కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
Published Wed, Mar 1 2017 11:03 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM
-అభ్యర్థులంతా నిబంధనలు పాటించాలి
-ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు వల్లభన్
పిఠాపురం : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ శక్రటరీ, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు కరికాల వల్లభన్ తెలిపారు. ఆయన బుధవారం పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఎన్నికల నిర్వహణకు అన్నీ సిద్ధం చేశామని చెప్పారు. అభ్యర్థులందరూ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధగా ఫ్లెక్సీలు పెట్టినా, ప్రచారాలు జరిపినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పింఛన్ల అక్రమాలు దృష్టికి రాలేదు : మెప్మా ఎండీ
పిఠాపురం మున్సిపాలిటీలో జరిగిన పింఛన్ల అక్రమాలు తమ దృష్టికి రాలేదని మెప్మా ఎండీ చినతాతయ్య చెప్పారు. పాదగయ దర్శనానికి వచ్చిన సందర్భంగా ఆయనను కలిసిన విలేకరులు పింఛన్ల అక్రమాలపై ప్రశ్నించారు. అక్రమాలపై కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిగిందని తహసీల్దారు సుగుణ చెప్పగా ఈ విషయంపై కలెక్టరుతో మాట్లాడి తెలుసుకుని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గత రెండేళ్లలో 35 వేల మందిని వివిధ కారణాలతో పింఛన్లకు అనర్హులుగా గుర్తించి, వారి పింఛన్లను రద్దు చేశామన్నారు. ప్రతి లబ్ధిదారుడి వేలిముద్రలు తీసుకుని మాత్రమే పింఛన్లు పంపిణీ చేస్తారని తెలిపారు. పింఛన్ల పంపిణీలో ఆయా మున్సిపల్ కమిషనర్‌ల విజ్ఞప్తి మేరకు సిబ్బందిని వినియోగించుకుంటున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా 385 మంది నేషనల్ అర్బన్ లైవ్‌హుడ్ మిషన్ కో ఆర్డినేటర్స్‌ను నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేసిందని ఆయన తెలిపారు. వీరిని త్వరలోనే ఎంపిక చేసి తీసుకుంటామన్నారు. మెప్మాలో 72 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
Advertisement
Advertisement