కొయ్యూరు: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుతో కలసి తెల్లదొరలపై సాయుధ పోరాటం చేసిన గంటందొర, మల్లుదొర వారసుల సొంతింటి కల అతి త్వరలోనే సాకారం కానుంది. సామాజిక బాధ్యతగా నాగార్జున కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ(ఎన్‌సీసీ) రూ.2 కోట్లతో మల్లుదొర సొంత ఊరు అయిన కొయ్యూరు మండలం నడింపాలెం పంచాయతీలోని లంకవీధిలో నిర్మిస్తున్న ఇళ్లు దాదాపు పూర్తయ్యాయి. నెల రోజుల్లో గంటందొర, మల్లుదొర వారసులు 11 మందికి వాటిని అందజేస్తారు. స్వాతంత్య్ర సమరయోధులు గాం గంటందొర, మల్లుదొర వారసుల కుటుంబాలకు సొంతిళ్లు లేక, గుడిసెల్లో నివసిస్తూ ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ద్వారా క్షత్రియ సేవా సమితి నాగార్జున కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ దృష్టికి తీసుకెళ్లింది.
సామాజిక బాధ్యతగా సమరయోధుల వారసులకు ఇళ్లు నిర్మించానలి కోరారు. ఈ మేరకు 11 మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఎన్‌సీసీ ముందుకొచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో అప్పటి అరకు ఎంపీ జి.మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మమ్మ, ఐటీడీఏ పీవో అభిషేక్ గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని సంస్థ నిలబెట్టుకుంది. రూ.2 కోట్లు వెచ్చింది రెండు భవనాలను నిర్మించింది.
ఒక్కో భవనంలో ఆరు ఫ్లాట్లు...
ఒక్కో భవనంలో ఆరు ఫ్లాట్లను ఎన్‌సీసీ నిర్మించింది. ఒక్కో ఫ్లాట్‌లో రెండు బెడ్ రూమ్‌లు, అటాచ్డ్ బాత్‌రూమ్‌లు, హాలు, వంటగదితో సహా అన్ని వసతులు కల్పించింది.మల్లుదొర , గంటందొర వారసులు 11 మందికి 11 ఫా్లట్లు కేటాయించి, ఒక ఫ్లాట్‌ను ఎన్‌సీసీ తమ కార్యకలాపాల కోసం వినియోగించుకోనుంది. ఈ నిర్మాణ పనులను క్షత్రియ సేవా సమితి పర్యవేక్షిస్తోంది.
ఆనందంగా ఉంది
ఎన్నో సంవత్సరాల నుంచి సరైన గూడు లేక అవస్థలు పడుతున్నాం. ఇప్పటికి మా నిరీక్షణ ఫలించింది. చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి గృహాలు నిర్మించి ఇస్తున్న సంస్థకు కృతజ్ఞతలు. – గాం గంగరాజు, లంకవీధి
సొంతిల్లు అదృష్టం
ఎట్టకేలకు సొంత గూటికి చేరుతున్నామన్న ఆనందంలో ఉన్నాం. ఇంత అద్భుతంగా ఇళ్లు నిర్మించి ఇస్తారని అనుకోలేదు. రెండు బెడ్ రూమ్‌లతోపాటు హాలు, కిచెన్, అటాచ్డ్ బాత్‌రూమ్‌లు నిర్మించడం ఆనందంగా ఉంది. – గాం సన్యాసమ్మ, లంకవీధి
సమస్యను పరిష్కరించాం
ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని స్వాతంత్య్ర సమరయోధుల పక్కా ఇళ్ల నిర్మాణం మా హయాంలో చేపట్టినందుకు ఆనందంగా ఉంది. నాగార్జున కన్‌స్ట్రక్షన్స్ సంస్థ బాధ్యత తీసుకుని ఇంత అద్భుతంగా గృహాలను నిర్మించడం మరిచిపోలేని విషయం. లబ్ధిదారులు జీవితకాలం ఆ కంపెనీకి రుణపడి ఉంటారు. – జి.మాధవి, మాజీ ఎంపీ, అరకు
Comments
Please login to add a commentAdd a comment