతులకు షీటీమ్ బృందాలు కౌన్సిలింగ్ నిర్వహించాయి. తరచుగా మహిళలను వేధించేవారిలో మార్పు తీసుకొచ్చేందుకు రోజు లేదా వారానికోసారి, లేదా రెండు రోజుల కొసారి చొప్పున సమీప ప్రాంతం పోలీసుస్టేషన్‌లోని రిజిస్టర్‌లో సంతకం పెట్టిస్తున్నారు. దాదాపు వేధింపులకు పాల్పడే వారిలో మార్పుతీసుకొచ్చేందుకు వారి కుటుంబ సభ్యులను కూడా పిలిచి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ సునితామోహన్ తెలిపారు. భువనగిరి డివిజన్‌లో విద్యార్థులకు షీటీమ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సబ్ డివిజన్‌లో షీటీం ఎస్‌ఐకి ఇప్పటి వరకు 3 దరఖాస్తులు అందాయి.
దేవరకొండ సబ్ డివిజన్‌లో షీ టీమ్ పనితీరు చెప్పుకోదగిన స్థాయిలో లేదు. ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక కేసు నమోదయింది. మరో రెండు చోట్ల ఆకతాయిలకు కౌన్సెలింగ్ ఇచ్చామని పోలీసులు తెలుపుతున్నారు. మిర్యాలగూడ డివిజన్‌లో రెండు షీటీమ్స్ ఉన్నాయి. ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. ప్రస్తుతం విద్యా సంస్థలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో షీ టీమ్ పోలీసులు వచ్చి రెండు నెలలు గడుస్తోంది. షీ టీమ్ సిబ్బంది పట్టణంలోని జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ర్యాగింగ్, మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలను నిరోధించేందుకు గాను అవగాహన సదస్సులు, ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. ఇప్పటి వరకు 76 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. షీ టీమ్‌కు స్పందన భాగానే ఉందని చెప్పొచ్చు.
షీటీమ్స్ ఏం చే స్తాయి?
మహిళలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో షీటీమ్ బృందాలు రహస్యంగా గస్తీ తిరుగుతున్నాయి. విద్యార్థుల్లా బ్యాగ్‌లు వేసుకుని పెన్‌కెమెరాల ద్వారా పోకిరీల ఆగడాలను రికార్డింగ్ చేస్తున్నాయి. కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, బస్టాండు, ఇతర రద్దీ ప్రాంతాల్లో షీటీమ్ నిఘా ఉంటుంది. షీటీమ్ బృందాలు రహస్యంగా జనంలో కలిసిపోయి పెన్‌కెమెరా ద్వారా మహిళలను వేధించేవారి ఆగడాలను రికార్డింగ్ చేస్తున్నారు. మహిళలు రద్దీ ఎక్కువగా వుండే టీ తాగినట్లుగా, ఫోన్ మాట్లాడుతున్నట్లుగా , ఎవరికోసమో వేచిచూస్తున్నట్లుగా పోకిరీలపై నిఘా పెడుతున్నారు.
ఫిర్యాదు చేయవచ్చిలా...
మహిళలు, యువతులకు సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉంటే 100 నెంబర్‌కు ఫోన్‌చేయడంతో పాటు పోకిరీల ఆగడాలను తెలియజేసేందుకు షీటీమ్ వ్యాట్సప్ 9963393970, ్ఛఝ్చజీ : జటజ్ఛ్ట్ఛ్చిఝఃజఝ్చజీ.ఛిౌఝ, ్టఠీజ్ట్ట్ఛీట : జటజ్ఛ్ట్ఛ్చిఝ, జ్చఛ్ఛిఛౌౌజు:జ టజ్ఛ్ట్ఛ్చిఝ సమాచారం ఇవ్వచ్చు.
ఈవ్‌టీజింగ్ తగ్గింది - ఎస్.పుష్పలత, టీచరు, మిర్యాలగూడ
షీ టీమ్ వలన ఆకతాయిల బెడద తగ్గింది. కానీ కొంత మందికి మాత్రమే షీటీమ్స్ ఉన్నట్టు తెలుసు. పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో షీటీమ్ రావడం చాలా మంచిది. గతంలో రోడ్డుపై మహిళలు, విద్యార్థినిలు పాఠశాలలు, కళాశాలల నుంచి ఇంటికి వెళ్లాలంటే చాల ఇబ్బందులు పడేవారు.