ఆడపిల్లల్ని వేదిస్తే తాట తీస్తారు! | Sakthi Teams Give a Push to Women Safety in Vizianagaram | Sakshi
Sakshi News home page

ఆడపిల్లల్ని వేదిస్తే తాట తీస్తారు!

Published Thu, Jul 25 2019 9:37 AM | Last Updated on Thu, Jul 25 2019 9:39 AM

Sakthi Teams Give a Push to Women Safety in Vizianagaram - Sakshi

ప్రత్యేక యూనిఫాంలో బైక్‌లపై శక్తి టీమ్‌

ఆడపిల్ల కనిపిస్తే చాలు వెకిలి చేష్టలు మొదలెడతారు. వెంటపడతారు. వేధిస్తారు. పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు ఎవర్నీ వదలరు. ఒంటరిగా కనిపిస్తే చాలు అఘాయిత్యాలకు పాల్పడతారు.. ఇకపై వారి ఆటలు సాగవు. కన్నెత్తి చూస్తే కుళ్లబొడుస్తారు. మాట జారితే తాట తీస్తారు. ఆడపిల్లల్ని వేధించే వారిపై అపర కాళికలవుతారు. వారే శక్తి టీమ్‌ సభ్యులు. మహిళల రక్షణ కోసం ఎస్పీ రాజకుమారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన బృందమే ఈ శక్తి టీమ్‌. ఎలాంటి సమస్యనైనా సమర్థవంతంగా ఎదుర్కొనగలిగేలా ఈ టీమ్‌ను తయారుచేసి రంగంలోకి దింపారు. ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌లో ఆకట్టుకుంటూ బైక్‌పై రయ్‌ మంటూ దూసుకుపోతూ.. విద్యార్థినులు, మహిళలకు అవగాహన కలిగిస్తూ.. తామున్నామనే భరోసా కల్పిస్తున్నారు.

సాక్షి, విజయనగరం: ప్రస్తుతం మహిళలపై ఇంటా.. బయటా అఘాయిత్యాలు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి. ఇంట్లో భర్త రోజూ వేధిస్తున్నా.. బయటి ప్రపంచానికి చెప్పుకోలేని మహిళలెందరో ఉన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో సహ విద్యార్థో.. ఉపాధ్యాయుడో.. అక్కడ పనిచేసే సిబ్బందో శారీరకంగా, మానసికంగా నరకయాతన చూపిస్తున్నా బయటికి చెప్పుకోలేని దుస్థితి. రోడ్లపై వెళ్తుంటే అసభ్యకరంగా ప్రవర్తించే ఆకతాయిలు.. కార్యాలయాల్లో ఇబ్బంది పెట్టే తోటి ఉద్యోగులు ఇలా పురుషుల ద్వారా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పరువు పోతుందనో.. సమాజం ఏమనుకుంటుందనో భావంతో బాధిత మహిళలు మౌనంగా ఉండిపోతున్నారు. అలాంటి వారికి అండగా నిలుస్తున్నారు శక్తి టీమ్‌ సభ్యులు. చట్టాలపై అవగాహన కలిగించి చైతన్యపరుస్తున్నారు. ఫలితంగా.. జిల్లా వ్యాప్తంగా బాధితురాళ్లు తమకు జరిగిన అన్యాయాలపై శక్తి టీమ్‌కు ఫోన్‌లో సమాచారమందిస్తున్నారు.

24 మందితో టీమ్‌ల ఏర్పాటు
ఎస్పీ బి.రాజకుమారి ఈ ఏడాది జూన్‌ నెలలో శక్తి టీమ్‌లను ప్రారంభించారు. మహిళలపై దాడులను నిరోధించాలనే లక్ష్యంగా శక్తి బృందాలు పనిచేస్తాయి. ఇందుకోసం 24 మంది మహిళా కానిస్టేబుళ్లను పది శక్తి టీమ్‌లుగా ఏర్పాటు చేశారు. జిల్లాలోని ప్రతి సబ్‌ డివిజన్, డివిజన్‌ పరిధిలో ఈ టీమ్‌లు పనిచేస్తాయి. స్టేషన్‌ విధులతో సంబంధం లేకుండా మహిళా చట్టాలపై అవగాహన కల్పించేందుకు.. మహిళలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈవ్‌ టీజింగ్‌ను అదుపు చేసేందుకు  పనిచేస్తాయి. కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన సదస్సులు ఏర్పాటుచేసి మహిళా చట్టాలపై అవగాహన కలిగిస్తాయి. శక్తి బృందాలకు మహిళా పీఎస్‌ డిఎస్పీ పెంటారావు నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారు. కంట్రోల్‌ రూమ్‌ సీఐ సుభద్రమ్మ బృందాల పనితీరును పర్యవేక్షిస్తారు. శక్తి బృందాల పనితీరు రోజూ పర్యవేక్షించి, ఎస్పీకీ నివేదికను అదనపు ఎస్పీ ఎం.నరసింహారావు అందజేస్తారు.

