సస్యశ్యామలంపై ... స్వార్ధపు చీడ
సస్యశ్యామలంపై ... స్వార్ధపు చీడ
Published Tue, Jun 6 2017 11:37 PM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM
- పెద్దల నిర్మాణ బాగోతం
- సాగు నీటికి బ్రేకులు
- సాగును ప్రశ్నార్థకంలో పడేసిన నేతల స్వార్థం
- రైతులకు నీటి కష్టాలు
- గుక్కెడు నీటి కోసం జనం కటకట
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రజలు ఎలాపోతే మాకేంటి ... మా జేబులు నిండితే చాలన్నట్టుంది అధికార పార్టీ నేతల తీరు. వారి స్వార్థం వేల ఎకరాల సాగును ప్రశ్నార్థకం చేస్తోంది. అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా పంట కాలువ వెంబడి పనుల కాంట్రాక్ట్‌లో పడి తమ స్వప్రయోజనాల కోసం అటు కోనసీమలోను, ఇటు సామర్లకోటల్లో పంట కాలువలకు సాగునీరు సరఫరా కాకుండా నిలిపివేశారు. కేవలం రెండున్నర కోట్ల వ్యయంతో సామర్లకోట పంట కాలువపై నిర్మిస్తున్న వంతెన కోసం వేలాది మంది రైతుల కంట కన్నీరు పెట్టేలా చేస్తున్నారు. అమలాపురంలో రూ.9.10 కోట్ల వ్యయంతో నల్లవంతెన–ఎర్రవంతెన మ«ధ్య పంట కాలువ పక్కన లాంగ్ రిటైనింగ్ వాల్ నిర్మాణంతో అమలాపురం–చల్లపల్లి పంటకాలువ, మురమళ్ల–ఎదుర్లంక మధ్య, గాడిలంక–కర్రివానిరేవు మధ్య పంట కాలువల్లో రిటైనింగ్ వాల్స్ నిర్మాణం కోసం పంట కాలువలకు అడ్డగోలుగా సాగు నీరు నిలిపివేశారు. దాదాపు ఈ పనులన్నీ ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన బంధువులు, బినామీలే చేస్తున్నారు. ఈ కారణంగా వారి స్వార్థం కోసం పంట కాలువలకు సాగునీరు సరఫరా చేయకుండా నిలిపివేయడంపై రైతులు మండిపడుతున్నారు. సామర్లకోట కాలువపై వంతెన నిర్మాణంలో ఒక మంత్రి తనయుడు బినామీగా పనులు చేపడుతుండంతోనే వేలాది మందికి సాగు, తాగునీరు ఇబ్బంది కలుగుతున్నా ఇరిగేషన్ అధికారులు చూసీచూడనట్టు పోతున్నారు. వారి నిర్వాకం ఫలితంగా జిల్లా కేంద్రం కాకినాడ నగరం, పెద్దాపురం, సామర్లకోట పట్టణాలు తాగునీటికి కటకటలాడుతున్నాయి. ప్రతి ఏటా కంటే ఈ ఖరీఫ్ సీజన్‌లో పంట కాలువలకు ముందుగానే నీరు విడుదల చేశారని సంబరపడ్డ రైతులకు అమాత్యుని నిర్వాకంతో శాపమైంది. ఇదంతా ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో ప్రజలు, రైతులు అల్లాడిపోతున్నారు. ధవళేశ్వరం గోదావరి నుంచి సామర్లకోట గోదావరి కాలువకు విడుదలచేసిన నీటిని కడియం కొత్త లాకులను మూసేసి సరఫరా కాకుండా బంధించేశారు.
నీటి విడుదల ఆనందం ఆవిరి...
ఈ నెల ఒకటో తేదీన ధవళేశ్వరం వద్ద ఈస్ట్రన్, సెంట్రల్ డెల్టాలకు ప్రభుత్వం అధికారికంగా సాగునీరు విడుదల చేసింది. ధవళేశ్వరంలో నీరు విడుదల చేసిన 48 గంటల్లోపు జిల్లాలో ఏ పంట కాలువలోనైనా చివరి వరకు నీరు పారాల్సిందే. అధికారికంగా సాగునీరు విడుదల చేసి మంగళవారం నాటికి ఆరు రోజులయింది. ఇంతవరకు సామర్లకోట గోదావరి కెనాల్‌కు చుక్కనీరు సరఫరా కాలేదు. ఇందుకు కారణమేమిటని ఆరా తీస్తే నేతల స్వార్థం కోసం సాగునీటి సరఫరా నిలిపివేసిన బాగోతం బయటపడింది.
కారణమిదీ...
సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే గోదావరి కాలువపై కొత్త వంతెన నిర్మాణానికి గతేడాది జూన్ 3న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప శంకుస్థాపన చేశారు. రూ.1.99 కోట్లు అంచనా వ్యయం నిర్మాణం ఆలస్యం కావడంతో అంచనా రూ.2.70 కోట్లకు పెరిగిపోయింది. ఏడాది తరువాత 18 రోజులు క్రితమే వంతెన పనులు మొదలుపెట్టడం గమనార్హం. వంతెన పనులు తెరవెనుక చక్కబెడుతున్న మంత్రి కుటుంబ సభ్యులు సామర్లకోట కెనాల్ నీటి సరఫరా నిలిపివేయించారని రైతులు మండిపడుతున్నారు.
ఈ నీరే సాగుకు ఆధారం...
ఈ కెనాల్ నుంచి సరఫరా అయ్యే నీరు సాగు, తాగుకు చాలా కీలకం. ఈ సాగు నీరుతో సామర్లకోట, కాకినాడ రూరల్ మండలాల్లోని చాలా గ్రామాల ఆయకట్టుకు జీవం పోస్తుంది. ఈ కాలువకు నీరు వస్తే ఖరీఫ్ దమ్ములు చేసుకుందామని ఆయకట్టు రైతులు ఎదురు చూస్తున్నారు. సామర్లకోట మండల పరిధిలో సుమారు 30 వేల ఎకరాలు, కాకినాడ రూరల్ రామేశ్వరం, గంగనాపల్లి, అచ్యుతాపురం గ్రామాలకు మరో 15వేల ఎకరాలకు సాగు నీరు సరఫరాకు బ్రేక్ పడింది. పిఠాపురం బ్రాంచి కెనాల్ పరిధిలోని ఆయకట్టుకు కూడా ఈ కాలువ నీరే ఆధారం. పిఠాపురం నుంచి గొల్లప్రోలు, తుని వరకు సుమారు 47 వేలు ఎకరాలకు సాగునీరు పిఠాపురం బ్రాంచి కెనాలే ఆధారం.
లక్ష మందికి గొంతు తడిపే కాలువ ఇదే...
సాగునీరే కాకుండా వేలాది మంది దాహార్తిని కూడా ఈ కాలువ తీరుస్తుంటుంది. చినరాజప్ప ప్రాతినిధ్యంవహిస్తున్న నియోజకవర్గంలోని సామర్లకోట, పెద్దాపురం మున్సిపాలిటీల పరిధిలోని లక్షన్నర మంది గొంతు తడిపే కాలువ కూడా ఇదే. సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో 70 వేలు, పెద్దాపురం మున్సిపాలిటీలో 55 వేల జనాభాకు తాగునీరు మున్సిపాలిటీలు సరఫరా చేయాలి. ఇందు కోసం సామర్లకోటలో రెండు రిజర్వాయర్లున్నాయి. సామర్లకోట–కాకినాడ రోడ్డులో సాంబమూర్తి రిజర్వాయరు, ఉండూరు రైల్వే గేటు వద్ద నాగార్జున చెరువును ఏర్పాటు చేశారు. గోదావరి కాలువ నీటితోనే ఈ రెండు మున్సిపాలిటీలకు నీరు రిజర్వు చేశారు. సాంబమూర్తి రిజర్వాయరు పెద్దాపురం మున్సిపాలిటీ, నాగార్జున చెరువు సామర్లకోట మున్సిపాలిటీతో పాటు కాకినాడలోని నాగార్జున ఎరువుల కర్మాగారానికి, కాకినాడ సీపోర్టుకు కూడా ఈ కాలువ నీరే ఆధారం. వేసవి తాపంతో రెండు చెరువులలో నీరు అడుగంటింది. దాంతో ఫిల్టరు ప్లాంటులకు నీరు అందని పరిస్థితి ఉంది. ఉన్న నీరు కూడా పసరు రంగుకు మారిపోయి నీరు చెడువాసన వస్తోందని పట్టణ ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
ఓ మంత్రి ఆదేశాలతోనే...
గోదావరి కాలువలో వంతెన పనుల్లో భాగంగా రెండుగట్ల వైపు కాంక్రీట్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. అవి పై ఎత్తుకు వచ్చే వరకు ఈ కాలువ నీటిని విడుదల చేయవద్దని ఒక ఆమాత్యుని హుకుం. ఆయన చెప్పిందే తడవు ఇరిగేషన్ అధికారులు ‘జీ హుజూర్’ అంటూ నీటిని కడియం లాకుల్లో నిలిపివేశారు. ప్రస్తుతం ఒక దిమ్మ నీటి మట్టం ఎత్తుకు రాగా, మరో దిమ్మ పునాదికే పరిమితమైంది. మరో వారం రోజుల వరకు ఈ పనులు పూర్తి అయ్యే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇదే కాలువ నీరు సామర్లకోట నుంచి వీకే రాయపురం, మాధవపట్నం మీదుగా కాకినాడ వరకు వెళుతుంది. ఈ కాలువలో వంతెన నిర్మాణ కాంట్రాక్ట్ కోసం నీరువిడుదల అపేస్తే వీకె రాయపురం, మాధవపట్నం వద్ద గోదావరి కాలువలకు అడ్డు కట్టలు వేసి మరీ కాలువ అవతలివైపు కొందరు నేతలు, రియల్టర్లు పంట పొలాలను లేఆవుట్ చేసుకోడానికి గ్రావెల్ రవాణా చేస్తున్నారు. ఇందుకోసం ఎక్కడిపడితే అక్కడ ముడుపులు మెక్కేసి గోదావరి కాలువలో అడ్డుకట్టలు వేసిన నీటిపారుదల శాఖాధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాగునీటికీ కటకటే...
