అన్నీ తానే....అంతా నేనే
అన్నీ తానే....అంతా నేనే
Published Thu, Jun 8 2017 11:40 PM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM
- బాబు ప్రసంగం ప్రారంభంలోనే లేచిపోయిన జనం
- గంట కూడా ఓపిక లేకపోతే ఇంకేం సాధిస్తారంటూ సీఎం అసహనం
- వెళ్లిపోతున్నవారిని గేట్టు వేసి అడ్డుకున్న పోలీసులు
- గేట్లు దూకి కొంతమంది, గేట్లు సందుల్లోంచి మరికొంతమంది బయటకు
- ‘సాక్షి’ కథనాలే ప్రధాన అజెండాగా మళ్లీ హామీలు
- పొగడ్తలతో ఉద్యోగ సంఘ నేతల ఉపన్యాసాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :అన్నీ తానే...అంతా నేనే.. అన్నట్టుగా సీఎం చంద్రబాబు ప్రసంగం సాగింది. గత హామీలనే మరోసారి వల్లెవేస్తూ సుమారు గంటంపావు సాగిన బాబు ప్రసంగం జనాన్ని విసుగెత్తేలా చేసింది. కాకినాడ ఆనంద భారతి మైదానంలో గురువారం రాష్ట్ర స్థాయిలో నవ నిర్మాణ దీక్ష ముగింపు కార్యక్రమం జరిగింది. సాయంత్రం 5.15 నుంచి 6.40 గంటల వరకు ఏకబిగిన బాబు ప్రసంగించారు. ప్రసంగం ప్రారంభిస్తుండగానే జనం కుర్చీల్లోంచి లేచిపోవడాన్ని గమనించిన చంద్రబాబు కాస్త అసహనంతో గంట కూడా కూర్చోలేకపోతే ఇక జీవితంలో ఏమి సాధించలేమంటూ వారిని వెళ్లకుండా చేశారు. ఆ ఉపన్యాసం అయిందనుకునే సరికి రాష్ట్ర్రస్థాయి మహా సంకల్పం పేరుతో 20 నిమిషాలకు పైగానే ప్రతిజ్ఞ చేయించారు. చంద్రబాబు ప్రసంగంలో రాష్ట్రంలో ‘అన్నీ తానే’ చేశానని చెప్పుకునే ప్రయత్నమే ఎక్కువగా కనిపించింది. గతంలో చెప్పిన అంశాలనే మరోసారి చెప్పుకుంటూ పోతూ జనానికి విసుగు పుట్టించారు. హైదరాబాద్ హైటెక్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఔటర్‌రింగ్ రోడ్డు, విలీన మండలాల్లో ఏడు గ్రామాలు కలిపేతేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని కేంద్రాన్ని హెచ్చరించి పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించానని చెప్పుకురావడం, రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని విస్మరించిన చంద్రబాబు వేదికపై మాత్రం రైతులకు రూ.24 వేల కోట్ల రుణ విముక్తి కల్పించింది దేశంలో తానొక్కడినేని గొప్పలు చెప్పుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఎవరెస్టు అధిరోహకుల ఘనతనూ తన ఖాతలోకే...
ఎవరెస్టు అధిరోహించిన 14 మంది సభ్యుల బృందంలోని రాణి, భరత్‌లు తమ అనుభవాలను వివరించారు. అయితే వారిని వేదికపైకి ఆహ్వానించిన చంద్రబాబు ‘ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.40 లక్షలు ఖర్చు చేశామని ఇదంతా వారి విజయవం కాదంటూ’నే వారి ఘనతను తన ప్రభుత్వ ఖాతాలో వేసేందుకు ప్రయత్నించారు. ఓ పక్క రాష్ట్రం కష్టాల్లో ఉందని, డబ్బుల్లేవని బీద అరపులు అరుస్తూ మరో పక్క భవిష్యత్తులో తలసరి ఆదాయాన్ని కోట్లలో తీసుకు వస్తాననడంతో జనం విస్మయానికి గురికావడం కనిపించింది. రాజధాని నిర్మిస్తానని చెప్పడంలో తప్పు లేదు, కానీ చరిత్రలో వెయ్యి, రెండువేల ఏళ్ల వరకు నిలిచిపోతుందనడమే కాస్త విడ్డూరంగా కనిపించింది.
బాబు భజనలో...
ఉద్యోగుల సంఘం ప్రతినిధిలుగా సభకు హాజరైన అశోక్‌బాబు, మురళీకృష్ణ టీడీపీ నేతలను మించిపోయి చంద్రబాబు భజన చేయడం సభికులను ఆశ్ఛర్యానికి గురిచేసింది. అమరావతిని తీర్చిదిదేందుకు కష్టపడుతున్న చంద్రబాబును జీవితకాలం సీఎంగా ఉండాలని ఒకరు, అసలు అమరావతి అంటేనే ఒక అవకాశమంటూ మరొక నేత చేసిన వ్యాఖ్యలు విస్మయాన్ని కలిగించాయి. అసలు వారిద్దరూ ఉద్యోగ సంఘం నాయకుల్లా కాకుండా టీడీపీ నేతలను మించి ప్రసంగించారంటూ సభికులు చర్చించుకోవడం కనిపించింది.
‘సాక్షి’ అంశాలే అజెండాగా...
పనిలో పనిగా చంద్రబాబు మరోసారి ‘సాక్షి’పై తన అక్కసును వెళ్లగక్కారు. నవ నిర్మాణ దీక్షను అన్ని పత్రికలు మంచి కవరేజ్ ఇస్తే ‘సాక్షి’ మాత్రం వ్యతిరేక కథనాలు ప్రచురించిందంటూ విమర్శలకు దిగారు. కానీ అదే చంద్రబాబు గతంలో జిల్లాకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ గురువారం ‘సాక్షి’లో ప్రచురించిన కథనాల్లోని అంశాలే అజెండాగా మాట్లాడటం విశేషం. కాకినాడ ఉప్పుటేరుపై రూ.146 కోట్లతో మూడో వంతెన, ఏజెన్సీ ప్రాంతంలో వైద్య, విద్య, మౌలిక సదుపాయాలపై మరోసారి హామీల వర్షం కురిపించారు. చంద్రబాబు కంటే ముందు ప్రసంగించే అవకాశం దక్కిన ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, కాకినాడ ఎంపీ తోట నరసింహం సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తేందుకు పోటీపడటం కనిపించింది. తాను నివాసం ఉండే అమలాపురంలో బుధవారం రాత్రి నుంచి 14 గంటలపాటు విద్యుత్ లేక జనం ఇబ్బందులు పడితే బాబు సీఎం అవ్వడంతోనే నిరంతర విద్యుత్ ఇస్తున్నామని చినరాజప్ప చెప్పడం చర్చనీయాంశమైంది.
Advertisement