శక్తి బృందాలకు ప్రత్యేక శిక్షణ
కానిస్టేబుళ్లుగా శిక్షణ ఇచ్చే సమయంలోనే శక్తి బృందాల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న వారందరూ ముందుకు రావాలని సూచించారు. ముందుకొచ్చిన  వారందరికీ ప్రత్యేక శిక్షణ అందజేశారు. వీరికి ప్రత్యేకంగా స్కూటర్, కారు డ్రైవింగ్, ఈత, కరాటే, కుంగ్‌పూ, మహిళలు, చిన్న పిల్లల నేరాలకు సంబంధించిన చట్టాలు, పలు సామాజిక కోణాల్లో సమస్యను పరిష్కరించే విధానాలపై శిక్షణ ఇచ్చారు. దీంతో శక్తి టీమ్‌ శక్తిమంతమై రంగంలోకి దిగింది.

మహిళలు, విద్యార్థినుల ఆనందం
శక్తి టీమ్‌లు ప్రారంభమై రెండు నెలలైనప్పటికీ మహిళలు, విద్యార్థినుల మనసులో స్థానం పొందాయి. శక్తి టీమ్‌ల పుణ్యమా అని కళాశాల వద్ద అల్లరిమూకలు కనిపించకపోవడంతో విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయా టీమ్‌ల పరిధిలో ఎక్కడికక్కడ శక్తిటీమ్‌ డయల్‌ 100, 121, 1090 లేక వాట్సాప్‌ నంబర్‌ 6309898989కి కాల్‌ చేయమని సూచిస్తున్నారు. సంఘటన స్థలం చెబితే సెకెన్లలో అందుబాటులో ఉండి సమస్యను పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తుండటంతో బాధితుల్లో ధైర్యం పెరిగింది. ఇక సమస్య తీవ్రతను బట్టి ఆ ప్రాంత పోలీస్‌ స్టేషన్‌ అధికారి వద్ద సమస్యలను వివరించి, వాటికి కూడా పరిష్కారం చూపించడంతో ఎంతో మంది మహిళలు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు శక్తి టీమ్‌ను అభినందిస్తున్నారు. ఇళ్లల్లో ఎదుర్కొంటున్న సమస్యలను సైతం శక్తి టీమ్‌ల దృష్టికి తీసుకొస్తుండటంతో భార్యాభర్తలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి సమస్య పరిష్కరిస్తున్నారు. ఇలా విద్యార్థినులు, మహిళల మనసులో శక్తి టీమ్‌లు చెరగని ముద్ర వేసుకుంటున్నాయి.

ఆకట్టుకుంటున్న డ్రస్‌ కోడ్‌
ఖాకీ ప్యాంట్, నీలం రంగు షర్ట్, టోపీ, బూట్లతో శక్తి టీమ్‌ సభ్యులు విదేశీ పోలీసుల్లా ఆకట్టుకుంటున్నారు. వీరు ప్రయాణించే ద్విచక్ర వాహనం ముందు భాగాన పోలీస్‌ చిహ్నం, ఏపీ పోలీస్, మరో వైపు శక్తి.. మహిళలకు చేరువ.. అనే నినాదాలు ఆకర్షిస్తున్నాయి. మహిళలు ఎక్కువగా ఉండే  కూడళ్లు, కళాశాలల జంక్షన్‌లు, షాపింగ్‌ మాల్స్, బస్టాండ్‌ల వద్ద వీరు వారికిచ్చిన షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎక్కువగా కనిపిస్తారు.

