పాహిమాం...
పాహిమాం...
Published Tue, Jun 27 2017 12:15 AM | Last Updated on Tue, Sep 5 2017 2:31 PM
- పదే పదే అదే నిర్లక్ష్యం
– గిరిజనుల ప్రాణాలతో చెలగాటం
– గతేడాది కాళ్లవాపుతో ప్రాణాలు కోల్పోయిన గిరిజనులు
– పదుల సంఖ్యలో మాతా,శిశు మరణాలు
– ప్రస్తుతం విజృంభిస్తున్న మలేరియా
- సోమవారం నిండు గర్భిణి చికిత్స పొందుతూ మృతి
- మరో బిడ్డను కాటేసిన మలేరియా
– ఘటన సమయంలో ప్రభుత్వం హడావుడి
– ఆనక షరా మామూలు
- పాహిమాం అంటూ గిరిజనం శరణు ఘోష
సాక్షి, రాజమహేంద్రవరం: మూఢనమ్మకాలు, సకాలంలో వైద్యం తీసుకోకపోవడం, వైద్య సౌకర్యాల లేమీతోపాటు ప్రభుత్వ నిర్లక్ష్యం, యంత్రాంగం బాధ్యతారాహిత్యం జిల్లాలో గిరిజనుల ప్రాణాలు బలికొంటున్నాయి. తరచూ ఈ తరహా మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వం, యంత్రాంగం మాత్రం తమ నిర్లక్ష్యాన్ని వీడడంలేదు. వై.రామవరం మండలం చాపవరంలో 16 మంది గిరిజనులు మలేరియాతో మృతి చెందగా సోమవారం విలీన మండలాలైన చింతూరు, వీఆర్‌పురాల్లో ఇద్దరు మలేరియాతో ప్రాణాలు కోల్పోయారు. చింతూరు మండలం దబ్బగూడెం గ్రామానికి చెందిన మడవి దేవుడమ్మ అనే గర్భిణి (30) చికిత్స పొందుతూ భద్రాచలం ఆస్పత్రిలో మృతి చెందింది. వీఆర్‌పురం మండలం శ్రీరామగిరి గ్రామానికి చెందిన జశ్వంత్(9) సోమవారం మలేరియా జ్వరం కారణంగా మృతి చెందాడు. ఇలా ఏజెన్సీ వ్యాప్తంగా మలేరియా మరణాలు సంభవిస్తుంటే నివారణ చర్యలు చేపట్టాల్సిన యంత్రాంగం చోద్యం చూస్తోంది. తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి ‘మమ’ అనిపిస్తోంది. మలేరియా జ్వరాలతో గిరిజనులు మరణిస్తుంటే డయేరియా, ఇతర కారణాల వల్ల చనిపోయారంటూ ప్రభుత్వం ప్రకటనలు గుప్పింస్తోంది. వ్యాధులు ప్రబలకుండా అరికట్టాల్సిన ప్రభుత్వ పెద్దలు ప్రాణాలు మీదకు వచ్చిన తర్వాత పరామర్శిస్తూ, పరిహారాలు ప్రకటిస్తున్నారు.
శాశ్వత చర్యలేవీ...
ఏజెన్సీలో జ్వరాలు, ఇతర వ్యాధుల నివారణ, నియంత్రణకు ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టంలేదు. గత ఏడాది జూన్‌లో ఏజెన్సీలోని పోలవరం విలీన మండలాల్లో కాళ్లవాపు మరణాలు సంభవించాయి. వీఆర్‌పురం మండలంలో 10 మంది, చింతూరు మండలంలో ఐదుగురు, కూనవరం మండలంలో ఒకరు కాళ్ల వాపు వ్యాధితో మృతి చెందారు. ఒక్కొక్కరుగా గిరిజనులు మృతి చెందుతుంటే నాటు సారా తాగడం వల్ల వారు మరణిస్తున్నారంటూ సమస్యను పక్కదోవ పట్టించేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నించింది. సమస్య మూలాలు కనుగొని నివారించే ప్రయత్నం చేయకపోవడం సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీంతో బాధితుల రక్త నమూనాలు సేకరించి పరీక్షల కోసం విశాఖ పంపారు. అయితే ఇప్పటి వరకు వాటి ఫలితాలు అధికారులు ప్రకటించలేదు. కలుషిత నీరుతాగడం వల్ల కిడ్నీలు విఫలమై మృతి చెందారని సోమవారం రంపచోడవరంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఐటీడీవో పీవో దినేష్‌కుమార్ చెప్పారు. కాళ్లవాపు మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దీంతో చింతూరులో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం దాని ఏర్పాటుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
వైద్య సేవలు, పౌష్టికాహారం ఎక్కడ..?
ఏజెన్సీలో పని చేసేందుకు వైద్యులు ఆసక్తి చూపండంలేదంటూ జిల్లా వైద్యాశాఖాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. లక్షల జీతం ఇస్తామన్నా వారు రావడంలేదని పేర్కొంటున్నారు. తాత్కాలిక పద్ధతిపై నియమించే బదులు ఏజెన్సీలోని ఏరియా, పీహెచ్‌సీలలో వైద్యాధికారుల పోస్టులు భర్తి చేసేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడంలేదు. దీంతో ఎళ్ల తరబడి రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పరిధిలోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, ఇబ్బంది కొరత నెలకొని ఉంది. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 95 సబ్‌సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో 486 పోస్టులకు గాను 139 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా గిరిజనులకు పూర్తి స్థాయిలోవైద్య సేవలు అందడంలేదు. గిరిజన గర్భిణులకు తరచూ పరీక్షలు చేసి మందులు, పౌష్టికారహారం అందించకపోవడం ప్రవసం, అనంతరం తల్లులు, శిశువులు మృత్యువాత పడుతున్నారు. గత ఏడాది రాజవొమ్మంగి, గంగవరం, మారేడుమిల్లి మండలాల్లో రక్త హీనత వల్ల మాతా,శిశు మరణాలు అధికంగా నమోదయ్యాయి. జిల్లాలో మలేరియా మరణాలు ప్రతి ఏడాది సంభవిస్తున్నా ఇప్పటి వరకు కూడా జిల్లా మలేరియా అధికారి పోస్టు ఇన్‌చార్జి పాలన లో ఉండడం ఏజెన్సీ ప్రజల ప్రాణాలపై ప్రభుత్వ తీరును అద్దం పడుతోంది.
Advertisement