ఇసుక మస్కా...
ఇసుక మస్కా...
Published Wed, Jul 5 2017 10:52 PM | Last Updated on Tue, Sep 5 2017 3:17 PM
మూతపడిన ర్యాంపులు
గడువుకు ముందే జాగ్రత్తపడిన ఇసుకాసురులు
భారీగా పోగేసుకున్న ఇసుక నిల్వలు
వదరలతో స్తంభించిన తవ్వకాలు
నిల్వచేసి పదిరెట్ల హెచ్చు ధరలకు విక్రయాలు
ఉచిత ఇసుక విధానం అభాసుపాలు
అమలాపురం : ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం మరోసారి అభాసుపాలైంది. గోదావరికి వరద పోటు తగిలిందో లేదో, అక్రమార్కులు చెలిరేగిపోతున్నారు. ఒకవైపు ప్రధాన ర్యాంపుల గడువు పూర్తికావడం.. వరద వల్ల తవ్వకాలు సాగకపోవడంతో...అడ్డదారిలో నిల్వ చేసిన ఇసుక ధరను ఏకంగా పదిరెట్లు పెంచి సామాన్యులకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు.
గోదావరికి వరదలను ఎదుర్కొనేందుకు కేవలం నెల రోజుల ముందు ఇరిగేషన్ అధికారులు సన్నహాలు చేస్తుంటారు. కాని ఇసుక అక్రమార్కులు మాత్రం ఇందుకు రెండు, మూడు నెలల ముందునుంచే వరద సమయంలో ఇసుక విక్రయాలకు భారీగా నిల్వలు చేయడం సర్వసాధారణం. ప్రభుత్వం ఉచిత ఇసుక అమలులోకి తెచ్చిన తరువాత కూడా నిల్వలు చేయడం మానలేదు. ప్రభుత్వ ఆధీనంలో ఇసుక విక్రయాలు జరగడం లేదని, అధికార టీడీపీకి ప్రజాప్రతినిధుల అండదండలతో వారి అనుచరులే ర్యాంపుల్లో పాగా వేసి విక్రయాలు చేస్తున్నారనడానికి ఈ నిల్వలు చూస్తేనే అర్థమవుతోంది. గోదావరికి వరద పోటు తగలకముందే ర్యాంపుల సమీపంలోని రహస్య ప్రాంతాల్లోను, ఆయా ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకన్నట్టుగా ఇసుకను భారీ ఎత్తున నిల్వచేశారు. ఎప్పుడైతే తవ్వకాలు దాదాపుగా నిలిచిపోయాయో.. అక్రమార్కులు ఇసుక ధరలను ఇష్టానుసారం పెంచేశారు. ఉచిత ఇసుక వల్ల ర్యాంపుల నిర్వహణ, తవ్వకాలకు యూనిట్‌కు రూ.125 చొప్పున ధర నిర్ణయించారు. ర్యాంపుల్లో యూనిట్‌కు రూ.500 చొప్పున అనధికారికంగా వసూళ్లు జరిగేవి. ఎప్పుడైతే తవ్వకాలు నిలిచిపోయాయో అనధికార నిల్వల వద్ద యూనిట్ ధర రూ.2 వేలు చేసి సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేశారు. పనిలో పనిగా లారీ రవాణా చార్జీలను సైతం పెంచేశారు. ఆత్రేయపురం నుంచి అమలాపురం ఒకప్పుడు మూడు యూనిట్ల ఇసుక రవాణాకు రూ.4 వేలు వరకు అవగా, ఇప్పుడది రూ.9 వేలు పలుకుతోంది.
జిల్లాలో సీతానగరం మండలం ముగ్గుళ్ల, వంగలపూడి, కపిలేశ్వరపురం, వేమగిరి, జొన్నాడ వంటి ర్యాంపులు గడువు ముగియడంతో తవ్వకాలు నిలిపివేశారు. మిగిలిన ర్యాంపుల్లో వరదల వల్ల తవ్వకాలు ఆగాయి. జొన్నాడకు తిరిగి అనుమతి వచ్చినా వరదల వల్ల తవ్వకాలు చేసే అవకాశం లేదు. ఇవన్నీ ముందే ఊహించిన అక్రమార్కులు పలు ప్రాంతాల్లో ఇసుక నిల్వలు చేశారు. నిర్మాణాల కోసమంటూ 20 నుంచి 50 యూనిట్ల చొప్పున ఇసుక నిల్వ చేశారు. కొత్తపేట, పి.గన్నవరం, రాజమహేంద్రవరం నగరం, రూరల్ నియోజకవర్గ పరిధిలో ఇసుక నిల్వలున్నాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లలో ఎక్కువుగా ఇసుక నిల్వలున్నాయి. అధికారులు దాడులు చేసినా ఇళ్ల నిర్మాణాల కోసమంటూ అక్రమార్కులు చెప్పుకునేందుకు వీలుచిక్కుతోంది. ఇటీవల ఆత్రేయపురం మండలం అంకంపాలెం, రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు, రావులపాలెం శివారు గౌతమీ ఏటిగట్టు వద్ద ఇసుక నిల్వలను అధికారులు సీజ్ చేశారు. అయితే రెండు మండలాల్లో ఇంతకు పదిరెట్లు ఇసుక నిల్వలున్నట్టు అంచనా. ఇప్పటికైనా అధికారులు అక్రమ ఇసుక నిల్వలపై దాడులు చేసి వాటిని తమకు తక్కువ ధరకు అందించాలని సామాన్యులు కోరుతున్నారు.
Advertisement