కావల్సిన వారికే... కాపులోన్లు
కావల్సిన వారికే... కాపులోన్లు
Published Fri, Jun 16 2017 11:28 PM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM
- పార్టీ కార్యాలయంలో లబ్ధిదారుల ఎంపిక
- - ఉత్సవ విగ్రహాలుగా అధికారులు
- అన్ని లోన్లు పార్టీ కార్యకర్తలకే
- అర్హులకు మొండిచేయి
- ప్రధాన అర్హతగా దేశం సభ్యత్వం!
- పిఠాపురంలో కాపులోన్ల మాయాజాలం
పిఠాపురం: కాపులకు రుణాలు ... ఇందుకు కాపు కులంలో పుట్టిన నిరుపేదలందరూ అర్హులే అనుకుంటే పొరపాటే. పిఠాపురం మున్సిపాల్టీలో మాత్రం కాపు కులానికి చెందిన వారైతే చాలదు. తెలుగు దేశం పార్టీ నాయకుడో, కార్యకర్తో, లేక ఎమ్మెల్యే అనుచరుడో అయి ఉంటేనే కాపు లోను తన కాళ్ల దగ్గరకు పరుగులు తీస్తూ వచ్చేస్తుంది. అధికారులకు దరఖాస్తు చేసుకున్నా ఆ దరఖాస్తులు కాపు కార్పొరేషన్‌కు ఆన్‌లైన్లో పంపించేది ... ఎంపిక చేసేది మాత్రం ‘దేశం’ నేతలే అన్నది ఇక్కడ బహిరంగ రహస్యం. ఏదైనా ఒక ప్రభుత్వ పథకంలో లబ్థిదారుల ఎంపిక జరగాలంటే వివిధ స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణలు జరిపి ప్రభుత్వ కార్యాలయంలో అర్హుల జాబితా తయారు చేస్తుంటారు. కానీ పిఠాపురం మున్సిపాలిటీలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఇలాగే అధికారులతో సంబంధం లేకుండా జన్మభూమి కమిటీలు దేశం నేతలు కలిపి భర్తలున్న వారికే వితంతు పింఛన్లు మంజూరు చేయించగా ‘సాక్షి’ దినపత్రిక ఆ గుట్టును బట్టబయలు చేయడంతో అధికారుల విచారణ అనంతరం వాటిని రద్దు చేశారు. అయినప్పటికీ ఇక్కడ పద్ధతిలో మాత్రం మార్పు రాలేదంటున్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేస్తున్న కాపు రుణాల మంజూరులో నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కేస్తున్నారు. పచ్చచొక్కా వేసుకుంటేనే నిజమైన లబ్ధిదారుడిగాను, లేకుంటే ఎంత నిరుపేదవాడైనా సరే అనర్హుడిగా పరిగణిస్తున్నట్లు ప్రస్తుతం మంజూరైన లోన్ల నడత స్పష్టం చేస్తోంది. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఈ ఏడాది కాపులోన్ల లక్ష్యం 105 కాగా ఇప్పటి వరకు సుమారు 500 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటి వరకు 27 మందికి రుణాలు మంజూరయ్యాయి. వీరిలో అధిక శాతం మంది తెలుగు దేశం పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం.
దేశం నేతలకే కాపులోన్లు...
పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో 24వ వార్డులో 15 మంది అర్హులైన లబ్ధిదారులు బ్యాంకు అంగీకారంతో సహా కాపులోన్లకూ దరఖాస్తులు పెట్టుకున్నారు. కానీ వారందరినీ పక్కన పెట్టి కేవలం ఆ వార్డు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, పాదగయ ట్రస్టు బోర్డు సభ్యుడైన ఓగేటి మురళీధర్‌కు మాత్రమే కాపులోను మంజూరయింది. ఇలా అన్ని వార్డుల్లోను ఆయా వార్డుల పార్టీ అధ్యక్షులు, తెలుగు యువత నాయకులు ఎమ్మెల్యే అనుచరులకు మాత్రమే రుణాలు మంజూరు చేస్తున్నారన్న ఆరోపణలు వినినిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా అన్ని అర్హతలుండీ దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఒక్క రుణం కూడా మంజూరుకాకపోవడం విశేషం.
పార్టీ కార్యాలయంలోనే ఎంపిక...!
అర్హులైన లబ్ధిదారులు బ్యాంకు అనుమతితో మున్సిపల్ అధికారులు దరఖాస్తులు చేసుకుంటుండగా వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో తెలుగు యువత నాయకుడు ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక పక్రియంతా స్థానిక తెలుగదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతున్నట్లు దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలో జరగాల్సిన ఎంపిక పక్రియ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుల కనుసన్నల్లో జరుగుతుండడంతో కేవలం పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే అనుచరులకు మాత్రమే రుణాలు మంజూరవుతున్నాయి.
మా దరఖాస్తులు ఏమయ్యాయో తెలియడం లేదు
నేను కూలిపని చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నా. దుకాణం పెట్టుకుని వ్యాపారం చేసుకుందామని కాపులోన్ కోసం దరఖాస్తు చేసుకున్నా. బ్యాంకు విల్లింగ్ సైతం ఇచ్చారు. అయినా ఏడాదవుతున్నా లోన్ రాలేదు. నాకంటే వెనుక పెట్టుకున్న తెలుగుదేశం వారికి మాత్రం లోన్లు ఇచ్చేస్తున్నారు. - కె. అచ్చియ్య, లబ్దిదారుడు, పిఠాపురం
అధికారులు పట్టించుకోవడం లేదు
పొట్టపోసుకోడానికి ప్రభుత్వం ఇచ్చే రుణం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాం. అధికారలెవరూ పట్టించుకోవడం లేదు. అసలు వారి ప్రమేయం ఏమీ లేనట్టు మాట్లుడుతున్నారు. మా దరఖాస్తులు ఏమయ్యాయో కూడా తెలియడం లేదు.
ఆకుల దొరబాబు, లబ్ధిదారుడు, పిఠాపురం
అర్హులైన కాపులకు అందడం లేదు
నిరుపేదలైన కాపులకు అన్యాయం జరుగుతోంది. ఏ ఆధారం లేకుండా అణగారిపోతున్న కాపుల కోసం కాపు నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేసి నిరుపేదలకు అండగా నిలుస్తుంటే క్షేత్రస్థాయిలో తెలుగుదేశం నేతల అక్రమాలు ఎక్కువయిపోతున్నాయి. పిఠాపురంలో కేవలం తెలుగుదేశం నేతలకే రుణాలు మంజూరవుతున్నాయి. అర్హులందరూ రుణాలు రాక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు.
బాలిపల్లి రాంబాబు, కాపుఐక్య వేదిక నాయకుడు. పిఠాపురం
Advertisement
Advertisement