నాన్న కోరిక, నా లక్ష్యం నెరవేరింది..
నాన్న కోరిక, నా లక్ష్యం నెరవేరింది..
Published Tue, Jun 20 2017 10:59 PM | Last Updated on Tue, Sep 5 2017 2:04 PM
సివిల్ సర్వీస్‌లో 3వ ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ
నన్నయ్య వర్సిటీ, లెనోరా దంత వైద్య కళాశాలలో ఘన సత్కారం
‘నీ జేబులో గ్రీనింకు పెన్ను ఉండాలిరా, నీ ద్వారా మనలాంటి పేదలెందరికో సేవలందాలిరా’ అన్న నాన్న మాటలే... సివిల్స్‌లో మూడో ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణకు ప్రేరణ. నాన్న కోరికను లక్ష్యంగా చేసుకున్న అతడు 11 ఏళ్లపాటు కఠోరంగా శ్రమించాడు. కొంతమంది మిత్రులు, సహచరులు, బంధువులు నిరుత్సాహపరిచినా.. పేదరికం అడ్డంకిగా మారిన.. అతడి గురి లక్ష్యంపైనే ఉంది. ఇంతవరకూ తెలుగు రాష్ట్రంలోనే ఎవరూ సాధించలేని ఈ ర్యాంకును... తెలుగు మీడియంలో పరీక్ష రాసిన ఇతడు సాధించి కొత్త రికార్డును నెలకొల్పాడు. అందుకే తెలుగు ప్రజలు ఇతడికి నీరాజనాలు పడుతున్నారు. మంగళవారం రాజమహేంద్రవరం వచ్చిన ఇతడిపై విద్యార్థులతో సమానంగా అధ్యాపకులు, అచార్యులు కూడా ప్రేమాభిమానాలు కురిపించారు. వారి అభిమాన వర్షానికి తడిచి ముద్దైన గోపాలకృష్ణ వారందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాడు.
రాజానగరం : ‘తెలుగు మీడియంలో చదువుకున్నా, పేదరికం అడ్డంకిగా ఉన్నా.. నాన్న కోరికను తీర్చడంతోపాటు నా లక్ష్యాన్ని కూడా సాధించాలనే తపనతో 11 సంవత్సరాలపాటు కఠోరంగా శ్రమించాను’ అంటూ... అంటూ సివిల్స్‌లో మూడో ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణ చేసిన ప్రసంగం అటు విద్యార్థులను ఇటు అధ్యాపకులు, ఆచార్యులను మంత్రముగ్ధులను చేసింది. నగరానికి వచ్చిన మంగళవారం అతడిని ఆదికవి నన్నయ యూనివర్సిటీ, రాజానగరంలోని కేఎల్‌ఆర్ లెనోరా దంతవైద్య కళాశాలలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రోణంకి మాట్లాడుతూ లక్ష్యసాధనకు కష్టపడుతుంటే కొంతమంది మిత్రులు, సహచరులు, బంధువులు కాస్త నిరుత్సాహపరిచినా వెనుకంజవేయలేదన్నారు. అప్పటికే చేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగం ఆత్మస్ధైర్యాన్నిచ్చిందన్నారు. ఇంత ర్యాంకు సాధించడంలో ఎదురైన కష్టాలు, ఇబ్బందులు, లక్ష్యాన్ని సాధించేందుకు చేసిన కృషిని వివరించారు. ప్రభుత్వ బడులలోనే ఉన్నత విద్య సాగిందని, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంటర్ తరువాత టీటీసీ చేసి డీఎస్సీ రాయడంతో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చిందన్నారు. అయితే సివిల్స్ కోసం డిగ్రీ ప్రైవేటుగా చదివానన్నారు. ఇలా 11 ఏళ్లు కఠోర శ్రమతో మూడుసార్లు విఫలమై..నాలుగో ప్రయత్నంలో ఈ ర్యాంకు సాధించినట్టు చెప్పారు. ఇంతవరకూ పడిన కష్టమే రేపు మంచి పరిపాలనాధికారిగా తీర్చిదిద్దుతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
పరీక్షకు ప్రివేర్ అయిన తీరు...
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్స్ పరీక్షకు ఏవిధంగా ప్రిపేర్ కావాలి, ఏ పేపర్లు ఉంటాయి, ఎన్ని మార్కులు సాధించాలనే విషయాలను కూలకషంగా వివరించారు. ఇంటర్య్వూతోపాటు 2,025 మార్కులకు 1,104 మార్కులే తనకు వచ్చాయన్నారు. తన ప్రసంగం వింటున్న విద్యార్థులలో కనీసం ఒకరిద్దరైనా సివిల్స్ లక్ష్యం వస్తే ఇక్కడకు వచ్చినందుకు ఫలితం ఉంటుందన్నారు. ఇంగ్లిష్‌లో చదువుకున్న వారే విజయం సాధిస్తారనే భావాన్ని విడనాడాలని, భాష ఏదైనా భావం ఉండాలనే వాస్తవాన్ని గ్రహించాలన్నారు. ఈ సందర్భంగా దంత వైద్య కళాశాలలో విద్యాభ్యాసంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను ఆయన అందజేశారు.
నాడు బుర్రా, నేడు రోణంకి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సివిల్ సర్వీసులో 1993లో బుర్రా వెంకటేష్ 12వ ర్యాంకును సాధిస్తే నేడు రోణంకి గోపాలకృష్ణ మూడో ర్యాంకును పొందారని నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. ఈ నేపథ్యంలో, భవిష్యత్తులో మొదటి ర్యాంకును సాధించేవారెవ్వరని విద్యార్థులను ప్రశ్నించారు. తెలుగులో మాట్లాడటమే నామోషీ అనుకునే ఈ రోజుల్లో తెలుగులో పరీక్ష రాసి ఈ ర్యాంకును పొందడం సా«ధారణ విషయం కాదన్నారు. సాధారణ కుటుంబం నుండి వచ్చినవాడు కావడం మరీ విశేషమన్నారు. కేఎల్‌ఆర్ లెనోరా దంత వైద్య కళాశాల కార్యదర్శి వై.మధుసూదనరెడ్డి మట్లాడుతూ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం లోపం ఉండకూడదన్న విషయాన్ని గోపాలకృష్ణ నిరూపించారన్నారు.
ఘన సత్కారం
అనంతరం గోపాలకృష్ణను కళాశాల యాజమాన్యం గజమాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసింది. నన్నయ యూనివర్సిటీలో ఉపకులపతి ఆచార్య ముత్యాలునాయుడు ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు కూడా ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో నన్నయ అధ్యాపక బృందం ఆచార్య ఎస్.టేకి, ఆచార్య మట్టారెడ్డి, ఆచార్య పి.సురేష్‌వర్మ, డాక్టర్ కె.సుబ్బారావు, డాక్టర్ టి.సత్యనారాయణ, డాక్టర్ ఆలీషాబాబు, ఈసీ మెంబర్ విజయనిర్మల, డీఎస్పీ రమేష్‌బాబు, సింగపూర్ సిటీ బ్యాంకు ఉపాధ్యక్షులు అనుమోలు సారథి, దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ విశ్వప్రకాష్‌రెడి, వైస్ ప్రిన్సిపాల్ ధల్‌సింగ్, డైరెక్టర్లు లక్ష్మణరావు, నాగార్జనరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Advertisement