కాకినాడ నగరంలో కూడా గోదావరి నీరు సరఫరా లేకపోవడంతో ఉన్న నీరు దుర్వాసన వస్తోందని నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అరట్లకట్ట వేసవి జలాశయంలో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో ప్రజలకు నీటి కష్టాలు తప్పడంలేదు. ప్రజలకు రెండుపూటలా నీరు అందించలేని పరిస్థితిని నగరపాలక సంస్థ ఎదుర్కొంటోంది. వేసవి జలాశయంలో 45 రోజులుకు సరిపడేంతగా నీటిని నిల్వ చేసుకున్నా ముందస్తు ప్రణాళిక లేక గడచిన వారం రోజులుగా నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. కుళాయిలు ద్వారా మురికినీరు సరఫరా అవుతుండటంతో నగరంలో సుమారు నాలుగు లక్షల మంది తాగునీటికి కటకటలాడుతున్నారు. గాంధీనగర్, రామారావుపేట, పాతబస్టాండ్, అశోక్‌నగర్ తదితర ప్రాంతాల్లో నాలుగు రోజులుగా మంచినీరు సరఫరా సక్రమంగా జరగడం లేదు. గోదావరి కాలువలు తెరచినప్పటికీ ఈ పరిస్థితి అధిగమించడానికి మరో నాలుగైదు రోజులుపైనే పడుతుందని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు.
‘గుక్కెడు నీరు రంగు మారి పొయింది’
గడచిన రెండు రోజులుగా తాగునీరు రంగు మారిపోయింది. నీరు చెడు వాసన వస్తుంది. గోదావరి కాలువకు నీరు వచ్చినా సామర్లకోటకు చేరకపోవడంతో తాగునీటి చెరువులు నింపుకునే అవకాశం లేకుండాపోయింది. అధికారుల నిర్వాకంతో సాగునీరు, తాగునీటికి ఇబ్బంది పడుతున్నాం.
తుంపాల శ్రీనివాసు, సీఐటీయు మండల అధ్యక్షుడు, సామర్లకోట.
బోరు నీరే శరణ్యం....
పెద్దాపురం మున్సిపాలిటీ ప్రజలకు బోరు నీరే శరణ్యంగా మారింది. గోదావరి జలాలు విడుదల చేసినా బోరు నీరు తప్పడం లేదు. సాంబమూర్తి రిజర్వాయరులో నీరు చాలా రుచిగా ఉంటాయి. బోరునీరు చాలా చప్పగా ఉంటున్నాయి.పట్టణ ప్రజలందరికి గోదావరి జలాలు అందించాలి. 20 రోజులుగా తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉంది.
షేక్ బేబీ, రామారావుపేట, పెద్దాపురం.
‘వర్షాలు లేవు...సాగునీరు లేదు’
గోదావరి కాలువలో నీరు వస్తే పంట భూముల్లో దమ్ములు చేసుకొవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత వేసవి కాలంలోని ఎండలకు భూములు బీటలు వారాయి. సామర్లకోట–వీకే రాయపురం మధ్యలో గోదావరి కాలువకు అడ్డుగా తాత్కలికం మార్గం ఏర్పాటు చేసుకొని లేవుట్లు వేస్తున్నారు. దాంతో గోదావరి కాలువ నీరు పంట కాలువలకు రావడానికి మరింత జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి.
వెలమర్తి శ్రీనివాసు, రైతు సంఘ నాయకుడు, వికె రాయపురం.
‘ఐదు రోజుల్లో విడుదల చేస్తాం’
సామర్లకోట గోదావరి కాలువపై జరుగుతున్న వంతెన పనులతో గోదావరి జలాలు విడుదలకు అంతరాయం కలిగింది. కడియంలో నీటిని నిలుపుదల చేశాం. ఐదు రోజుల్లో వంతెన స్తంభాలు పూర్తవుతాయి. వెంటనే గోదావరి కాలువలో మట్టిని తొలగించి గోదావరి కాలువకు నీరు అందించే ఏర్పాట్లు చేస్తాం.
విజయకుమార్, ఇరిగేషన్ డీఈ, కాకినాడ
Advertisement