
విశాఖ జిల్లాలో ప్రారంభమైన వైఎస్ జగన్ పర్యటన
హైదరాబాద్ : విశాఖ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. గురువారం నుంచి మూడు రోజుల పాటు ఆయన విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖ చేరుకున్న ఆయన అచ్యుతాపురం బయల్దేరి వెళ్లారు.
ఇటీవలి తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 21మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ధవళేశ్వరం మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించి అక్కడ నుంచి నేరుగా తుని చేరుకుంటారు.
సముద్రంలో గల్లంతైన ఏడుగురు పెరుమాళ్లపురం, హుకుంపేట మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపట్నం, రామన్నపాలెంలో ఇద్దరు మత్స్యకారుల కుటుంబాలను ఓదారుస్తారు. ఆరోజుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాకినాడలో బస చేస్తారు.
జూలై 3న కాకినాడలోని పరాడపేట, ఉప్పలంక, పగడాలపేటలో ఏడుగురు మత్స్యకారుల కుటుంబాలను ఓదారుస్తారు. అదేరోజు రంపచోడవరం నియోజకవర్గం వెళ్లి, అక్కడ సూరంపాలెం పెళ్లిబృందం ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు. 4వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లి పొగాకు రైతులతో వైఎస్ జగన్ సమావేశమవుతారు. అదేరోజు హైదరాబాద్కు తిరిగి వస్తారు.