28న జరిగే బంద్‌ను విజయవంతం చేయండి
వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
కాకినాడ : నోట్ల రద్దు అనంతరం సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దేశవ్యాప్తంగా ఈ నెల 28న జరగనున్న బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విజ్ఞప్తి చేశారు. శనివారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడుతూ దేశవ్యాప్త బంద్‌కు తమ పార్టీ కూడా మద్దతునిస్తోందన్నారు. నల్లధనాన్ని బయటకు తెచ్చేందుకు తీసుకునే అన్ని చర్యలకు తమ పార్టీ పూర్తి మద్దతునిస్తోందని కన్నబాబు స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడకూడదనేది తమ పార్టీ అభిమతమని స్పష్టం చేశారు. రూ.వెయ్యి, రూ.500లు నోట్లను అకస్మాతుగా రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోడి చేసిన ప్రకటన అనంతరం సరైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికీ ఎంతో మంది సామాన్యులు చేతిలో చిల్లిగవ్వలేక దైనందిన జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. చిరుద్యోగులు, చిన్నవ్యాపారులు, కూలీలతో సహా ఎంతో మంది రోజుగడవని పరిస్థితులను కూడా ఎదుర్కొంటున్నారని కన్నబాబు పేర్కొన్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్ది నోట్ల రద్దు సమస్యను గాడిలోపెట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. నల్లధనాన్ని బయటకు తేవడంలో కేంద్రాన్ని సమర్థిస్తూనే ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా వారికి అండగా నిలవాలన్నదే తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాన లక్ష్యమన్నారు. అందువల్లే విపక్షాలు చేపట్టిన భారత్ బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని ఆయన స్పష్టం చేశారు.
బంద్‌కు సహకరించండి
జిల్లాలో ఈ నెల 28న జరిగే భారత్ బంద్‌కు అన్ని వర్గాలు సంపూర్ణ సహకారం అందించాలని కన్నబాబు పిలుపునిచ్చారు. వాణిజ్య, వ్యాపారవర్గాలు ఇందుకు మద్దతునివ్వాలన్నారు. మెడికల్, ఆర్టీసీతో పాటు అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఉంటుందన్నారు. జిల్లాలోని పార్టీ శ్రేణులు, ఇతర వర్గాలు రాజకీయ పార్టీలు ఇందుకు అనుగుణంగా సహకరించి బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బంద్ చేపట్టే ఇతర వర్గాలతో కలిసి విజయవంతానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పార్టీ శ్రేణులు తోడ్పడాలని కన్నబాబు విజ్ఞప్తి చేశారు.
స్వచ్ఛందంగా చేయండి : ఎమ్మెల్సీ బోస్
రామచంద్రపురం : ఈ నెల 28 న దేశవ్యాప్తంగా తలపెట్టిన నిరసనను స్వచ్ఛందంగా విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనకు వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తున్నదన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బ్యాంకుల సేవలకు ఎటువంటి అంతరాయం తలపెట్టకుండా వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, ప్రజలు స్వచ్ఛందగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని బోస్ పిలుపునిచ్చారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : దేశ వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీన జరిగే భారత్‌బంద్‌కు విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్యవర్గాలు సహకరించి విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా విజ్ఞప్తి చేశారు. శనివారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నల్లధనాన్ని బయటపెట్టేందుకు తీసుకునే చర్యలకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంపూర్ణ మద్దతునిస్తున్నారన్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా చేసిన నోట్ల రద్దు ప్రకటన వల్ల రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ నెలకొందన్నారు. ప్రజల కష్టాలను పరిష్కరించడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని, అందువల్లే ప్రజల పక్షాన పోరాడే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా తమ పార్టీ భారత్‌బంద్‌కు మద్దతునిస్తున్నదన్నారు. జిల్లాలోని యువకులు, విద్యార్థులు, వివిధ సంఘాలతోపాటు వైఎస్సార్ సీపీ యువజన విభాగానికి చెందిన ప్రతి కార్యకర్త భారత్ బంద్ విజయవంతానికి కృషి చేయాలని సూచించారు.