అథోగతి
అథోగతి
Published Mon, Mar 20 2017 10:59 PM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM
పన్ను వసూళ్ల అథమంలో నంబర్ 2
వెనుకబడ్డ పిఠాపురం మున్సిపాలిటీ
బకాయిదారుల్లో బడా బాబులు
పిఠాపురం : ఆధ్యాత్మిక కేంద్రంగా, రాచరికపు పాలనకు ప్రతీకగా చరిత్ర పుటల్లో నిలిచిన పీఠికాపురం చరిత్రను ఇప్పటి నేతలు తిరగరాశారు. ఇప్పుడు ఘన చరిత్ర గల పిఠాపురం అథోగతి పాలవుతోంది. తమ పాలనలో పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకునే పాలకులే పన్నులు ఎగ్గొడుతుండడంతో పన్నుల వసూళ్లలో వెనుబడి రాష్ట్రంలో రెండో అథమ స్థానానికి చేరుకుంది. వెనుకబడ్డ పన్నుల వసూళ్లకు ప్రత్యేకాధికారిని ప్రభుత్వం నియమించినా పాలకుల నిర్వాకాన్ని ప్రత్యేకాధికారి బయటపెట్టగలరా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పట్టణాన్ని పాలించాల్సిన నేతలే పట్టణ అభివృద్ధికి మూలమైన పన్నులు ఎగ్గొడుతుంటే పట్టణం అథోగతి పాలవకుండా ఎలా ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పన్నుల వసూళ్లలో వెనుకబడ్డ 30 మున్సిపాలిటీలను ఎంపిక చేయగా వాటిలో 43.67 శాతం బకాయిలతో పిఠాపురం మున్సిపాలిటీ రెండో స్థానాన్ని ఆక్రమించింది. పిఠాపురం మున్సిపాలిటీలో ఆస్తి పన్ను రూ. 3.12 కోట్లు వసూలు కావాల్సి ఉండగా ఇప్పటికి రూ.1.40 కోట్లు మాత్రమే వసూలైంది. ఇంకా రూ .1.72 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిల్లో ఎక్కువ మంది బడా బాబులే ఉన్నారు. కేవలం 250 మంది మాత్రమే ఎక్కువ బకాయిలు ఉన్నారు. ఏళ్ల తరబడి వీరి నుంచి బకాయిలు వసూలు కాలేదు. దీంతో వీరికి రెడ్ నోటీసులు జారీ చేసినా ఫలితం కనిపించక పోవడంతో ఈ మున్సిపాలిటీలో పన్నుల బకాయిలపై చర్యలు తీసుకోవడంలో భాగంగా మరో కమిషనర్‌ను సైతం నియమించారు. అలాగే కుళాయిల బకాయిలు రూ. 40 లక్షలకు పైగా ఉంది.
నీతులు చెప్పే నేతలే బకాయిదారులు
అధికారం ఉంది కదాఅని అడ్డంగా పనులు చేస్తున్నారంటూ ప్రతిపక్షం నిలదీసే ప్రయత్నం చేస్తే కనీసం మాట కూడా వినిపించకుండా అరుపులు కేకలతో అడ్డు తగులుతున్నారు అధికార పార్టీ నేతలు. అక్రమ పింఛన్ల వ్యవహారంలోనే కాదు పన్నుల చెల్లింపులోనూ వీరు తమ ప్రతాపం చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పిఠాపురం మున్సిపాలిటీలో సుమారు రూ.లక్షలు బకాయిలుండగా వాటిలో సుమారు రూ. లక్షల్లో తెలుగుదేశం నేతలు వారి బంధువులవే ఉండడం గమనార్హం. ముఖ్యంగా మున్సిపాలిటీ పాలకవర్గంలో అధికార పార్టీకి చెందిన కీలక నేత ఎక్కువ బకాయి పడినప్పటికీ ఆయన కౌన్సిల్ సమావేశంలో నీతులు చెప్పడం తప్ప తాను మాత్రం బకాయిలు చెల్లించకపోవడం ఎగవేతను తేటతెల్లం చేస్తోంది. రూ.1.72 కోట్ల బకాయిల్లో 250 మంది బడా బకాయిదారులు ఉండగా వారిలో ఎక్కువ మొత్తాలు రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. వారిలో తెలుగు తమ్ముళ్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దైవ సాక్షిగా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని తాను ప్రాతినిథ్యం వహించే మున్సిపాలిటీ అభివృద్ధికి తనశక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రమాణం చేసిన నేతలే పన్నులు ఎగవేతకు శ్రీకారం చుడితే ఏఅధికారి అయినా ఏం చేయగలరన్న వాదనలు వినిపిస్తున్నాయి.
చర్యలు తీసుకుంటున్నాం
మొండి బకాయిల వసూలుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రత్యేకాధికారి ఆద్వర్యంలో మొండి బకాయిదారులపై చర్యలు తీసుకుంటాం. బకాయిలు చెల్లించని వారిపై న్యాయపరమైన చర్యలకు వెనుకాడం. సాధారణ నిధులతోనే పట్టణాభివృద్ధి సాధ్యమవుతుంది. ఆ నిధులే వసూలు కాకపోతే పట్టణంలో ఏపనీ చేయలేం.
- ఎం రామ్మోహన్, కమిషనర్, పిఠాపురం మున్సిపాలిటీ
Advertisement