
నగర వేదికగా ఘనంగా శారీ రన్
సంప్రదాయ దుస్తుల్లో సాగర తీరాన కలర్‌ఫుల్ పరుగు
తనైరా, జేజే యాక్టివ్ భాగస్వామ్యంతో నిర్వహణ
తెలుగు సంస్కృతి, సంప్రదాయం, సౌందర్యానికి ప్రతీక చీరకట్టు.. అలాంటి చీరకట్టులోని ఔన్నత్యాన్ని నలుదిశలా చాటిచెప్పేలా నగర నారీమణులు ఉత్సాహంగా శారీ రన్‌లో పాల్గొన్నారు. అద్భుతమైన చీరకట్టుకు తామే బ్రాండ్ అంబాసిడర్లమనేలా వివిధ రకాల చీరకట్టుతో హాజరయ్యారు. ఆదివారం ఉదయం ట్యాంక్ బండ్ వేదికగా నారీమణులు తెలుగు సంప్రదాయ చీరకట్టుతో పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్ మీదుగా శారీ రన్‌లో పాల్గొని తిరిగి పీపుల్స్ ప్లాజా చేరుకున్నారు.
సుప్రసిద్ధ బ్రాండ్ తనైరా, ఫిట్‌నెస్ కంపెనీ జేజే యాక్టివ్ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ శారీ రన్‌ను తనైరా సీఈఓ అంబుల్ నారాయణ్, జేజే యాక్టివ్ కోచ్ ప్రమోద్ ప్రారంభించారు. తనైరా శారీ రన్ ఐక్యత, స్ఫూర్తి చిహ్నంగా మహిళలలోని స్త్రీతత్వం, ఫిట్‌నెస్‌కు ప్రేరణగా నిర్వహించినట్లు అంబుల్ నారాయణ్ తెలిపారు. మహిళల ఆరోగ్యం, సమగ్రతను ప్రోత్సహించేందుకు మొదటి ఎడిషన్‌ను 2020లో పూణె, బెంగళూరు, హైదరాబాద్‌లో నిర్వహించామని రెండో ఎడిషన్‌ను మరోసారి హైదరాబాద్‌లో నిర్వహించినట్లు తెలిపారు.
చదవండి: ఊబకాయంపై పోరు : 10 మంది కీలక వ్యక్తులను నామినేట్ చేసిన పీఎం మోదీ
చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి
ఉత్సాహంగా సాగిన శారీ రన్‌లో మహిళలు అందమైన చీరకట్టుతో హాజరుకాగా.. కొందరు బుల్లెట్లు తోలుతూ, మరికొందరు సైకిళ్లు తొక్కుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున సాగర తీరంలో శారీ రన్‌లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని రన్‌లో పాల్గొన్న పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.

సుమారు మూడు వేల మందికిపైగా రన్‌లో పాల్గొన్నారని నిర్వాహకులు చెబుతున్నారు. వీరంతా ఫినిషింగ్ పాయింట్‌లో సెల్పీలు, గ్రూఫ్ ఫొటోలు దిగారు. జేజే యాక్టివ్ కోచ్ ప్రమోద్ ఆధ్వర్యంలో కార్యక్రమానికి ముందు వామ్ అప్ ఫిట్‌నెస్, జుంబా చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment