పెన్షన్ టెన్షన్..!
పెన్షన్ టెన్షన్..!
Published Sun, Nov 27 2016 1:29 AM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM
వచ్చే నెల గడిచేదెలాగబ్బా..l
రూ.100 నోట్లు సిద్ధం చేయాలన్న కలెక్టర్
ఆ నోటంటేనే చేతులెత్తేస్తున్న బ్యాంకర్లు
48 లక్షల వంద నోట్లు ఎలా తెచ్చేది
రూ.48 కోట్లు ఎలా పంచేది
వామ్మో ఒకటో తారీఖు
ఇన్నాళ్లూ ఓ గడబిడి... ఒకటో తారీఖంటేనే మరో గజిబిజి. ముఖ్యంగా పింఛన్ దారులకు పంపిణీ చేసే పింఛన్ టెన్షన్ వారం రోజుల ముందే ప్రారంభమయింది. ఈసారి జిల్లా కలెక్టర్ సహా అన్ని శాఖల అధికారులకూ ఒత్తిడి ఎదురవుతోంది. పింఛన్ తీసుకునే వారికి చిల్లర సమస్య లేకుండా ఉండాలంటే అందరికీ రూ.100 నోట్లే ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే రూ.48 కోట్లకు సరిపడా రూ.100 నోట్లుంటే 48 లక్షల వంద రూపాయల నోట్లు నాలుగు లక్షల మంది పింఛనుదారుల కోసం నెలాఖరునాటికి సిద్ధం చేయాలి. ఒకవేళ వచ్చే నెల ఒకటో తేదీ నాటికి బ్యాంకులకు కొత్త రూ.500 నోట్లు వచ్చినా సరే చిల్లర సమస్య ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే పింఛన్ దారులు ఆ నోటును తిరస్కరించే అవకాశం ఉండడం దీనికి కారణం.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : నిన్న మొన్నటి వరకు కళ్లకు అద్దుకుని తీసుకునే పెద్ద నోట్లు ఇప్పుడు పనికి రానివిగా మారిపోయాయి. ఆ నోట్లంటే అయ్య బాబోయ్ వద్దు వద్దంటూ మొహం చాటేస్తున్నారు. ముఖ్యంగా పింఛన్ పంపిణీ అంటేనే లబ్ధిదారుల మాట ఎలా ఉన్నా పంపిణీ చేసే సంబంధిత అధికారులకు మాత్రం ముందస్తుగానే ముచ్చెమటలెక్కుతున్నాయి. దీనికి కారణం రూ.500, రూ.1000 నోట్లు రద్దు కావడమే. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక వివిధ రకాల పింఛన్లను రూ.1000, రూ.1500కు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ‘పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం’గా మారింది. ఆ పింఛన్ ఆధారంగానే జీవితాలు నెట్టుకొస్తున్న వేలాది మంది వచ్చే నెల ఎలా గడుస్తుందా అనే ఆందోళన చెందుతున్నారు. మరో నాలుగు రోజుల్లో నెల గడిచి పోయి ఒకటో తేదీ రానుంది. ప్రతి నెలా ఠంఛన్ గా పింఛన్ ఒకటో తేదీన ఇవ్వాలి. కారణాంతరాలతో అప్పుడప్పుడు జాప్యంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఆ ఇబ్బందులు కన్నా తాజాగా నోట్ల రద్దుతో ఇవ్వాల్సిన రూ.1000, రూ.1500లను ఎలా పంపిణీ చేయాలని తర్జనభర్జన పడుతున్నారు.
దయనీయం...
కానీ ఏ నెలకానెల పింఛన్లపైనే ఆధారపడి పొట్ట పోసుకునే పింఛన్ దారుల పరిస్థితి దయనీంగా తయారైంది. రేషన్ కార్డుపై వచ్చే బియ్యం తెచ్చుకుని, పింఛ¯ŒS సొమ్ములతో వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులకు నెలకు సరిపడా మందులు తెచ్చుకుంటున్నారు. ఇలా దయనీయంగా జీవనం సాగించేవారు జిల్లాలో నాలుగు లక్షల మందిపైనే ఉన్నారు. వారందరికీ వచ్చే నెల పింఛన్ ఎలా అందుతుందా అనే ఆందోళన నెలకుంది. ఎందుకంటే సాంకేతిక కారణాలతో ఒక్కోసారి పింఛన్ పంపిణీ ఆలస్యమైనప్పుడు వారు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు రూ.500లు, రూ.1000 నోట్లకు చిల్లర దొరకపోవడం ఈ అవస్థలకు అదనంగా చేరాయి. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులందరికీ కలిపి జిల్లాలో ప్రతి నెలా రూ.48 కోట్లు పంపిణీ జరుగుతోంది.
రూ. 500 నోట్లేవీ..
వచ్చే నెల పింఛన్ పంపిణీ టెన్షన్ పింఛన్ దారులకే కాకుండా ఈసారి జిల్లా కలెక్టర్ సహా అన్ని శాఖల అధికారులకూ పట్టుకుంది. పింఛన్ తీసుకునే వారికి చిల్లర సమస్య లేకుండా ఉండాలంటే అందరికీ రూ.100లు నోట్లే ఇవ్వాలి. అలా అనుకుంటే రూ.48 కోట్లు విలువైన రూ.100 నోట్లు అంటే 48 లక్షల రూ.100 నోట్లు నెలాఖరునాటికి సిద్ధం చేయాలి. అలా చేయగలిగితేనే పింఛన్ పంపిణీ సజావుగా సాగుతుంది. లేదంటే నాలుగు లక్షల మంది పింఛన్ దారులతో ఇక్కట్లు తప్పవు. కలెక్టర్ అడిగారు కదా అని అన్ని నోట్లు ఏర్పాటుచేసే పరిస్థితి జిల్లాలో బ్యాంకర్ల వద్ద ఉందా అంటే అంత సీన్ లేదంటున్నారు. రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ ఇదే విషయమై ప్రత్యేకంగా బ్యాంకర్లతో సమావేశమై పింఛన్లకు అవసరమైన రూ.100 నోట్లు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. క్షేత్ర స్థాయిలో బ్యాంకుల్లో రూ.100 నోట్లు అంతగా లేవని అన్ని నోట్లు వంద నోట్లే ఇవ్వాలంటే సాధ్యంకాదని బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నారు. ఈ సమస్య నుంచి గట్టెక్కేదెలా దేవుడా అని తలలు పట్టుకుంటున్నారు అధికారులు.
రూ.500 నోట్ల వచ్చేసినా...
ఒకవేళ వచ్చే నెల ఒకటో తేదీ నాటికి బ్యాంకులకు కొత్త రూ.500 నోట్లు వచ్చేస్తాయి గట్టెక్కేస్తామని ఆశ కూడా లేకపోలేదు. కానీ కొత్త నోట్లు వచ్చినా రూ.1000లు పింఛన్ దారులకు రెండు రూ.500లు నోట్లు, అదే రూ.1500లు పింఛన్ దారులకైతే మూడు రూ.500 నోట్లు ఇచ్చేస్తారనుకుందాం. ఆ రూ.500 నోట్లు బయట మారకమే పెద్ద సమస్య. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.500ల నోటు తీసుకోవాల్సిందని పెట్రోలు బంకులు, మెడికల్ షాపులు, ఆస్పత్రులు..ఇలా పలు రంగాలకు నిర్థేశించినా అక్కడకు వెళ్లే సరికి ఎగాదిగా చూస్తున్నారని వినియోగదారులు అంటున్నారు. పింన్ కింద రూ.500 నోట్లుగా ఇచ్చినా దాచుకోవడానికే తప్ప చిల్లర ఇచ్చే నాధుడే ఉండరని వారంతా ఆందోళన చెందుతున్నారు. కేంద్రం చెప్పినట్టు ఆన్ లైన్‌లో పింఛన్లు వారి ఖాతాలకే బట్వాడా చేసేద్దామన్నా సుమారు 50 వేల మందికి బ్యాంకు ఖాతాలు లేవంటున్నారు.
Advertisement
Advertisement