గృహ కల్పనే...
గృహ కల్పనే...
Published Thu, Oct 6 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
రెండున్నరేళ్లకు ఇళ్ల మంజూరు
నియోజకవర్గంలో 2500పైగా దరఖాస్తులు వస్తే 900 మంజూరు
తలలు పట్టుకుంటున్న ప్రజాప్రతినిధులు
బోట్‌క్లబ్ (కాకినాడ) : ఇవిగో ఇళ్లు...అవిగో ఇళ్లంటూ రెండున్నరేళ్లుగా ఊరించిన తెలుగుదేశం ప్రభుత్వం చివరకు ఉసూరుమనిపించింది. నిరీక్షణ తరువాత మంజూరు చేసిన ఇళ్లను చూసుకుని సంతోషించాలో, అరకొర కేటాయింపులతో దిక్కులు చూడాలో అర్థంకాని పరిస్థితుల్లో లబ్థిదారులున్నారు. రెండున్నరేళ్లకు నియోజకవర్గానికి 1250 ఇళ్లను మంజూరు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ ప్రకటనతో ఇటు లబ్థిదారు లు, మరోవైపు తెలుగు తమ్ముళ్లు గంపెడాశతో ఎదురు చూశారు. తీరా కేటాయింపులు మొదలయ్యేసరికి నియోజకవర్గానికి 350 వంతున కోత పెట్టారు. అంటే నియోజకవర్గానికి 1250కి బదులు 900 ఇళ్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థి తి. తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించిందని సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. చంద్రబాబు మాటలు నమ్మిన ఎమ్మెల్యేలు, వారి అనుచరు లు దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇస్తామని గొప్పలకు పోవడంతో ప్రతి నియోజకవర్గం నుంచి 2500 నుంచి 3000లు దరఖాస్తు లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి కాకుండా మ రింత మంది ఇళ్ల కోసం దరఖాస్తులతో క్యూలో ఉన్నారు. ఉన్నవాటికే గృహ ‘కల్పనే’...
దిక్కులేదు కొత్త దరఖాస్తులు తీసుకోలేమని తెలుగు తమ్ముళ్లు చేతులెత్తేసున్నారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్ల దరఖాస్తుల లెక్కలు తీస్తే ప్రస్తుతం మంజూరు చేసిన ఇళ్లు సగం కూడా లేకపోవడంతో ఎలా కేటాయించాలని స్థానిక ప్రజాప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. గ్రామాల్లో జరిగే పార్టీ, అధికారిక కార్యక్రమాలకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందంటున్నారు. ఎలా పంపకం చేసుకుంటారో మీ ఇష్టమని స్థానిక నాయకులపై ఎమ్మెల్యేలు భారంమోపేసి చేతులెత్తేసే పనిలో ఉన్నారు. జన్మభూమి కమిటీ సభ్యులే ఐదుగురున్నారు. వారు కాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు తమ బంధువులంటే, తమ బంధువులకే కేటాయింపులు ఇవ్వాలని పట్టుపడుతున్నారు. అందరికంటే ముందుగా ఉపముఖ్యమంత్రి చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ నియోజకవర్గంలోని సామర్లకోట మండల స్థాయి నాయకులు మధ్య కోల్డ్ వార్ మొదలైంది.
గ్రామానికి పాతికి కూడా రావాయే.
ప్రతి రూరల్ నియోజకవర్గంలో రెండు నుంచి నాలుగు మండలాలున్నాయి. మండలానికి 20కు పైనే గ్రామాలున్నాయి. గ్రామానికి పట్టుమని పాతిక ఇళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఫలితంగా అరకొర ఇళ్లను ఎలా సిఫార్సు చేయాలో అర్థం కాక టీడీపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.ప్రస్తుతం నియోజకవర్గాలకు మంజూరైన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి స్థలాల్లో జియోట్యాగింగ్ చేసే పనిలో గృహ నిర్మాణశాఖ అధికారులు బిజీగా ఉన్నారు.
మంజూరైనా తప్పని అవస్థలు...
ఇప్పటి వరకూ ఇళ్లు మంజూరు కాలేదని, వచ్చిన వెంటనే మన వారందరికీ ఇళ్లు తప్పకుండా ఇస్తామని చెప్పిన నాయకులకు ప్రస్తుతం ఇబ్బందులు తప్పడం లేదు. జాబితా తయారుచేసిన స్థానిక ఎమ్మెల్యేకు ఫోన్ చేసి నాయకులే తరచూ మార్పులు చేస్తున్నారు. తమ వారు పేర్లు లేకుండా జాబితా తయారుచేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తోందని, టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు ఎమ్మెల్యేలు వద్ద మొరపెట్టుకుంటున్నారు.
Advertisement
Advertisement