శక్తి బృందాల స్వరూపం

శక్తి బృందాలు 10
మహిళా కానిస్టేబుళ్ల సంఖ్య  24
శక్తి టీమ్‌ నంబర్లు 100, 121, 1090
శక్తి వాట్సాప్‌ నంబర్‌ 6309898989
విజయనగరం 3 బృందాలు
పార్వతీపురం 2 బృందాలు
గజపతినగరం 1 బృందం
బొబ్బిలి 1 బృందం
సాలూరు 1 బృందం
కొత్తవలస 1 బృందం
గరివిడి 1 బృందం

వేటాడుతున్నాం
ఆడపిల్లలను కాపాడుకునే అవకాశం మాకు దక్కడం ఆనందంగా ఉంది. బయటి ప్రపంచంలో ఆడపిల్లల విషయంలో ఏం జరుగుతోందనేది పూర్తి అవగాహన ఉంది. సమస్య ఉన్న ప్రతి చోటా అడుగడుగునా వేటాడుతున్నాం. చాలా మంది ప్రత్యేక యూనిఫాంలో మమ్మల్ని చూసి దగ్గరికొచ్చి సమస్య చెబుతున్నారు.
– కంది శాంతి, కానిస్టేబుల్, గుర్ల పోలీస్‌ స్టేషన్‌

ముందుకొస్తున్నారు
శక్తిటీమ్‌లో పనిచేస్తున్న మమ్మల్ని మహిళలు, విద్యార్థినులు సొంత మనుషుల్లా భావిస్తున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను మా దృష్టికి తీసుకొస్తున్నారు. సమస్య పరిష్కారమైతే ఎంతో కృతజ్ఞత చూపుతున్నారు. రోడ్లపై మా యూనిఫాంలు చూసి వారి సమస్యలను చెప్పుకొనేందుకు ముందుకొస్తున్నారు.
–  వైఎం లెనీనా, కానిస్టేబుల్, భోగాపురం పోలీస్‌ స్టేషన్‌

ధైర్యంగా చెబుతున్నారు
ఉద్యోగినులు, కళాశాల విద్యార్థినులు ధైర్యంగా వచ్చి తమ సమస్యలు చెప్పుకొంటున్నారు. తమ ఇబ్బందులను ఇంట్లో వారికి చెబితే చదువులు ఆపేస్తారనే భయంతో విద్యార్థినులు మాకు చెప్పుకొంటున్నారు. దీంతో  అధికారుల సహకారంతో వారి సమస్యల్ని పరిష్కరిస్తూ భరోసా కల్పిస్తున్నాం.
– పి.అచ్చియమ్మ, కానిస్టేబుల్, జామి పోలీస్‌ స్టేషన్‌

ఆనందంగా ఉంది
శక్తి టీమ్‌ ద్వారా విద్యార్థినులకు ఓ నమ్మకం కలిగించాం. వారికి అండగా నిలవడం మాకు ఆనందంగా ఉంది. మా విధుల్లో కొత్తదనం ఉంది.  మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను కొంతవరకూ అరికడుతున్నామనే సంతృప్తి ఉంది.
– ఆర్‌.దేవి, టూ టౌన్‌ కానిస్టేబుల్, విజయనగరం

నమ్మకం కలిగించాం
సహజంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను భర్తలతో సైతం చెప్పుకొనేందుకు ముందుకు రారు. ఇక పోలీసుల దృష్టికి వెళ్తే పరువు పోతుందని భావిస్తారు. కానీ మమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నారు. మా యూనిఫాం వేరుగా ఉండటం, పోలీసుల్లా కాకుండా, కుటుంబ సభ్యుల్లా వారితో కలిసిపోతుండటంతో మా వద్దకు వచ్చి సమస్యలు చెబుతున్నారు. వాటి పరిష్కారానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నాం.
– టి.యమున, కానిస్టేబుల్, గంట్యాడ పోలీస్‌ స్టేషన్‌

ఆత్మ స్థయిర్యం నింపేందుకే..
ఆడపిల్లలు తమ కాళ్లమీద తాము నిలబడాలంటే చదువే ముఖ్యం. ఆ చదువును ఆకతాయి చేష్టల వల్ల మధ్యలో ఆపేయకూడదు. అందుకే వారికి ఆత్మ స్థయిర్యం కల్పించేందుకు శక్తి టీమ్‌ను ఏర్పాటు చేశాం. తొమ్మిది సర్కిల్స్‌లో ఈ టీమ్‌ పనిచేస్తుంది. అన్ని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి అవగాహన కల్పిస్తారు. నిఘా వేస్తారు. బస్టాండ్, ఆటో స్టాండ్లలో మహిళలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ వారికి భరోసా కల్పించేందుకు పెట్రోలింగ్‌ నిర్వహిస్తారు. మగపిల్లలు ఇలాంటి నేరాలకు పాల్పడితే వారి భవిష్యత్తు ఏంటనేది వివరిస్తున్నారు. ఒకసారి కేసు నమోదైతే వారి జీవితం నాశనమైనట్టే. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.
– బి.రాజకుమారి, ఎస్పీ, విజయనగరం

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మహిళలకు అవగాహన కల్పిస్తూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement