బీభత్సం
బీభత్సం
Published Sun, Mar 12 2017 12:25 AM | Last Updated on Tue, Sep 5 2017 5:49 AM
ముంచెత్తిన అకాల వర్షం
తోడైన పెనుగాలులు, భారీ ఉరుములు, పిడుగులు
నేలనంటిన వరి చేలు
2 వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంట
కూలిన హోర్డింగ్‌లు ∙
భీతిల్లిన ప్రజలు
గొల్లప్రోలు (పిఠాపురం) : పెనుగాలులు.. కళ్లు మిరుమిట్లు గొలిపే మెరుపులు.. ఫెళఫెళారావాలతో చెవులు చిల్లులు పడేలా ఉరుములు, పిడుగులతో కురిసిన అకాల వర్షంతో ప్రజలు భీతిల్లారు. రాజమహేంద్రవరం, కాకినాడతోపాటు, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి, శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. భారీ ఉరుములు, పిడుగులు, మెరుపులకు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలుల వేగానికి పలు ప్రాంతాల్లో హోర్డింగులు, చెట్లు విరిగిపడ్డాయి. వివిధ శుభకార్యాలకు వేసిన టెంట్లు, కొన్ని ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. పెళ్లిళ్లు చేసుకునేవారు ఇబ్బందులకు గురయ్యారు. గొల్లప్రోలులో 216 జాతీయ రహదారి విస్తరణ పనులు చేపడుతున్న కార్మికులు ఏర్పాటు చేసిన గుడారాలు దెబ్బ తిన్నాయి. పెద్దాపురం, సామర్లకోట తదితర ప్రాంతాల్లో శనివారం ఉదయం కూడా భారీవర్షం కురిసింది. ఈ అకాల వర్షం అన్నదాతకు తీరని చేటును కలిగించింది. గొల్లప్రోలు రైల్వేస్టేషన్ ఆవల ఉన్న బాడవ, సీతానగరం, చింతరేవళ్లు తదితర ప్రాంతాల్లో ఈనిక, పొట్టదశలో ఉన్న వరి చేలు నేలనంటాయి. ముందుగా ఊడ్చిన చేలు అధికంగా వెన్ను వంచే దశలో ఉండడంతో గాలులకు ఒరిగిపోయాయి. కొన్నిచోట్ల సుడిగాలుల మాదిరిగా వీయడంతో చెల్లాచెదురుగా చేలు పడిపోయాయి. నేలనంటిన చేనులో అధిక శాతం రీసెర్చ్ వెరైటీకి చెందినవి ఉన్నాయి. గింజ పాలు పోసుకునే దశలో వరిచేలు నేలనంటడంతో దిగుబడిపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు 10 బస్తాల వరకూ దిగుబడి తగ్గుతుందని చెబుతున్నారు. మరో వారం పది రోజుల్లో పంట చేతికందుతుందనుకుంటున్న దశలో కురిసిన అకాల వర్షం తమకు తీరని నష్టం మిగిల్చిందని వారు ఆవేదన చెందుతున్నారు.
చెట్టు పడి ముగ్గురికి గాయాలు
పిఠాపురం టౌన్ : భారీ వర్షానికి గోర్స రైల్వే గేటు సమీపాన మోహన్‌నగర్ వద్ద చెట్టు కూలి పడింది. దీంతో అక్కడ ఉన్న రెండు దుకాణాలు ధ్వంసమయ్యాయి. దుకాణంలో నిద్రిస్తున్న భార్యాభర్తలు కానూరి వేణు, కమల తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలయ్యారు. అదే ప్రాంతంలోని మరో దుకాణంలో ఉన్న వనుము నాగేశ్వరరావు కూడా గాయపడ్డాడు. రథాలపేట సెంటర్‌లో హోర్డింగ్ విరిగి పడిపోయింది. పాతబస్టాండ్ వద్ద ఉన్న ఎగ్జిబిషన్‌లో వస్తువులు చెల్లాచెదురయ్యాయి. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. వర్షపు నీటికి మురుగు కాలువల్లోని నీరు తోడై పలు ప్రాంతాలు బురదమయంగా తయారయ్యాయి. వర్ష బీభత్సానికి పట్టణంలోని పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
Advertisement
Advertisement