నిను వీడని.. నీడను నేను
నిను వీడని.. నీడను నేను
Published Tue, Apr 11 2017 11:33 PM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM
- ఐదు నెలలైనా... నగదు కష్టాలే
- ఖాతాలన్నీ ఖాళీ నిండుకున్న నిల్వలు
- వీడని... కరెన్సీ కష్టాలు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ఎవరికైనా పైసాయే పరమాత్మ. పైసాలేందే ఒక్క అడుగు ముందుకు పడదు. నెలంతా కష్టపడ్డ ఉద్యోగులు జీతాల కోసం బ్యాంకులకు వెళితే డబ్బు లేదంటున్నారు. ఏటీఎంలకు వెళుతుంటే నగదు లేదనే బోర్డులు వేలాడుతున్నాయి. కిరాణా తెచ్చుకుందామంటే చేతిలో సొమ్ముల్లేవు. పిల్లలకు స్కూల్, కళాశాల ఫీజులు కట్టాలని యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. అలా అని బ్యాంక్ ఖాతాల్లో నిల్వలున్నా చేతికి మాత్రం చిల్లిగవ్వ రావడం లేదు. పెద్దనోట్ల రద్దయి ఐదు నెలలు గడిచినా దాని ప్రభావం మాత్రం ఇంకా జిల్లాను వెంటాడుతూనే ఉంది. ఏటీఎంలలో రెండు, మూడు లక్షలు ఇలా పెడుతుంటే అలా క్షణాల్లో అయిపోతున్నాయి. క్యూలైన్ క్యూలైన్‌లానే ఉంటున్నాయి. జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ వర్గాన్ని కదిపినా కరెన్సీ కష్టాలే చెప్పుకొస్తున్నాయి. పెళ్లిళ్ల ముహూర్తాలు మొదలవడంతో వారి బాధలు వర్ణణాతీతం.
మార్చి తరువాత కూడా మారని పరిస్థితి...
పెద్ద నోట్ల రద్దుతో మొదలైన కరెన్సీ కష్టాలు మార్చి నెల తరువాత అంతా సర్థుకుంటాయని ప్రజలు భావించారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా భరోసా కల్పించేలా ప్రకటనలు చేసింది. ప్రజలు కూడా అందుకు తగ్గట్టుగా మానసికంగా సిద్ధపడ్డారు. కానీ ఏప్రిల్ మొదలై రెండో వారంలో అడుగుపెట్టేసినా పైసల కోసం జనం పడరాని పాట్లు పడుతున్నారు.
జిల్లావ్యాప్తంగా ఏటీఎం అంటే ‘ఎనీ టైమ్ మూత’గా తయారైంది. ప్రజలు బ్యాంకులకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడి సొమ్ములు డ్రా చేసుకునే రోజులు ఎప్పుడో మరిచిపోయారు. కరెన్సీ కోసం పూర్తిగా ఏటీఎంలకు అలవాటుపడ్డారు. ఇప్పుడు ఆ ఏటీఎంలలో సొమ్ములు ఉండటం లేదు. అలా అని బ్యాంకులకు వెళితే గంటల తరబడి క్యూలో నిలబడ్డ తరువాత తీరిగ్గా సొమ్ముల్లేవని తిప్పి పంపేస్తున్నారు. లేదంటే ఐదు వేలకు రెండు వేలు, వెయ్యి చేతిలో పెడుతున్నారు. చేసేది లేక ఇచ్చినంతా పుచ్చుకోవాల్సి వస్తోందని ప్రజలు లబోదిబోమంటున్నారు. నగదు నిల్వలు నిండుకోవడంతో చేయగలిగేదేమీ లేదని దాదాపు బ్యాంకులన్నీ చేతులెత్తేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌బ్యాంకుల బ్రాంచీలుæ 757 వరకూ ఉన్నాయి. ఈ బ్రాంచీల ద్వారా గతంలో జిల్లాలో ప్రతి రోజు రూ.250 కోట్లు లావాదేవీలు జరుతుండేవి. ప్రస్తుతం నగదు కొరత ఏర్పడ్డ తరువాత కేవలం రూ.80 లేదా రూ.90 కోట్లు మించి లావాదేవీలు జరగడం లేదు.
అరకొర నగదుతో ఏటీఎంలు...
బ్యాంకు బ్రాంచీలకు అనుబంధంగా జిల్లా వ్యాప్తంగా 811 ఏటీఎం సెంటర్లున్నాయి. ఒక్క ఏటీఎం మెషిన్‌లో ఒకప్పుడు నగదు కొరత అనేదే ఉండేది కాదు. అప్పట్లో ఒక్కో ఏటీఎంలో రోజుకు రూ.15 నుంచి రూ.20 లక్షలు నగదు పెట్టేవారు. అటువంటిది పెద్ద నోట్ల రద్దు తరువాత ఏర్పడ్డ నగదు కొరత కారణంగా ప్రస్తుతం రూ.2 లక్షలు నుంచి రూ.4 లక్షలు మాత్రమే పెడుతుండడంతో గంటల్లోనే ఖాళీ అయిపోతున్నాయి. తరువాత మూతేస్తున్నారు. ఉదాహరణకు కాకినాడ మెయిన్ రోడ్డులోని స్టేట్‌బ్యాంక్ మెయిన్ బ్రాంచీలో ప్రతి రోజు కోటి రూపాయల నగదు ఉంచగా ఖాతాదారులు వాటిని సాయంత్రంలోగా ఖాళీ చేసేశారు.
భయంతో విత్ డ్రాలు ...
గత ఏడాది అన్ని బ్యాంకు బ్రాంచీల్లో ఖాతాదారులు సుమారు రూ.4000 కోట్లు జమ చేశారని అంచనా. ప్రారంభంలో నగదు ఉపసంహరణకు పరిమితి విధించడంతో నగదు లావాదేవీలు నియంత్రణలో నడిచాయి. పరిమితి ఎత్తేయడంతో మరోసారి ఈ పరిస్థితి పునరావృతం అవుతుందనే ముందు చూపుతో ప్రజలు ఖాతాల్లో ఉన్న నగదులో మూడొంతులు ఉపసంహరించేసుకుని ఇళ్లల్లో బీరువాల్లో దాచేశారు. ప్రస్తుతం బ్యాంకులలో 20 శాతం నగదు మాత్రమే మిగిలి ఉందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఉపసంహరించిన సొమ్ము తిరిగి బ్యాంకుల్లో వేయడానికి ఖాతాదారులు వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే బ్యాంకుల్లో జమచేసినా తిరిగి తీసుకోవడానికి ఇబ్బందులు తప్పవనే ముందుచూపే కారణమంటున్నారు. ఫలితంగా బ్యాంకుల్లో నగదు నిల్వలు నిండుకున్నాయి. పోనీ రిజర్వు బ్యాంకయినా కరెన్సీ కోటా విడుదలచేసిందా అంటే అదీ లేదు. దీంతో ఖాతాదారులు నానా పాట్లు పడుతున్నారు.
రూ.600 కోట్లు అవసరం...
జిల్లాలో కరెన్సీ కష్టాలు గట్టెక్కాలంటే అత్యవసరంగా రూ.600 కోట్లు కావాలని నెల రోజులుగా ఆర్‌బీఐకు లేఖలపై లేఖలు పంపిస్తూనే ఉన్నారు. కానీ ముక్కుతూ మూలుగుతూ సోమవారం ఆర్‌బీఐ నుంచి రూ.100 కోట్లు జిల్లాకు వచ్చాయి. ఈ సొమ్ముల్లో ఎస్‌బీఐకు రూ.40 కోట్లు బదలాయించగా, మిగిలిన రూ.60 కోట్లు లీడ్ ఆంధ్రా బ్యాంక్‌కు జమ య్యాయి. ఆ రూ.80 కోట్లు ఏ మూలకొస్తాయని బ్యాంకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కరెన్సీ కష్టాలు తీరాలంటే కనీసం వెయ్యి కోట్లు విడుదల చేయాలంటున్నారు.
నగదు రహితం ఎక్కడా...
నగదు కొరతకు ఆన్‌లైన్ చెల్లింపులపై వ్యాపారవర్గాలు ఆసక్తి చూపకపోవడం కూడా పెద్ద ఇబ్బందికరంగా మారింది. నగదు రహితానికి కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినా నిర్వహణ భారంతో 90 శాతం వ్యాపారులు స్వైపింగ్ మిషన్లు పెట్టుకోలేదు. రాజమహేంద్రవరం మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్‌లో 1500 దుకాణాలుంటే పట్టుమని 10 స్వైపింగ్ మెషిన్లు కూడా లేకపోవడం జిల్లాలో వాస్తవ పరిస్థితికి అద్దంపడుతోంది. ఈ కరెన్సీ ఇబ్బందుల నుంచి ప్రజలు గట్టెక్కాలంటే వెయ్యి కోట్లు అత్యవసరంగా విడుదల చేయాలి తప్ప మరో మార్గం లేదంటున్నారు.
డబ్బు కావాలని ప్రతిపాదనలు పంపించాం.
ప్రజలు తమ నగదును బ్యాంకు నుంచి డ్రా చేసిన తరువాత వాటిని తిరిగి బ్యాంకు ద్వారా లావాదేవీలు నిర్వహించడం లేదు. గడచిన నెల రోజులు నుంచి జిల్లాకు ఆర్‌బీఐ నుంచి ఆశించిన స్థాయిలో సొమ్ము రాలేదు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్మును ఖాతాదారులు మొత్తం డ్రా చేసేశారు. బ్యాంక్ ఖాతాలో ఉంటే సొమ్ము తీసుకోలేమనే భయంతో ఆ పని చేశారు. కానీ తీసుకున్న సొమ్ము చలామణీలోకి వస్తేనే నగదు లావాదేవీలకు ఇబ్బందులుండవు. ఈ నెల 10న జిల్లాకు రూ.100 కోట్లు రాగా స్టేట్‌బ్యాంక్‌కు రూ.40 కోట్లు, ఆంధ్రాబ్యాంక్‌కు రూ.60 కోట్లు విడుదల చేశాం. రిజర్వ్‌బ్యాంక్‌కు నగదు కోసం ప్రతిపాదనలు పంపించాం.త్వరలో వస్తాయని ఎదురుచూస్తున్నాం.
Advertisement
Advertisement