జిల్లా అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తా
జిల్లా అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తా
Published Thu, Jun 8 2017 11:48 PM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM
- రాజమహేంద్రవరంలో ఫారెస్ట్ అకాడమీ
- కాకినాడను వండర్‌ఫుల్ సిటీగా చేస్తా
- మహాసంకల్ప సభలో చంద్రబాబు
కాకినాడ: జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వపరంగా పూర్తి తోడ్పాటును అందిస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. మహాసంకల్ప సభకు విచ్చేసిన ఆయన కాకినాడ సూర్య కళామందిరంలో జరిగిన సభలో జిల్లాకు సంబంధించి అనేక హామీలు గుప్పించారు. మహాసంకల్ప ప్రతిజ్ఞ అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాను ఆదర్శ జిల్లాగా తయారు చేసేందుకు తోడ్పాటును అందిస్తానన్నారు. పర్యాటక రంగంలో తూర్పుగోదావరి జిల్లాకు పెద్దపీట వేస్తానన్నారు. కాకినాడ జగన్నాథపురం వంతెనపై రూ.146 కోట్ల వ్యయంతో మూడో బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. రూ.50 నుంచి రూ.100 కోట్ల వ్యయంతో రాజమహేంద్రవరంలో ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తుని, అమలాపురం, చింతూరు డయాల్‌సిస్ యూనిట్లుతోపాటు మోతుగూడెంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, నెల్లిపాకలో జూనియర్ కళాశాల, యర్రంపేట వద్ద డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును, చింతూరులో ఫైర్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. 53 ఎత్తిపోతల పథకాలు వివిధ కారణాలు వల్ల వినియోగంలోలేనందున వీటికయ్యే రూ.9 కోట్లు వెచ్చించి తక్షణమే పనులు ప్రారంభించాలని అక్కడే ఉన్న కలెక్టర్ కార్తికేయ మిశ్రాను ఆదేశించారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం సూచన మేరకు కాకినాడ రైల్వే స్టేషన్‌ను స్మార్ట్ రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మహాసంకల్ప సభా వేదికగా ఉన్న ఆనంద భారతి గ్రౌండ్స్‌ను శాశ్వతంగా గుర్తుంచుకునే విధంగా రూ. 10 కోట్లతో మినీ స్టేడియంను అభివృద్ధి చేస్తామంటూ చంద్రబాబు ప్రకటించారు. కాకినాడ నగరాన్ని వండర్‌ఫుల్ సిటీగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ఆ దిశగా తాము ప్రయత్నిస్తామంటూ పేర్కొన్నారు.
.
సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2018 నాటికల్లా ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి ఇచ్చేందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. రూ.100 కోట్లతో డ్రైనేజీలు ఆధునికీకరణ, ఉప్పుటేరుపై మూడో వంతెన నిర్మాణాలను 2019 నాటికల్లా పూర్తి చేసేందుకు నవనిర్మాణ దీక్షలో ప్రతిపాదించామన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ పథకాలు ద్వారా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని వివరించారు. కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ గడచిన నెల రోజుల్లో దీపం కనెక‌్షన్లు ద్వారా లక్షా 80 వేల గ్యాస్ కనెక‌్షన్లు మంజూరు చేశామన్నారు. కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తోట నరసింహం మాట్లాడుతూ ముఖ్యమంత్రి సంకల్పానికి అధికారులు, ప్రజల భాగస్వామ్యం వహిస్తే అభివృద్ధిలో అన్ని విధాలా ముందుండగలమన్నారు. పౌర సరఫరాలశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పొగ రహిత వంట ఇంధన రాష్ట్రంగా చేసేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ పోలవరంతోపాటు జాతీయ రహదారుల అభివృద్ధి సహా ఎన్నో కార్యక్రమాలు అమలుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను అక్షర క్రమంలోనే కాక, అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రజలంతా నడుం కట్టాలన్నారు. ఎన్‌జీవో సంఘ రాష్ట్రనేత అశోక్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు కనబడని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరిన్ని సంస్కరణలు చేపట్టాలని కోరారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచన పలువురు అధికారులను సత్కరించగా మూడేళ్ళ ప్రగతిపై రూపొందించిన పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. పొగ రహితవంట ఇంధన కార్యక్రమంలో భాగంగా గ్యాస్ కనెక‌్షన్లు పెద్ద ఎత్తున అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును పలువురు మహిళలు సత్కరించారు. సమావేశంలో శాసనమండలి స్పీకర్ రెడ్డి సుబ్రహ్మణ్యం మహా సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement