కాపు రుణాల్లో అవినీతి కాక | AVINEETHI ON KAPU LOAN SANCTIONS | Sakshi
Sakshi News home page

కాపు రుణాల్లో అవినీతి కాక

Published Fri, Jun 2 2017 2:04 AM | Last Updated on Tue, Sep 5 2017 12:34 PM

AVINEETHI ON KAPU LOAN SANCTIONS

ఏలూరు (మెట్రో) : మాకు అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయి.. మేం నిరుపేద కుటుంబానికి చెందిన వారం.. మా అర్హతలన్నీ పరిశీలించి రుణాలు ఇస్తే పలానా వ్యాపారం చేసుకుని జీవిస్తాం.. అని న్యాయంగా అధికారులను వేడుకున్నవారికి నిరాశే ఎదురవుతోంది. అదే అయినవాళ్లయితే.. ధ్రువీకరణ పత్రాలు, నిబంధనలతో పనిలేదు. కనీసం ఆ కులం కాకపోయినా తప్పుడు ధ్రువీకరణతో రుణాలిచ్చేస్తారు. జిల్లాలో కాపు రుణాలను కొందరు అధికారులు, బ్యాంకర్లు ఆ కులస్తులు కాకపోయినా ఇచ్చేసి 
తమ ఘనతను చాటుకున్నారు. 
 
సామాన్య వ్యక్తికి ఏదైనా రుణం కావాలంటే.. ఈ గ్యారంటీ తీసుకురా.. ఆస్తులేమైనా ఉన్నాయా.. నీకు రుణం ఇస్తే ఎలా కడతావు.. అంటూ అధికారులు, బ్యాంకర్లు సవాలక్ష ప్రశ్నలు వేస్తారు. కానీ అధికారులు తలచుకుంటే మాత్రం ఇవేమీ లేకుండా కూడా రుణాలు ఇచ్చేస్తారు. ఆ కులానికి సంబంధించిన వారు కాకున్నా అదే కులానికి చెందిన వారని ధ్రువీకరణ పత్రాలు ఇస్తే సరిపోతుంది. ఇక తతంగం అంతా అధికారులే నడిపేస్తారు. జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్, మండల పరిధిలో 22 మందికి, చింతలపూడి మండలంలో 3, దేవరపల్లిలో 1, రుణాలను కాపులు కాకపోయినా నకిలీ కాపు ధ్రువీకరణ పత్రాలతో ఇచ్చేశారు.
 
లేని వ్యక్తులకూ రుణాలు
కాపు నకిలీ ధ్రువీకరణ పత్రాలతోనే కాకుండా అసలు వ్యక్తులే లేకుండా టి.నరసాపురం మండలంలో 5, తణుకు మండలంలో ఒకరికి రుణాలను అందించారు. ఈ ఉదంతాలపై విచారణ చేసేం దుకు అభ్యర్థులు ఇచ్చిన చిరునామాలకు వెళితే అసలు ఆ అభ్యర్థులే లేరనే సమాధానంతో కాపు కార్పొరేషన్‌ అధికారులు కంగుతిన్నారు. ఇలా 33 మందికి లక్ష, లక్షన్నర చొప్పున రుణాలు పొంది అరకోటి పైబడి రుణాలను కాజేశారు. 
 
రెవెన్యూ అధికారుల హస్తం
కాపులు కాకున్నా వారికి కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన రెవెన్యూ అధికారులు రుణాలకు సిఫార్సు చేశారు. ఈ కుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించని అధి కారులు కాపు కార్పొరేషన్‌లో రుణాలు మంజూరు చేసేశారు. ఇంకేముందుకు కాస్త బ్యాంకు మేనేజర్లను మేనేజ్‌ చేసుకుని యథేచ్ఛగా రుణాలు పొందారు. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీని దర్జాగా దోచుకున్నారు. 
 
బిగుస్తున్న ఉచ్చు
జిల్లాలో కాపులు కాకుండానే కాపులుగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన వారి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ముందుగా సంబంధిత రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకునేందుకు కలెక్టర్‌ భాస్కర్‌ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా నకిలీ ధ్రువీకరణ పత్రాలు అందించి రుణాలు పొందిన వారిపైనా క్రిమినల్‌ చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. 
ఈ రుణాల మంజూరులో భాగస్వాములుగా ఉన్న ప్రతి ఒక్కరిపైనా చర్యలు ఉంటాయని తెలుస్తోంది. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేసి ఇప్పటికే విచారణ నివేదికను కలెక్టర్‌ ఆదేశాల మేరకు బీసీ కార్పొరేషన్‌ అధికారులు సిద్ధం చేసినట్టు సమాచారం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement