
మహిళా భక్తుల భద్రతకు పెద్దపీట
సాక్షి, సిటీబ్యూరో: వినాయక నిమజ్జన ఉత్సవాల్లో మహిళా భక్తులతో అనుచితంగా వ్యవహరించే వారిపై సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల షీ– టీ మ్స్ నిఘా వేయనున్నాయి. ఈవ్‌టీజింగ్ చేస్తూ పట్టుబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నాయి. నగర శివారు ప్రాంతాలైన సరూర్‌నగర్ ట్యాంక్, సఫిల్‌గూడ చెరువు, కాప్రా చెరువుతో పాటు చర్లపల్లి చెరువుల వద్ద జరిగే నిమజ్జనోత్సవంలో పెద్ద సంఖ్యలో బాలికలు, యువతులు, మహిళలు పాల్గొంటారు. ఇక్కడికి ఏటికేడు గణపతి విగ్రహాలతో వచ్చే మహిళాభక్తుల సంఖ్య పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఈసారి షీ బృందాలు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాయి. దాదాపు 100 మంది సిబ్బంది బృందాలుగా విడిపోయి ఆకతాయిలపై కన్నేసి ఉంచనున్నాయి. ఎక్కడా ఎవరైనా అమ్మాయిలను వేధిస్తున్నట్టు సమాచారం వచ్చినా, వీరి కంటపడినా అరెస్టు చేస్తారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ జోన్లతో పాటు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్, మల్కాజిగిరి జోన్లలోని నిమజ్జన యాత్ర మార్గాల్లో గస్తీ నిర్వహిస్తారు. బాధితులు 100కు కాల్ చేస్తే వెంటనే ఘటనాస్థలిలో వీరు వాలిపోయేలా ఏర్పాట్లు చేశారు.
‘మఫ్టీ’తో నిఘా...
నిమజ్జనోత్సవంలో దొంగలు రెచ్చిపోయే అవకాశముంది. మహిళలు ఒంటి నిండా నగలు ధరించి నిమజ్జన యాత్రలో పాల్గొంటారు. ఇదే అదునుగా భావించి జనాల మధ్యలోనే దొంగలు తమ పనికానిచ్చే అవకాశముంది. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పె ట్టుకొని దొంగలను కట్టడి చేసేందుకు ఈసారి దాదాపు 12కు పైగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వీరి లో కొందరు పోలీసు డ్రెస్సులోనే విధులు నిర్వహిస్తుం డగా, మరికొందరు మఫ్టీలో నిఘా వేయనున్నారు.
సీసీలతో పర్యవేక్షణ...
కమిషనరేట్లలోని ముఖ్యకూడళ్ల నుంచి హుస్సేన్‌సాగర్ వరకు జరిగే వినాయక శోభాయాత్రను బలగాల పహారాతో పాటు నిఘా నేత్రాలతో నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా పూర్తి చేసేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గణేశ్ శోభా యాత్ర ను అధికారులు వీక్షిస్తూ ఎప్పటికప్పుడూ స్థానిక పోలీ సు సిబ్బందికి మార్గనిర్దేశనం చేస్తారు.
నిమజ్జన యాత్ర ల్లో లక్షలాది మంది భక్తులతో పాటు వేలాది వినాయకులు తరలివస్తాయి. పోలీసులు జంక్షన్లలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలతో పాటు కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటుచేసిన నిఘా నేత్రాలతో ఆయా ప్రాంతాల్లో గణేశుడి నిమజ్జన ర్యాలీల పర్యవేక్షణ కోసం పోలీసులు ఉపయోగిస్తున్నారు. సీసీ కెమెరా మౌంట్ వెహికల్‌లను, అశ్విక దళాలను ఇప్పటికే భద్రత కోసం వినియోగిస్తున్నారు.