వణుకుతున్న తూర్పు మన్యం | malaria east manyam | Sakshi
Sakshi News home page

వణుకుతున్న తూర్పు మన్యం

Published Tue, Jun 27 2017 11:27 PM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM

వణుకుతున్న తూర్పు మన్యం

వణుకుతున్న తూర్పు మన్యం

– మన్యంపై మలేరియా పంజా
–జ్వరాలు బారిన గిరిజనులు
- 16 గ్రామాల్లో దోమల విహారం
- పెరుగుతున్న కేసులు... ప్రేక్షకపాత్రలో అధికార యంత్రాంగం
- హెల్త్‌ ఎమర్జన్సీ ప్రకటించాలి: వైఎస్సార్‌ సీపీ నేతల డిమాండ్‌
 
- ఏజెన్సీలో 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గత ఏడాదికంటే మలేరియా కేసులు సంఖ్య పెరిగింది.  2016లో 1688 మందికి, 2017లో జనవరి నుంచి మే వరకు 2,676 మందికి... విలీన మండలాల్లో గత ఏడాది 699 మలేరియా కేసులు నమోదు. ఈ ఏడాది 1076 కేసులు నమోదయ్యాయి..
 
రంపచోడవరం: మలేరియా మరణాలు ఏజెన్సీని వణికిస్తున్నాయి. వర్షకాలం రాకుండానే తూర్పు ఏజెన్సీలో మలేరియా విజృంభిస్తోంది. . వై రామవరం, మారేడుమిల్లి లోతట్టు ప్రాంతాల్లోని గిరిజనులు మలేరియా జ్వరాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇంటికొకరు చొప్పున ఒకే గ్రామంలో జ్వరపీడితులున్నారు. గతంలోవలే  మలేరియా నివారణకు ముందుస్తు చర్యలు తీసుకోకపోవడంతో జ్వరాలు వ్యాప్తికి ప్రధాన కారణమవుతోంది..
వణుకుతున్న గిరిజన గ్రామాలు...
మలేరియా జ్వరాలు సీజన్‌కంటే ముందే గిరిజనులపై పంజా విసిరింది. రెండు రోజుల్లో విలీన మండలాల్లో ముగ్గురు మలేరియా జ్వరాలతో మృత్యువాడ పడ్డారు. వై రామవరం మండలం చాపరాయిలో జ్వరాలు బారిన పడి 16 మంది మృతి చెందగా 15 మంది కాకినాడ జీజీహెచ్‌లోను, 15 మంది రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. మరో 13 మంది చాపరాయి గ్రామం నుంచి మారేడుమిల్లి పీహెచ్‌సీకి తరలించారు. చాపరాయి పరిస్థితి ఇలా ఉంటే బొడ్డగండి పంచాయతీ పరిధిలోని 16 గ్రామాలు జ్వరాలతో వణుకుతున్నాయి. గొందికోట, నాగలోవ, అంటిలోవ తదితర గ్రామాలున్నాయి. గతకొన్ని రోజుల నుంచి జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్ధితి అధికారులు దృష్టికి వచ్చిన వైద్య బృందాలను పంపలేదు. అయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చంద్రయ్య మాట్లాడుతూ చాపరాయిలో ఐదు వైద్య బృందాలున్నట్లు తెలిపారు. చాపరాయి చుట్టుపక్కల గ్రామాలకు మరో ఏడు బృందాలను పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ బృందాలు ఇంటింటి సర్వే చేస్తాయన్నారు.
పెరిగిన మలేరియా కేసులు...
ఏజెన్సీలో 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గత ఏడాదికంటే మలేరియా కేసులు సంఖ్య పెరిగింది. 2016సంవత్సరంలో  96,121 మంది నుంచి రక్త నమూనాలను సేకరిస్తే 1688 మందికి  మలేరియా ఉన్నట్లు నిర్ధారణయింది. అయితే ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు 110334 మంది జ్వర పీడితులు నుంచి రక్త నమూనాలు సేకరిస్తే 2,676 మందికి మలేరియా ఉన్నట్లు నిర్ధారణయింది. విలీన మండలంలో గత ఏడాది 699 మలేరియా కేసులు నమోదు కాగా ఈ ఏడాది 1076 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది దోమ తెర రెండు లక్షలు ప్రతిపాదనలు పంపగా 80 వేలు దోమతెరలు మాత్రమే వచ్చాయి.
.ఏజెన్సీలో హెల్త్‌ ఎమర్జన్సీ ప్రకటించాలి...
ఏజెన్సీలో ఆనారోగ్య పరిస్థితులు తాండవిస్తున్నాయని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. తక్షణం హెల్త్‌ ఎమర్జన్సీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే మలేరియా బారినపడి విలీన మండలాల్లో ముగ్గురు చనిపోయారని భారీ మూల్యం చెల్లించకముందే తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. పూర్తిస్థాయిలో వైద్య పోస్టులు, సిబ్బందిని నియమించాలన్నారు. అన్ని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రక్షిత మంచినీరు అందించాలన్నారు. గొందికోట గ్రామంలో 80 మంది జ్వరాలతో బాధపడుతున్నారని వారికి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చాపరాయి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలన్నారు.
తూతూ మంత్రపు చర్యలు...
ప్రభుత్వం ఏజెన్సీలో ఆనారోగ్య పరిస్ధితులను చక్కబెట్టేందుకు తూతూ మంత్రంగా చర్యలు చేపడుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్‌ అన్నారు. బొడ్డగండి పంచాయతీలోని అన్ని గ్రామాలకు వైద్య బృందాలను పంపించి తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారిని తక్షణం తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. సహాయ చర్యలు వేగవంతం చేసేందుకు యుద్ధ ప్రతిపాదికన రోడ్డు నిర్మాణం చేయాలని డిమాండ్‌ చేశారు. మిషన్‌ సహాయంతో చాపరాయి గ్రామం వెళ్లేందుకు ఇబ్బందిగా ఉన్న గొప్పును తవ్వాలన్నారు. విలీన మండలంలో కాళ్లవాపు వ్యాధి వచ్చినప్పుడే గిరిజన గ్రామాల్లో ఆర్‌ఓ పాంట్లు ఏర్పాటు చేయాలని కోరిన పట్టించుకోలేదన్నారు. ఈ రోజుల గిరిజనులు కలుషిత నీరు తాగి జ్వరాలు బారిన పడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. జూలై 1న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధిత గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement