
సాక్షి, సిటీబ్యూరో: ‘మహిళల భద్రత మన అందరి బాధ్యత’ అనే నినాదంతో హైదరాబాద్ షీ టీమ్స్ నిర్వహించ తలపెట్టిన ‘వీఆర్–1’ రన్ ఈనెల 17న ఆదివారం పీపుల్స్ ప్లాజా కేంద్రంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ షీ టీమ్స్ ఇంచార్జ్, అదనపు పోలీసు కమిషనర్ శిఖా గోయెల్ గురువారం కార్యక్రమ వివరాలు వెల్లడించారు. మహిళ భద్రతలో సిటీ పోలీసులు షీ టీమ్స్ తీసుకుంటున్న చర్యలతో దేశంలోనే హైదరాబాద్‌కు మహిళలకు రక్షణలో సురక్షితమైన నగరంగా గుర్తింపు వచ్చిందన్నారు. షీ టీమ్స్ 4వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వీఆర్–1 రన్‌తో మహిళల భద్రత మన అందరి బాధ్యత అని గుర్తుచేయడంతో పాటు జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటి వరకు 5 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. నగర వాసులు ఈ రన్‌లో పాల్గొనేందుకు భరోసా కేంద్రం, ఆన్‌లైన్‌లో శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఆదివారం ఉదయం 6.30 గంటలకు నెక్లెస్ రోడ్డులో రన్‌ను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రారంభిస్తారన్నారు. ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరికి రేసు కిట్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు సినీ నటులు, సెలబ్రిటీలు పాల్గొంటారన్నారు.