
ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షాలతో పాటు హిమపాతం కారణంగా 39 మంది మృతి చెందారు. మరో 30 మందికి పైగా జనం గాయపడ్డారు. ఈ వివరాలను ఖామా ప్రెస్ వెల్లడించింది.
విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జనన్ సయెక్ మాట్లాడుతూ హిమపాతం కారణంగా వేలాది పశువులు కూడా మృతి చెందాయన్నారు. హిమపాతం, వర్షం కారణంగా 637 నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. 14 వేల పశువులు చనిపోయాయని తెలిపారు. కాగా నాలుగు రోజులుగా కురుస్తున్న హిమపాతం, మంచు తుఫాను తర్వాత సోమవారం సలాంగ్ హైవేను తెరిచారు.
సార్ ఎ పుల్ నివాసి అబ్దుల్ ఖాదిర్ మాట్లాడుతూ భారీవర్షాలు, కురుస్తున్న హిమపాతం తమను ఆందోళనకు గురిచేస్తున్నదని అన్నారు. మంచు కారణంగా భారీ సంఖ్యలో పశువులు మృతి చెందుతున్నాయన్నారు. పలు రోడ్లు బ్లాక్ అయ్యాయని, ప్రభుత్వం అత్యవసర సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. కాగా పశువుల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బాల్ఖ్, జాజ్జాన్, బద్గీస్, ఫర్యాబ్,హెరాత్ ప్రావిన్సులలో పశువుల యజమానులకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment