నగదు కట్‌కట...
బ్యాంకుల్లో నోట్ల కొరత
కొన్ని బ్యాంకుల్లో విత్‌డ్రాపై పరిమితులు
సామాన్యులకు తీరని వేదన
పెద్దనోట్లు రద్దు చేసి 20 రోజులైనా
తీరని వెతలు
నోట్ల కోసం ఎన్నాళ్లో ఈ పాట్లు?
ఇల్లు కట్టుకుంటున్నాను. సిమెంట్, ఐరన్ కొనుగోళ్లకు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాను. మేస్రీ్తలకు కూలీలు ఇవ్వాలి.’ ‘బ్యాంకులో నగదు లేదు. ఆర్బీఐ నుంచి రావాల్సి ఉంది. రాగానే ఇస్తాం’.. ఇది సోమవారం ఓ బ్యాంకు అధికారికి, ఆ బ్యాంకు ఖాతాదారునికి మధ్య జరిగిన సంభాషణ.
‘సర్ నాకు గుండె జబ్బు ఉంది. ఇన్ని మెట్లు ఎక్కి క్యూలో నిలబడలేకపోతున్నాను. రూ. 24 వేలు ఒకేసారి ఇప్పించండి.’ ‘నగదు కొరత ఉంది. అందరికీ సర్దుబాటు చేయడం కోసం రూ.3 వేలు మాత్రమే ఇస్తున్నాం’ ఇదీ ఎస్.బి.ఐ. అధికారికి, ఓ ఖాతాదారునికి మధ్య సంభాషణ.
సాక్షి, రాజమహేంద్రవరం : నల్లధనం, నకిలీ కరెన్సీ, అవినీతిని నిర్మూలించడానికంటూ పెద్దనోట్లు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం అందుకు ప్రత్యామ్నాయంగా ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో గత 20 రోజులుగా జిల్లా ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. మూడు నాలుగు రోజుల్లో అంతా సర్దుకుంటుందని ప్రభుత్వం అంచనా వేసినా నగదు కొరత కారణంగా సమస్య రోజు,రోజుకు బిగుసుకుంటూ ప్రజలను మరింత ఇబ్బందులపాలు చేస్తోంది. నగదు తీసుకోవడానికి పరిమితులు విధించినా..ఆ మేరకు కూడా నగదు ఇవ్వలేక బ్యాంకులు చేతులెత్తాశాయి. ’నగదు లేదు’ అనే బోర్డులు పెట్టి బ్యాంకు సిబ్బంది డుమ్మా కొట్టడంతో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్యాంకుల్లో నిండుకున్న నగదు...
తమకు రూ.600 కోట్లు కావాలని జిల్లాలోని బ్యాంకులు ఆర్బీఐకు పది రోజుల కిందటే ఇండెంట్ పెట్టాయి. అయితే ఇప్పటి వరకు ఆ నగదు రాలేదు. ఆయా బ్యాంకులు రాష్ట్రంలోని ఇతర బ్రాంచీల నుంచి నగదు తెచ్చుకుని ప్రజలకు సర్దుబాటు చేస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నగదు కొరత లేదని రీజనల్ మేనేజర్ ప్రకటించిన రెండు రోజులకే ఆయా బ్యాంకుల్లో నగదు ఖాళీ అయింది. ప్రస్తుతం ఆంధ్రా బ్యాంకుకు చెందిన పలు బ్రాంచీల్లో నగదులేని కారణంగా డిపాజిట్లు మాత్రమే స్వీకరిస్తున్నారు. రాజమహేంద్రవరంలోని ఆర్యాపురం ఆంధ్రాబ్యాంకు బ్రాంచిలో నగదు నిడుకోవడంతో చెల్లింపులు నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. కంబాలచెరువులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీలో నగదు కొరత కారణంగా గరిష్టంగా రోజుకు రూ.మూడువేలు మాత్రమే ఇస్తున్నారు. జిల్లాలోని ఆయా బ్యాంకుల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
ఏటీఎంల ముందు బారులు....
వరుసగా రెండు రోజులు సెలవుల కారణంగా బ్యాంకులు పనిచేయలేదు. అరకొర నగదు ఉన్నా ఏటీఎంలు అన్నీ ఖాళీ అవడంతో సోమవారం ప్రజలు ఏటీఎంల ముందు బారులు తీరారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏటీఎంల వద్ద రద్దీ ఏమాత్రం తగ్గలేదు. జిల్లాలో పలు బ్యాంకులకు చెందిన 811 ఏటీఎంలు ఉండగా నగదు కొరత కారణంగా వాటిలో 30 శాతం మాత్రమే పనిచేస్తున్నాయి. నగదు ఉన్న ఏటీఎంలలో ప్రధాన కూడళ్లలోని ఏటీఎంలలోనే రూ. 100 నోట్లు పెడుతున్నారు. మిగిలిన వాటిలో రూ.2000 నోట్లు వస్తున్నాయి. ఉదహరణకు రాజమహేంద్రవరంలో ఎస్బీఐ డివిజన్ పరిధిలో 80 ఏటీఎంలు ఉండగా ప్రధానమైన 4 ఏటీఎంలలోనే రూ.100 నోట్లు అందుబాటులో ఉంచుతున్నారు.
రూ. రెండువేల నోటుకు నో..
చిల్లర కొరత కారణంగా ప్రజలు రూ. రెండు వేల నోటును తీసుకోవడానికి ఇష్టపడడంలేదు. ఏటీఎంలలో గరీష్టంగా రోజుకు రూ.2500 తీసుకునే వెలుసుబాటు ఉంది. ఒకేసారి తీసుకుంటే రూ.రెండువేల నోటు, ఐదు రూ.100 నోట్లు వస్తున్నాయి. దీంతో ప్రజలు రెండుసార్లు రూ.1900, రూ.600 లెక్కన అన్నీ వందనోట్లు తీసుకోవడానికే ఇష్టపడుతున్నారు. ఇలా చేయడంతో ఏటీఎంలలో నింపుతున్న రూ.100 నోట్లు రెండు గంటలకే ఖాళీ అవుతున్నాయి.