మాటలన్నీ నీటిమూటలేనా?
మాటలన్నీ నీటిమూటలేనా?
Published Wed, Jun 7 2017 11:23 PM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM
-జిల్లాకు వచ్చిన ప్రతిసారీ హామీలతో ‘చంద్ర’జాలం
-అంగర నుంచి విలీన మండలాల వరకూ వరాల వర్షం
-వాటిలో ఏ ఒక్కటీ సాకారం కాని చేదు వాస్తవం
-నేడు ‘మహా సంకల్పం’ పేరుతో మరోసారి జిల్లాకు రానున్న సీఎం
మాటలతో కోటలు కట్టడంతో ఆరితేరిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘అర చేత వైకుంఠాన్నే’ కాదు.. ‘కొనగోట కైలాసాన్నీ’ చూపగల ఇంద్రజాలికుడని చెప్పవచ్చు. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న ఆయన.. 2014 ఎన్నికల ప్రచారంంలో ఇవ్వని హామీ లేదు. చెయ్యని వాగ్దానం లేదు. వాటిని నమ్మి ఓట్లేసి, గద్దెనెక్కించిన జనాన్ని.. ముఖ్యమంత్రిగా తన పాలనతో మెప్పించాల్సిన ఆయన అధికారం చేపట్టి గురువారం నాటికి మూడేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరగుతున్న నవనిర్మాణదీక్షల ముగింపు ఉత్సవం ‘మహా సంకల్పం’ పేరుతో కాకినాడలో జరగనుంది. ఈ వేడుకకు హాజరు కానున్న సీఎం కొత్తగా ఏ హామీలు ఇస్తారో తెలియదు.. కానీ ఆయన అంతకు ముందు, ఈ మూడేళ్లలో ఇచ్చిన హామీలలో నెరవేర్చని వాటికి ఏం సమాధానం చెపుతారన్నది జిల్లావాసుల ప్రశ్న. జిల్లాకు వచ్చిన ప్రతిసారీ సీఎం ఎడాపెడా గుప్పిస్తున్న హామీలు దొంతరగా పెరిగిపోతున్నాయే తప్ప అమలుకు నోచుకోవడం లేదు. ఇక్కడ ఎత్తిచూపినవి.. ఈ మూడేళ్లలో ఆయన కురిపించిన హామీల్లో కురవని మబ్బుల్లా మిగిలిన వాటిలో కొన్ని మాత్రమే..
-సాక్షి ప్రతినిధి, కాకినాడ
అంగరకు ఆశాభంగమే..
- ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మభూమి–మా ఊరు రాష్ట్రంలోనే తొలిసారి కపిలేశ్వరపురం మండలం అంగరలో 2014 అక్టోబరు 4న ప్రారంభించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు హాజరైన కార్యక్రమంలో సీఎం వరాల జల్లు కురిపించారు. అంగరను స్మార్ట్ విలేజ్‌గా తీర్చిదిద్దుతానని జనం చప్పట్ల మధ్య అట్టహాసంగా ప్రకటించారు. చేనేతకు పేరొందిన ఆ ఊళ్లో ప్రతి చేనేత కార్మికుడికి రూ.12 వేల విలువైన వృత్తి కిట్లను అందజేస్తామన్నారు. సహకార సంఘాల అమ్మకాలపై 30 శాతం రాయితీ ఇస్తామనీ ఊరించారు. ఎప్పుడో ఎన్‌టీఆర్ హయాంలో అమలుచేసిన చీర, ధోవతి పథకం (జనతా స్కీం)ను పునరుద్ధరిస్తానన్నప్పుడు చేనేత కార్మికులు పట్టరాని ఆనందం దిక్కులు పిక్కటిల్లేలా కరతాళధ్వనులు చేశారు. అంగరలో రూ.కోటితో డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తామని, ఇళ్ల నిర్మాణానికి సేకరించిన మూడు ఎకరాలను మెరక చేసి జీ ప్లస్ టు గృహాలను నిర్మిస్తామని..ఇలా గ్రామానికి రూ.ఆరుకోట్ల విలువైన వరాలు ప్రకటించారు. మూడేళ్లు అయిపోతున్నా వాటిలో ఏ ఒక్క హామీనీ ఇంతవరకూ నెరవేర్చలేదు. ఏ వరాన్నీ సాకారం చేయలేదు. బాబు ఇస్తానన్న రాయితీæ లేక సహకార సంఘాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి.
గాలిలో దీపం.. గిరిజనుల ప్రాణం..
- చంద్రబాబు గత ఏడాది విలీనమండలాల పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా చింతూరులో జరిగిన బహిరంగ సభలో సీఎం ఆ ప్రాంత గిరిజనులకు అనేక హామీలు గుప్పించారు. చింతూరులో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో మన్యంవాసులు ఎంతో సంబరపడ్డారు. ఇప్పటికీ అది ఏరియా ఆసుపత్రిగానే ఉంది. పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. ఒకే ఒక వైద్యుడు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. కాళ్లవాపు వ్యాధితో గిరిజనులు ప్రాణాలు కోల్పోతుంటే కనీసం ప్రత్యేక వైద్య నిపుణుల నియామకం కూడా చేపట్ట లేదు. బస్సు డిపో ఏర్పాటు చేస్తామని గొప్పగా ప్రకటించిన సీఎం బస్‌స్టాండ్ ఏర్పాటుతో చేతులు దులుపుకొన్నారు. నాలుగు విలీన మండలాల్లో గిరిజన రైతులకు సాగునీరందించేందుకు 53 ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు రూ.9 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నేటికీ వాటికి మరమ్మతులు జరగలేదు. నాలుగు మండలాల్లో విద్యార్థుళఖు పౌష్టికాహారం కోసం చింతూరులో సెంట్రల్ కిచెన్ ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు హామీ కూడా అటకెక్కింంది.
