
పురుషుల కంటే ఎక్కువ
చెల్లింపుల్లోనూ మగువలే మెరుగు
క్రిఫ్ హైమార్క్ నివేదిక
ముంబై: ఇంటి బాధ్యతల్లో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలు.. కుటుంబం, వృత్తిపరమైన అవసరాలకు రుణాలను తీసుకోవడానికీ వెనుకాడడం లేదు. గతేడాది యాక్టివ్ రుణ గ్రహీతల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నట్టు క్రెడిట్ బ్యూరో సంస్థ ‘క్రిఫ్ హైమార్క్’ తెలిపింది.
రుణాలు తీసుకోవడమే కాదు, వాటిని సకాలంలో తిరిగి చెల్లించడంలోనూ పురుషులతో పోల్చితే మహిళలే మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు వెల్లడించింది. 2024 డిసెంబర్ నాటికి యాక్టివ్ మహిళా రుణగ్రహీతలు 10.8 శాతం పెరిగి 8.3 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. అదే సమయంలో పురుష రుణ గ్రహీతల్లో వృద్ధి 6.5 శాతంగానే ఉన్నట్టు వెల్లడించింది. ‘‘రుణాల విషయంలో పురుషుల కంటే స్త్రీలే మెరుగైన ప్రవర్తన చూపిస్తున్నారు. బంగారం రుణాలు మినహా మిగిలిన రుణాల్లో 91 నుంచి 180 రోజుల వరకు చెల్లింపులు నిలిపివేసిన రుణ గ్రహీతల్లో మహిళలు తక్కువగా ఉన్నారు’’అని ఈ నివేదిక తెలిపింది.
గృహ రుణాలు, వ్యాపార రుణాలు, వ్యవసాయం, ట్రాక్టర్ల రుణాలు, ప్రాపర్టీ రుణాలు, విద్యా రుణాల్లో మహిళల తీరు మెరుగ్గా ఉన్నట్టు వెల్లడించింది. వినియోగ రుణాల్లోనూ (కన్జ్యూమర్) మగవారి కంటే చెల్లింపుల పరంగా మహిళల ప్రవర్తనే మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. 2024 చివరికి మొత్తం మహిళా రుణ గ్రహీతలు 18 శాతం పెరిగి 36.5 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. రుణాల్లో 35 ఏళ్లలోపు వారు ఎక్కువగా తీసుకుంటున్నారు. మహిళలకు సంబంధించి గృహ రుణాలు, వ్యాపార రుణాలు, ప్రాపర్టీ రుణాలు, ఆటో రుణాలు, క్రెడిట్‌కార్డ్, విద్యా రుణాల్లో మహారాష్ట్ర ముందున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment