![Pumpkins exported from Manyam to four states](/styles/webp/s3/article_images/2025/01/12/gumadi.jpg.webp?itok=GNGSvfXz)
రుచిలో మేటి ప్రతి ఇంటా నిత్య వంటకం
పుణ్యక్షేత్రాల్లోని నిత్యాన్నదానంలో వినియోగం
ఇంటిపెరటితోపాటు కొండపోడులో సాగు
మన్యం నుంచి నాలుగు రాష్ట్రాలకు ఎగుమతి
వారపు సంతల్లో అమ్మకాల జోరు
మన్యం పండ్లకు నాలుగు రాష్ట్రాల్లో ఖ్యాతి
గుమ్మడి కాయలతో గిరిజనులకు విడదీయరాని బంధం ఉంది. ఒకప్పుడు వారికి నిత్యవంటకంగా ఉండే గుమ్మడి ఇప్పుడు మంచి ఆదాయ వనరుగా మారింది. సహజసిద్ధంగా కాయడం వల్ల వీటికి మంచి డిమాండ్ ఉంది. వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేసి తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. సంక్రాంతి పండగ నాడు వీటి వినియోగం ఎక్కువకావడంతో మన్యంలోని వారపు సంతల్లో అమ్మకాలు జోరందుకున్నాయి.
సాక్షి,పాడేరు: అల్లూరి జిల్లా మన్యంలో గిరిజనులు గుమ్మడిని ప్రత్యేకంగా సాగు చేయరు. ఇంటి పెరట్లో, ఖాళీ స్థలాలు, కొండపోడు భూముల్లో విత్తనాలు చల్లుతారు. పాదుకు 20 నుంచి 30 కాయల వరకు కాస్తాయి. చాలామంది గిరిజనులు గుమ్మడి కాయను నిత్య వంటకానికి ఉపయోగిస్తున్నారు. ఎంతో ఇష్టంగా తినడం వల్ల ఇంటికి వచ్చే అతిథులకు గుమ్మడి కూర వండి పెడుతుంటారు. లేత పిందెలతో కొంతమంది కూర తయారు చేస్తుంటారు.
గుమ్మడిలో పోషక విలువలు ఎక్కువ ఉన్నందున వినియోగం పెరిగింది. కొంతమంది గిరిజనులు పిందె దశలో ఒకొక్కటి రూ.20 నుంచి రూ.30కు విక్రయిస్తున్నారు. బాగా పండిన కాయను రూ.50 నుంచి రూ.80కు అమ్ముతున్నారు. ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా ఒకొక్క గిరిజనుడు రూ.2వేల వరకు ఆదాయం పొందుతున్నారు.
ఏజెన్సీలో జరుగుతున్న వారపు సంతల్లో గుమ్మడి అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ ప్రాంతం నుంచి నాలుగు రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. మంగళవారం జి.మాడుగుల, బుధవారం కించుమండ, చింతపల్లి, గురువారం గుత్తులపుట్టు, మజ్జిగరువు, శుక్రవారం పాడేరు, అరకు వారపు సంతల్లో గుమ్మడికాయల వ్యాపారం భారీగా జరిగింది. వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేశారు.
పుణ్యక్షేత్రాలకు..
తిరుమల తిరుపతి, సింహాచలం, అన్నవరం, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లోని నిత్యాన్నదానంకు మన్యం గుమ్మడికాయలను వినియోగిస్తున్నారు. స్థానికంగా కొనుగోలు చేసి దేవస్థానాలకు సరఫరా చేస్తుంటారు. సేంద్రియ పద్ధతిలో గిరిజనులు సాగు చేయడం వల్ల దేశవాళి గుమ్మడికాయలు మంచి రుచికరంగా ఉంటాయి. అందువల్ల మార్కెట్లలో కూడా మంచి డిమాండ్ ఉంది.
పండగ సీజన్‌లో..: సంక్రాంతి సీజన్‌లో వినియోగం ఎక్కువగా ఉన్నందున వ్యాపారులు గిరిజనుల వద్ద పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. దీంతో వారు మంచి ధర పొందుతున్నారు. ప్రస్తుతం సీజన్ మొదలవడంతో గిరిజనులు అమ్మకాల్లో నిమగ్నమయ్యా రు. వారపు సంతల్లో వ్యా పారం జోరందుకుంది.
