కులవ్యవస్థను నిర్మూలించాలి
కులవ్యవస్థను నిర్మూలించాలి
Published Wed, Sep 28 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : కుల వ్యవస్థను సమూలంగా నిర్మూలించడంలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ పిలుపు ఇచ్చారు. నన్నయ యూనివర్సిటీలో బుధవారం జాతీయ దళిత సదస్సును ఆయన ప్రారంభించారు. దళితుల సంక్షేమం కోసం 30 ఏళ్లు పోరాడినా, విదేశాలలో సన్మానాలు పొందినా, నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కి చైర్మన్ పదవి లభించినా ఏదో వెలితిగానే ఉందన్నారు. కుల వ్యవస్థను పోగొట్టలేకపోయానే వెలితి తనను వేధిస్తోందన్నారు. అమెరికాలో కంప్యూటర్లు ‘పాస్‌వర్డ్’ అడుగుతుంటే మన దేశంలో మాత్రం ‘కులం’ అడుగుతున్నాయన్నారు. అంబేడ్కర్ పుట్టి ఉండకపోతే దళితులకు రిజర్వేషన్లు దక్కేవి కావన్నారు. మహనీయులు గుర్రం జాషువా, భగత్‌సింగ్ పుట్టిన రోజున ఈ సదస్సు నిర్వహించడం హర్షణీయమని వర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. కవులు మాత్రమే ఎల్లకాలం ప్రజల నాల్కలపై నిలిచి ఉంటారంటూ.. జాషువా, అంబేడ్కర్ రచనలను ప్రస్తావించారు. దేశంలో ఇప్పటికీ దళితులు వివక్షకు గురవుతూనే ఉన్నారని సదస్సు కో–కన్వీనర్, వర్సిటీ తెలుగు అధ్యాపకుడు డాక్టర్ టి.సత్యనారాయణ, ఎస్సీ, ఎస్టీ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ కల్యాణి అన్నారు.
13 తీర్మానాలు ఆమోదం
కన్వీనర్ డాక్టర్ ఎలీషాబాబు ప్రవేశపెట్టిన 13 తీర్మానాలను సదస్సులో ఏకగ్రీవంగా ఆమోదించారు. ‘కుల రహిత సమాజగా తీర్చిదిద్దాలని, ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుత జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని, యూనివర్సిటీలో దళిత కవులు కుసుమ ధర్మన్న, బోయి భీమన్నల సాహిత్య పీఠాలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. లైబ్రరీకి అంబేడ్కర్, బాలికల వసతి గృహానికి సావిత్రీబాయి ఫూలే పేర్లు పెట్టాలని, యూనివర్సిటీకి 12–బి హోదాను ఇవ్వాలని, వర్సిటీలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానాలు ఆమోదించారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎ.నరసింహరావు, ఈసీ మెంబర్ డాక్టర్ సువర్ణకుమార్, ప్రిన్సిపాల్స్ డాక్టర్ పి.సురేష్‌వర్మ, డాక్టర్ కేఎస్ రమేష్, డాక్టర్ కె. సుబ్బారావు, డాక్టర్ ఎ.మట్టారెడ్డి, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ జీవీ రత్నం, డాక్టర్ వి.కిషోర్, కో కన్వీనర్లు డాక్టర్ జానకిరావు, డాక్టర్ పి.వెంకటేశ్వర్లు, డాక్టర్ ఆర్‌వీఎస్ దొర, డాక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తీరు మారకుంటే కఠిన చర్యలు
కోటగుమ్మం : ఎస్సీ, ఎస్టీల విషయంలో రెవెన్యూ శాఖ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ వ్యాఖ్యానించారు. రాజానగరం సమీపంలోని ఆదికవి నన్నయ్య విశ్వ విద్యాలయంలో సమీక్షా సమావేశానికి హాజరయ్యేందుకు జిల్లాకు వచ్చిన ఆయన రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 13 జిల్లాల్లో పర్యటించడంతో పాటు 70 శాతం విశ్వ విద్యాలయాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. సమస్యలు పరిష్కరించాలంటూ దళిత, గిరిజనుల నుంచి వినతులు అందుతున్నాయని, వాటిని సంబంధిత శాఖలకు బదలాయించి 15 రోజుల్లో పరిష్కారమయ్యేలా ఆదేశాలు జారీ చేసినట్టు వివరించారు. ఇప్పటి వరకూ 3 వేల వినతులు వచ్చినట్టు తెలిపారు. దళిత, గిరిజనుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే ఎవరికైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు 24 గంటల్లో కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలన్నారు.
Advertisement
Advertisement