మగ్గిపోతున్న నేతన్న
మగ్గిపోతున్న నేతన్న
Published Tue, Nov 1 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM
కూడు, గూడు, గుడ్డ.. ఇవే మనిషి మనుగడకు అవసరమైనవి. డిజిటల్ యుగంలో మానవుడు ఎంతగా దూసుకుపోతున్నా.. ఇవి లేకుండా ఒక్క అడుగు ముందుకు వేయలేడన్నది జగమెరిగిన సత్యం. అంతటి ప్రాధాన్యమున్న ఆయా రంగాలపై పాలకులు తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపుతున్నారు. చేనేత సహకార సంఘాల ఆర్థిక పరిస్థితులు చితికిపోతున్న తరుణంలో.. మగ్గాన్ని నమ్ముకున్న నేతన్నతో పాటు అతడికి కూడు పెట్టే చేనేత సొసైటీలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. – సఖినేటిపల్లి
చేనేత కార్మికుల అభ్యున్నతికి కోసం ఏర్పాౖటెన చేనేత సహకార సంఘాలు కష్టాల్లో ఉన్నాయి. సంఘాల్లో దుస్తుల నిల్వలు పేరుకు పోవడంతో కార్మికులకు పని కల్పించలేని స్థితికి సంఘాలు చేరుకున్నాయి. సంఘాల్లో తయారైన దుస్తులను కొనుగోలు చేయాల్సిన ఆప్కో తీవ్ర జాప్యాన్ని ప్రదర్శిస్తోంది.
సంఘాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంతో పాటు సంఘాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేది ఆప్కో. తమ సంస్థకు చెందిన దుకాణాల్లో దుస్తుల అమ్మకాలు పూర్తయ్యాకే సొసైటీల్లో పేరుకుపోయిన దుస్తులు కొనుగోలు చేస్తామని ఆప్కో చెబుతోంది. ఈ తరుణంలో సంఘాలు గడ్డు పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఫలితంగా సంఘాలు ఆర్థిక పరిపుష్టిని కోల్పోయి, కార్మికులకు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించలేక పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే మోరి చేనేత సహకార సంఘంలో ఆప్కో కొనుగోళ్లు లేక దుస్తుల నిల్వలు రూ.60 లక్షలకు పేరుకుపోయాయి.
రూ.10 కోట్ల విలువైన నిల్వలు
జిల్లావ్యాప్తంగా 50 చేనేత సంఘాల్లో రూ.10 కోట్ల విలువైన దుస్తులు పేరుకుపోయినట్టు సంఘ ప్రతినిధులు చెప్పారు. ఆయా సంఘాల్లో ఉత్పత్తి అవుతున్న దుస్తుల్లో మూడో వంతైనా ఆప్కో కొనుగోలు చేస్తే కార్మికులకు పని కల్పించడానికి వీలవుతుందని అంటున్నారు.
పది సంఘాలకే రిబేటు!
సుమారు రెండేళ్ల క్రితం ఇచ్చిన సొసైటీల్లోని దుస్తుల నిల్వల జాబితా ఆధారంగా జిల్లాలో కేవలం పది సంఘాలకే రిబేటు సౌకర్యాన్ని ప్రస్తుత ప్రభుత్వం కల్పించింది. ఇందులో అప్పట్లోనే రూ.48 లక్షలు నిల్వలున్నట్టుగా ఇచ్చిన నివేదిక ఆధారంగా మోరి సొసైటీకి రిబేటు తాత్కాలికంగా ఇచ్చారు.
శాశ్వత రిబేటుకోసం నిరీక్షణ
శాశ్వత ప్రాతిపదికన రిబేటు సౌకర్యం ప్రకటించాలని సొసైటీ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల దుస్తుల అమ్మకాలు ఏడాది పొడవునా సాగించేందుకు వీలవుతుందని చెబుతున్నారు. సక్రమంగా లేని రిబేటు సౌకర్యం వల్ల అమ్మకాలు పెరగడం లేదని, వస్త్ర ప్రపంచంలో పోటీతత్వం తట్టుకోవడానికి వీలుగా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు.
నిబంధనలు లేని రిబేటు ఇవ్వాలి
ఏడాది పొడవునా షరతులు, నిబంధనలు లేని రిబేటు సౌకర్యం సంఘాలకు కల్పించాలి. 20 శాతం రిబేటు సౌకర్యాన్ని శాశ్వతంగా కొనసాగించమని కోరాం. రాష్ట్రవ్యాప్తంగా ఇందుకు రూ.150 కోట్లు భరించడం కష్టమని, దీనిని రూ.50 కోట్లకు పరిమితం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రెండేళ్ల క్రితం రూ.40 కోట్ల మేర రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన దుస్తుల నిల్వ లకు తగ్గట్టుగా ఆయా సంఘాలకు ఇప్పుడు రిబేటు అమలవుతోంది. చెన్నైలో లాగే నేత కార్మికులకు మగ్గం వద్ద సబ్సిడీపై విద్యుత్ సరఫరా ఇవ్వాలని కోరుతున్నాం.
– చింతా వీరభద్రేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు, జిల్లా చేనేత సంఘాల సమాఖ్య, మోరి
Advertisement
Advertisement