వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యానికి భారీ మూల్యం
ఏజెన్సీలో వైద్య సేవలు మెరుగుకు చర్యలు శూన్యం
గిరిజనులు ప్రాణాలు పోయినప్పుడే హడావుడి
రంపచోడవరం : వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యానికి గిరిజనులు భారీగానే మూల్యం చెల్లించుకుంటున్నారు. వర్షాకాలం వస్తుందంటే ఏజెన్సీ గ్రామాల్లో వణుకు పుడుతోంది. అనారోగ్యం బారిన పడిన అనేక మంది గిరిజనులు ›ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వై.రామవరం, మారేడుమిల్లి మండలాల్లోని లోతట్టు గిరిజన గ్రామాల్లో అసలేం జరుగుతుందో బాహ్య ప్రపంచానికి తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ యంత్రాంగం ఆ గ్రామాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో అనేక మంది మృత్యువాత పడినా ప్రభుత్వ లెక్కల్లోకి రావడం లేదు. వై.రామవరం మండలం చాపరాయిలో మూడు వారాల వ్యవధిలో 16 మంది గిరిజనులు ప్రాణాలు పోగొట్టుకున్నారంటే ఏజెన్సీలోని దయనీయ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆస్పత్రులు అందుబాటులో లేకపోవడం, సరైన మందులు లేక, రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలకు ఇప్పటికీ గిరిజన పల్లెలు దూరంగా ఉండడంతో పలు అనర్థాలకు దారితీస్తోంది. గిరిజనుల ప్రాణాలు పోయిన సందర్భంగా హడావుడి చేస్తున్న యంత్రాంగం తర్వాత కన్నెత్తి కూడా చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఎంత కాలం ఇన్‌చార్జిల పాలన
రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 95 సబ్ సెంటర్లు, రంపచోడవరం ఏరియా ఆస్పత్రిత్రి, రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. పర్యవేక్షించాల్సిన ఏజెన్సీ వైద్య ఆరోగ్యశాఖలో ఎంతో కాలంగా ఇన్‌చార్జిల పాలనలో నిర్వహిస్తున్నారు. పూర్తిస్థాయిలో అధికారిని నియమించడం లేదు. జిల్లా మలేరియా అధికారి (డీఎంఓ)పోస్టు కూడా ఎంతో కాలంగా ఇన్‌చార్జి పాలనలోనే ఉంది. పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులే ఇన్‌చార్జులైతే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
భర్తీకాని ఖాళీలు
వైద్య ఆరోగ్యశాఖలో అన్ని క్యాడర్‌ల్లో 486 పోస్టులు ఉంటే వాటిలో 349 మంది పనిచేస్తున్నారు. 139 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఎంపీహెచ్‌ఎస్ పోస్టులు 40 ఖాళీగా ఉన్నాయి. గతంలో జ్వరాల సీజన్ దృష్టిలో ఉంచుకుని రెండు నెలలు మైదాన ప్రాంతం నుంచి వైద్య సిబ్బందిని డిప్యూటేషన్‌పై నియమించే వారు. అలాంటి ప్రక్రియకు మంగళం పాడారు. ప్రస్తుతం ఏజెన్సీలో ఆనారోగ్య పరిస్థితులు తాండవించడంతో తిరిగి డిప్యూటేషన్‌పై నియమించేందుకు చర్యలు చేపడుతున్నారు. పీహెచ్‌సీల్లో ఐదు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండగా మరో నలుగురు వైద్యులు పీజీ చేసేందుకు వెళ్లిపోనున్నారు.
రోడ్డు నిర్మాణంపై నిర్లక్ష్యమేల ?