పీబీసీపై వాగ్దానం.. ఎండమావిలో కెరటం..
-ఎన్నికలకు ముందు బాబు పాదయాత్రకు వచ్చిన సందర్బంలో పిఠాపురంలో పార్టీ స్థూపం ఆవిష్కరించిన సందర్బంగా అక్కడి రైతులకు పిఠాపురం బ్రాంచి కెనాల్‌ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కెనాల్ అభివృద్ధికి రూ.25 కోట్లు అవసరమని గతంలో అంచనా వేశారు. ప్రతి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఈ కెనాల్‌కు ఎంతో కొంత కేటాయిస్తారని అక్కడి రైతులు ఆశగా ఎదురుచూశారు. గొల్లప్రోలు సుద్దగడ్డ ముంపును కూడా నివారిస్తామన్నారు. పిఠాపురం వాసులకు ఈ రెండూ ప్రధాన సమస్యలు. ఎన్నికల ముందు ఓట్ల కోసం తమను నమ్మించి గద్దె నెక్కాక ఇచ్చిన హామీ నెరవేర్చకుండా గాలికొదిలేశారని ఆ ప్రాంత రైతులు మండిపడుతున్నారు.
ఒకే పరిశ్రమతో కే-సెజ్
-విశాఖ–చెన్నై కోస్తా కారిడార్‌లో భాగంగా కాకినాడను పారిశ్రామికవాడగా అభివృద్ధి చేస్తానని చంద్రబాబు అనేక పర్యాయాలు హామీ ఇచ్చారు. అంతెందుకు 2004కు ముందు సీఎంగా చివరి రోజుల్లో కే- సెజ్‌కు జీఓ ఇచ్చింది కూడా ఆయనే. కానీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఆ సెజ్‌లో ఒక చైనా బొమ్మల కంపెనీ మాత్రమే వచ్చింది. వాస్తవానికి ఆ సెజ్‌లో రూ.50 వేల కోట్ల విలువైన పెట్రో ఆధారిత పరిశ్రమలు తీసుకువస్తామన్నారు. ఒకవేళ పరిశ్రమలు తీసుకు రాలేకపోతే రైతుల నుంచి సేకరించిన భూములు తిరిగి ఇచ్చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు తమ స్థితి రెండింటికీ చెడ్డ రేవడిగా మారిందని ఆ ప్రాంత రైతులు గగ్గోలు పెడుతున్నారు. సెజ్‌లో వస్తాయని చెప్పిన హార్డ్‌వేర్, సాఫ్ట్ వేర్ పార్కులు కూడా అడ్రస్ లేవు. రాజమహేంద్రవరంలో కన్వెన్షన్ సెంటర్, స్టేడియం ఏర్పాటు చేస్తానన్న బాబు హామీలు కూడా గోదావరి వరద కెరటాలపై నీటిబుడగల్లాగే మిగిలాయి.
25 శాతం కాదు.. ఒక్క రూపాయిస్తే ఒట్టు..
- కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ప్రకటించిన బడ్జెట్‌లో 25 శాతం వాటా నిధులు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఇంతవరకు రూ.650 కోట్లు విడుదల చేసినా బాబు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ వాటాలో రూపాయి కూడా విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారని కోనసీమవాసులు ఆవేదన చెందుతున్నారు. వీటితో పాటు మోరి స్మార్ట్ విలేజ్, రామచంద్రపురంలో ఫైబర్‌గ్రిడ్, కాకినాడలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు, కాకినాడలో ఉప్పుటేరుపై మూడో వంతెన నిర్మాణం, జిల్లాలో మత్స్యకారుల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లు...ఇలా జిల్లాకు వచ్చిన ప్రతిసారీ హామీలు ఇవ్వడం, జిల్లా సరిహద్దు దాటాక గాలికొదిలేయడం చంద్రబాబుకు షరామామూలై పోయిందని జనం నిష్టురమాడుతున్నారు.
వలస పోతున్నారు
వారసత్వంగా వస్తున్న చేనేత వృత్తిని కొనసాగించే పరిస్థితి లేదు. ఇంటిల్లిపాదీ కష్టించి పనిచేసినా రోజుకు రూ.రెండు వందలు రావడం లేదు. దీంతో వృత్తిని నమ్ముకున్న వారు వలసలు పోతున్నారు. జనతా వస్త్రాల స్కీంను పునరుద్ధరిస్తానని, చేనేత కిట్లు ఇస్తానని, అమ్మకాలపై 30 శాతం రిబేట్ ఇస్తానంటూ అంగరసభలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరలేదు.
-రుద్రాక్షుల శ్రీనివాస్, చేనేత కార్మికుడు
Advertisement
Advertisement