గుమ్మడి బంధం
సంక్రాంతి పండగతో గుమ్మడి కాయకు సంబంధం ఉంది. మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశికి అధిపతి శని భగవానుడు. ఆ రోజు తెలకపిండి నలుగుతో స్నానం చేసి శనీశ్వరుని ప్రీతి కోసం నువ్వులు, గుమ్మడి కాయలు దానం చేయడం మైదాన ప్రాంతాల్లో పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తోంది. గుమ్మడి పండు భూమండలానికి ప్రతీక. దీనిని పేదలకు, బ్రాహ్మణులకు దానం చేస్తే భూదేవితో పాటు శ్రీమహా విష్ణువు అనుగ్రహం లభిస్తుందని ప్రజల విశ్వసిస్తుంటారు.
పోషక విలువలెన్నో..
గుమ్మడికాయను తరచూ తీసుకోవడం వల్ల ఎముకల దృఢత్వానికి కావాల్సిన కాల్షియం పుష్కలంగా అందుతుంది. దీనివల్ల కీళ్లనొప్పులు, మోకాళ్లనొప్పులు, బోలు ఎముకల వ్యాధి వంటి రోగాలు దరి చేరవు. ఫైబర్ జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి దోహదపడుతుంది.
కంటి ఆరోగ్యం మెరుగుకు ఉపయోగపడుతుంది. విటమిన్ సి, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నందున రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఉపయోగపడుతుంది. శరీరంలోని చెడు కొలె్రస్టాల్‌ను కరిగించడమే కాకుండా, అధిక బరువును నియంత్రణలోకి తెస్తుందని పోషణ నిపుణులు చెబుతున్నారు.
నిత్య వంటకం
గిరిజనులంతా గుమ్మడికాయలను ఏడాది పొడవునా దాచుకుంటూ నిత్య వంటకంగా వినియోగిస్తుంటారు.అలాగే ఇంటికి వచ్చే చుట్టాలు, బంధువులకు కూడా వీటి వండి పెడుతారు. సంక్రాంతి, ఇతర పండగల సమయంలోను గుమ్మడికాయలను కోసి గ్రామాల్లో ఒకరికొకరు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ముదిరిన గుమ్మడికాయలు పాడవకుండా ఉండేలే ఇంటి పరిసరాల్లో ఉండే జామ, మామిడి, పనసవంటి చెట్లకు వేలాడిదీసి భద్ర పరుస్తారు. చెట్టుకు కట్టిన గుమ్మడికాయలను దొంగిలించే పరిస్థితి కూడా ఉండదు.
రూ.50 ధరకు అమ్మా
ఇంటి పరిసరాలతో పాటు కొండపోడులో గుమ్మడి విత్తనాలు చల్లాం. దిగుబడి బాగానే ఉంది. గుమ్మడికాయలను పిందెల సమయంలోనే వంట వండుకుతిన్నాం. బాగా పండిన తరువాత అరకు సంతలో రెండు దఫాలుగా అమ్మాం. ఒకొక్క కాయ రూ.50కు విక్రయించగా రూ.వెయ్యి ఆదాయం వచ్చింది. కొన్ని కాయలను తిండి అవసరాలకు దాచుకున్నాం. – వంతాల చంపా,నందివలస, డుంబ్రిగుడ మండలం
గ్రామాల్లోకి వచ్చి కొంటున్నారు
గతంలో గుమ్మడికాయలను అమ్మేవారిమి కాదు. వ్యాపారులు గ్రామాలకే వచ్చి గుమ్మడికాయలను కొంటుండడంతో పాదులు ఎక్కు వ వేస్తున్నాం. గుమ్మడికా యలు సాగు చేయడం ద్వారా వచ్చే నగదును తమ అవసరాలకు ఉపయోగించుకుంటాం. గుమ్మడితో తమకు విడదీయరాని బంధం ఉంది. ఆచార సంప్రదాయంలో భాగంగా పండిస్తుంటాం. – కిల్లో కమలమ్మ, జోడిగుడ, హుకుంపేట మండలం
పెరుగుతున్న వినియోగం
సహజసిద్ధంగా పండుతున్న గుమ్మడి పండ్లను నాలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్లకు మాత్రమే ఎగుమతి చేసేవాళ్లం. ఇప్పుడు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్రాల్లో వినియోగం భాగా పెరిగింది. పోషక విలువలు ఎక్కువగా ఉండటంతో ఆయా రాష్ట్రాల ప్రజలు కూడా వంటకాల్లో వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల మార్కెట్లలో పోటీపడి కొనుగోలు చేస్తున్నాం. – వెంకట అప్పారావు, గుమ్మడి వ్యాపారి, పాడేరు
Comments
Please login to add a commentAdd a comment