వై రామవరం– గుర్తేడు మధ్య రహదారి నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. మండలం కేంద్రం చేరుకునేందుకు అనేక గ్రామాలకు దగ్గర మార్గమైన ఈ రహదారిని అధికారులు నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. రూ.3 కోట్ల అంచనా వ్యయంతో వై.రామవరం నుంచి పోతవరం వరకు 20 కిలోమీటర్లు మేర రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. రూ.1.50 కోట్లు ఖర్చు చేసి ఎర్త్ వర్క్ చేసి వదిలి పెట్టారు. అప్పటి నుంచి రోడ్డు నిర్మాణం ఊసే పట్టించుకోలేదు. అధికారులు గిరిజనాభివృద్ధికి చేస్తున్న ఆలోచనలు ఏమిటనే అనుమానులు కలగక మానదు. ఏజెన్సీలో అటవీ అభ్యంతరాల కారణంగా సుమారు 20 రోడ్డు నిర్మాణాలు నిలిచిపోయాయి. వీటిని పూర్తి చేసేందుకు ఎందుకు సిద్ధం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మన్యంలో రహదారి సౌకర్యాలు ఎలా మెరుగపడతాయో అధికారులే సమాధానం చెప్పాల్సి ఉంది.
మండల కేంద్రం ఏర్పాటుతోనే గిరిజనులకు మేలు
గత దశాబ్దకాలంగా వై.రామవరం మండలం ఎగువ ప్రాంతాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని అక్కడ గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో మండల కేంద్రం ఏర్పాటుకు ఐటీడీఏ పీవో దినేష్‌కుమార్ మారేడుమిల్లి వివిధ సంఘాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరించారు. మండల కేంద్రం ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా అప్పర్ పార్ట్‌లో ఉన్న గ్రామాలకు పాలన దగ్గర అవుతుంది. తమ సమస్యలను చెప్పుకునేందుకు, క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి గిరిజనులు సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మూడు మండలాలను దాటుకుని 150 కిలోమీటర్ల పైనే ప్రయాణం చేసి మండల కేంద్రం వై.రామవరం చేరుకోవాల్సిన పరిస్ధితి. ఇలాంటి కష్టాలు నుంచి గిరిజనులు గట్టెక్కాలంటే గుర్తేడును మండల కేంద్రంగా ఏర్పాటు చేసే పని వేగవంతం చేయాలి.
అయినవారిని కోల్పోయి...
చాపరాయి గ్రామంలో జ్వరాలు బారిన పడి 16 మంది గిరిజనులు మృతి చెందారు. వారిలో ఒకే కటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. కుటుంబంలో మిగిలిన ఒక్క మహిళ పల్లాల చిట్టెమ్మ రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. జ్వరాల బారిన పడి మామ పల్లాల తమ్మిరెడ్డి మరణించిన వారం వ్యవధిలో అత్త చిట్టెమ్మ ( అత్తగారి పేరుచిట్టెమ్మ) జ్వరంతో మృత్యువాత పడింది. మరో మూడు రోజుల్లో భర్త పల్లాల కన్నమ్మరెడ్డి మరణించాడు. కుటుంబంలో అత్తమామలును, భర్తను కోల్పోయి ఆమె, ముగ్గురు చిన్నారులు మాత్రమే మిగిలి ఉన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆమె ఇద్దరు పిల్లలతో చికిత్స పొందుతుండగా మరో బాలిక గ్రామంలోనే ఉంది. గ్రామంలో జరిగిన వేడుకకు వెళ్లలేదని ఆమె వాపోయింది. జ్వరాలే ఐనా వారి ప్రాణాలు తీసిందని ఆవేదన చెందింది.
త్వరలో చాపరాయి బాధిత కుటుంబాలకు జగన్ పరామర్శ
ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వెల్లడి
మారేడుమిల్లి : వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ పరిధిలోని చాపరాయి గ్రామంలో విషజ్వరాల బారిన పడి మృతి చెందిన బాధిత కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అ«ధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే మన్యంలో పర్యటించి మృతులు కుంటుబాలను పరామర్శిస్తారని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తెలిపారు. సోమవారం మారేడుమిల్లిలో ఆమె విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ 16 మంది గిరిజనులు వ్యాధులతో మృతి చెందిన కనీసం వైద్యాధికారులకు, ప్రభుత్వానికి, తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబుకు తగిన గుణపాఠం తప్పదన్నారు. ఎనిమిది నెలల క్రితం విలీన మండలాల్లో కాళ్లవాపుతో 18 మంది గిరిజనులు మృతి చెందారని, 216 మాతా శిశుమరణాలు సంభవించినప్పుటికి ఇప్పుటికీ వ్యాధులకు గల కారణాలు కనిపెట్టాలేకపోయారని విమర్శించారు. నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప వచ్చి మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షలు ప్రకటించడం సరికాదని అన్నారు. ప్రభుత్వ ప్రకటనలు స్టేట్‌మెంట్‌లకే పరిమితం అవుతున్నాయే తప్ప బాధితులకు సహాయం అందడం లేదన్నారు. గతంలో మారేడుమిల్లి మండలం సిరిపిన లోవ గ్రామంలో కొండపోడు పొలానికి నిప్పుంటుకుని నలుగురు చిన్నారులు మృతి చెందితే వారి కుటుంబాలకు రూ.రెండు లక్షలు ప్రకటించారని ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదని, అలాగే వారికి ఇళ్లు కట్టిస్తామని ఇచ్చిన హామీకూడా నెరవేర్చలేదన్నారు. చాపరాయి గ్రామంలో రెండు నెలలు నుంచి కరెంట్ సదుపాయం లేదని, వారికి ఇచ్చే కిరోసిన్ కోత విదిచడంతో చీకట్లోనే మగ్గుతున్నారని అన్నారు. సరైన రోడ్డు సదుపాయం, తాగునీరు అందుబాటులో లేదన్నారు. చాపరాయి బాధిత గిరిజనులకు వైఎస్సాసీపీ తరఫున అండగా నిలుస్తామన్నారు. ఆ గ్రామంలో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించి. బాధితులకు ప్రభుత్వం సాయం అందించే వరకు పోరాడతామని హెచ్చరించారు. మండల కన్వీనర్, జెట్పీటీసీ సభ్యుడు సత్తి సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ కుండ్ల సీతామçహాలక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు గొర్లె అనిల్ ప్రసాద్(బాబి), ఉపసర్పంచ్ గురుకు దర్మరాజు, మండల కార్యదర్శి బి.గంగరాజు నాయకులు వీరబాబు, సత్తి సునీల్ రెడ్డి, మంగరౌతు వీరబాబు, సాయిరాజు పాల్గొన్నారు.
కొనసాగుతున్న వైద్య సేవలు
చాపరాయి(వై.రామవరం) : వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ చాపరాయి గ్రామంలోని 7 వీధుల్లో రెండో రోజు సోమవారం ఎంపీడీఓ కె.బాపన్నదొర ఆధ్వర్యంలో వైద్య బృందాలు పర్యటించి సేవలు అందించాయి. ప్రస్తుతం అదే గ్రామంలో జ్వరాలతో ఉన్న మరో 32 మంది గిరి నులను ఐటీడీఏ పీఓ దినేష్‌కుమార్ ఆదేశాల మేరకు ఆదివారం రంపచోడవరం, మారేడిమిల్లి ప్రభుత్వాస్పత్రులకు తరలించిన విషయం విదితమే. జ్వరాలు అదుపులోకి వచ్చే వరకు గ్రామంలోనే వైద్య బృందాలను మకాం ఉండమన్న పీఓ ఆదేశాల మేరకు 2వ రోజు కూడా చాపరాయి గ్రామంలో వైద్యసేవలు అందించారు. వైద్య బృందంతో పాటు ఎంపీడీఓ కె.బాపన్నదొర కూడా ఆ గ్రామంలోనే మకాం వేశారు. కార్యక్రమంలో మారేడుమిల్లి, గుర్తేడు పీహెచ్‌సీల వైద్యాధికారులు, సిబ్బందితో పాటు పంచాయతీ కార్యదర్శులు రమాదేవి, ఉషారాణిలు, వై.రామవరం రెవెన్యూ అధికారులు కానరాకపోవడంతో, పీఓ ఆదేశాల మేరకు గంగవరం తహశీల్దార్ పాల్గొని సేవలు అందిస్తున్నారు.