మనిశ్శాంతి లేకుండా
మనిశ్శాంతి లేకుండా
Published Wed, Dec 14 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM
తెలవారకుండానే పరుగులు... ఎంతసేపైనా బారులు... ఎన్ని పనులున్నా అక్కడే పడిగాపులు ... రోజులు దాటుతున్నా అగచాట్లు తప్పడం లేదు. కొన్నాళ్లే ఈ కష్టం అనుకున్నవారంతా ఎన్నాళ్లీ ఇక్కట్లని ప్రశ్నిస్తున్నారు. సహనం సన్నగిల్లి నిరసనలు, ధర్నాలు, నిలదీతలకు దిగుతున్నారు.
సహనం కోల్పోతున్న ఖాతాదారులు
నిరసన ధ్వనులు
ధర్నాలకు శ్రీకారం
సిబ్బందిని నిలదీస్తున్న ఖాతాదారులు
బ్యాంకుల వద్ద నో క్యాష్ బోర్డులు
సాక్షి, రాజమహేంద్రవరం : ఆర్బీఐ నుంచి నగదు రాకపోవడంతో జిల్లాలోని పలు బ్యాంకుల్లో నగదు నిల్వలు నిండుకొని ’నో క్యాష్’ అని బోర్డులు పెట్టడంతో బుధవారం కూడా ప్రజలకు ఇబ్బందులు షరా మామూలుగానే కొనసాగుతున్నాయి. తమ ఖాతాల్లో నగదు ఉన్నా అవసరానికి తీసుకునే అవకాశం లేకపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. బ్యాంకు సిబ్బందితో ఘర్షణలకు దిగుతున్నారు. బ్యాంకులు, రోడ్డుపై బైఠాయించి ధర్నాలు చేస్తున్నారు. మూడు రోజుల వరుస సెలవులు అనంతరం మంగళవారం తెరుచుకున్న బ్యాంకులు తమ వద్ద ఉన్న అరకొర నగదును ఖాతాదారులకు సర్దాయి. ఉన్న కాస్త నగదు అయిపోవడంతో నగదు లేదంటూ బోర్డులు పెడుతున్నాయి.
∙అనపర్తి నియోజకవర్గం పందలపాక, మహేంద్రవాడ ఎస్బీఐ బ్యాంకుల వద్ద ఉదయం 10 గంటలకే సిబ్బంది బ్యాంకు గేటుకు ’నో క్యాష్’ అనే బోర్డు పెట్టడంతో ఖాతాదారులు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. అప్పటి వరకు క్యూలైన్లో గంటల తరబడి నిలుచున్న వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ‘నగదు లేకపోతే బ్యాంకులు ఎందుకంటూ’ సిబ్బందిని నిలదీశారు.
∙మహేంద్రవాడ బ్యాంకు వద్ద తమకు నగదు ఇవ్వాల ని నినాదాలు చేస్తూ ఖాతాదారులు ధర్నాకు దిగారు. న గదు లేకపోతే బ్యాంకు తెరవడం ఎందుకంటూ నిలదీశారు. చివరికి బ్యాంకు అధికారులు సర్దిచెప్పడంతో వారిని బ్యాంకులోనికి వెళ్లనిచ్చారు. బిక్కబోలు ఆంధ్రాబ్యాంకు పింఛన్ దారులు, ఖాతాదారులు తమకు నగదు ఇవ్వాలని ఒక్కసారిగా మేనేజర్ క్యాబిన్లోకి దూసుకెళ్లడంతో కంప్యూటర్ వైర్లు విడిపోయి బ్యాంకులోని అన్ని కంప్యూటర్లు ఆగిపోయాయి. దీంతో బ్యాంకులో నగదు ఉన్నా మధ్యాహ్నం నుంచి నగదు ఇవ్వలేని పరిస్థితి తలెత్తింది. బ్యాంకులు వద్ద రూ. రెండువేల నోట్లు మాత్రమే ఉండడంతో పింఛన్దారులు ఇబ్బందులు పడుతున్నారు.
∙కాకినాడ జన్నాథపురం ఎస్బీఐ బ్యాంకులో ఓ వృద్ధుడు, వృద్ధురాలికి కలిపి రూ. రెండు వేల నోటు ఇచ్చారు. చిల్లర మార్చుకుని దాన్ని ఎలా తీసుకోవాలో తెలియక తలలు పట్టుకున్నారు. మరికొన్ని చోట్ల చిల్లర లేదని, తర్వాత రమ్మని చెప్పడంతో పింఛన్దారులు ఉసూరుమన్నారు.
∙ఏజెన్సీలో పరిస్థితి దారుణంగా ఉంది. దేవీపట్నం మండలంలోని అనేక గ్రామాల్లో ఇప్పటికీ పింఛన్ పంపిణీ ప్రారంభం కాలేదు. మండలంలో ప్రతి నెలా 2,780 మంది లబ్ధిదారులకుగాను రూ.30 లక్షలు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.20 లక్షలు పంపిణీ చేయగా మిగతా రూ.10 లక్షలు రెండు రోజుల్లో అందజేస్తామని ఈవోపీఆర్‌డీ శ్రీనివాస్ తెలిపారు. ఏజన్సీలోని 11 మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మైదాన ప్రాంతాలు మినహా ఏజెన్సీలో లబ్థిదారులకు ఇదివరకటిలాగే చేతికే నగదు ఇస్తున్నారు.
ఏటీఎం వద్ద ఆరుగంటలు
నగదు కొరతతో జిల్లాలోని ఏటీఎంలలో ఐదు శాతంలోపు ఏటీఎంలలో మాత్రమే నగదు లభిస్తోంది. అదీ కూడా నగదు నింపిన కొద్దిసేపటికే ఖాళీ అవుతోంది. నగదు ఎప్పడు పెడతారా? అన్న ఆశతో ప్రజలు ఏటీఎంల ముందు పడిగాపులు కాస్తున్నారు. మహిళలు, పురుషులు, వృద్ధులు ఇలా మూడు లైన్లుగా నిలబడుతున్నారు. తాను ఉదయం తొమ్మిది గంటలకు క్యూలైన్లో నిలబడితే మధ్యాహ్నం 1 గంటకు సగం లైను వరకు వచ్చానని, ఇక నగదు తీసుకునే సరికి మధ్యాహ్నం మూడయ్యే అవకాశం ఉందని రాజమహేంద్రవరం కంబాల చెరువు ఏటీఎం వద్ద నిలబడిన యువకుడు ఎర్రన్నాయడు పేర్కొన్నారు. రోజులో కొంత భాగం సమయం బ్యాంకులు, ఏటీఎంల వద్దనే సరిపోతోందని ప్రజలు వాపోతున్నారు.
Advertisement