ఆ అధికారం ప్రభుత్వాలకుంది
మహిళాభ్యున్నతి, సాధికారిత లక్ష్యంగా బాలికలు, మహిళా విద్యా సంస్థల్లోని బోధనా, బోధనేతర సిబ్బంది పోస్టులన్నింటినీ మహిళలతోనే భర్తీ
- మహిళా విద్యా సంస్థల్లో పోస్టుల భర్తీపై హైకోర్టు
- ముగ్గురు నలుగురి కోసం మొత్తం ప్రక్రియను ఆపడం సరికాదు
సాక్షి, హైదరాబాద్: మహిళాభ్యున్నతి, సాధికారిత లక్ష్యంగా బాలికలు, మహిళా విద్యా సంస్థల్లోని బోధనా, బోధనేతర సిబ్బంది పోస్టులన్నింటినీ మహిళలతోనే భర్తీ చేసే అధికారం రాజ్యాంగంలోని అధికరణ 15(3) కింద ప్రభుత్వాలకు ఉందని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. పోస్టులన్నింటినీ మహిళల చేతే భర్తీ చేయడం రాజ్యాంగంలోని అధికరణ 15(4), 16(4)కు విరుద్ధం కాదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు పలు తీర్పులు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపింది. ముగ్గురు నలుగురి కోసం పోస్టుల భర్తీ ప్రక్రియ మొత్తాన్ని నిలిపేయడం సరికాదంది.
సాంఘిక, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ గురుకుల బాలికలు, మహిళ విద్యా సంస్థల్లో బోధనా, బోధనేతర సిబ్బంది పోస్టులన్నింటినీ మహిళలతో భర్తీ చేసేందుకు వీలుగా ప్రభుత్వం జారీ చేసిన జీవో 1274పై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగించవచ్చునని, అయితే ఈ జీవో కింద జరిగే నియామకాలన్నీ తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.
అది వివక్ష చూపడమే అవుతుంది
జీవో 1274ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను విచారించిన సింగిల్ జడ్జి, జీవోపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసింది. బుధవారం ఈ అప్పీళ్లపై ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.సత్యంరెడ్డి, బూర రమేశ్‌లు వాదనలు వినిపిస్తూ... పోస్టులన్నింటినీ మహిళల చేతే భర్తీ చేయడం వివక్ష చూపడమే అవుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న షీ టీమ్స్‌లో పురుషులకు సైతం స్థానం కల్పిస్తున్న ప్రభుత్వం, బాలికలు, మహిళ విద్యా సంస్థల్లో భర్తీ చేసే పోస్టుల్లో మాత్రం వారికి అవకాశం కల్పించకపోవడం వివక్ష చూపడమేనన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, రిట్ పిటిషనర్ల వాదనలతో విభేదించింది. ఒకవేళ అంతిమంగా ఈ వ్యాజ్యాల్లో పిటిషనర్లు విజయం సాధిస్తే వారికి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి, నిబంధనల మేర పదోన్నతులు కూడా కల్పించే అవకాశం ఉందని తెలిపింది.