పెట్రోలు బాంబోయ్..!
జిల్లాపై అదనపు భారం.. నిత్యం రూ.40 లక్షలు
కేంద్రం వాతపై రాష్ట్ర సర్కారు ‘వ్యాట్’ కారం
జిల్లాపై పెట్రో ధరల తాజా పెంపు ప్రభావం
పెరగనున్న నిత్యావసరాల ధరలు, రవాణా చార్జీలు
సాక్షి, రాజమహేంద్రవరం : సామాన్యుడిపై పెట్రో బాంబ్ పేలింది. గత నెలలో స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. లీటర్ పెట్రోల్‌రూ.3.38, డీజిల్ రూ.2.67 పెరిగాయి. పెరిగిన ధరలకు అదనంగా రాష్ట ప్రభుత్వం పెట్రోల్‌పై పది పైసలు, డీజిల్‌పై 12 పైసలు వ్యాట్ పెంచింది. ఫలితంగా బుధవారం అర్ధరాత్రి వరకూ రూ.65.17 ఉన్న లీటర్ పెట్రోల్ రూ.68.65కు, రూ.56.33 ఉన్న డీజిల్ రూ.59.12కు పెరిగాయి. జిల్లాలోని 251 పెట్రోల్ బంకుల్లో రోజూ సుమారు ఐదు లక్షల లీటర్ల పెట్రోలు, ఎనిమిది లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. పెరిగిన ధరల కారణంగా వాహనదారులపై రోజుకు సుమారు రూ.40 లక్షల అదనపు భారం పడుతోంది.
మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లు
జిల్లాలో సుమారు 16 లక్షల కుటుంబాలుండగా దాదాపు 80 శాతం కుటుంబాలకు ద్విచక్రవాహనం ఉంది. పేద, మధ్య తరగతి ప్రజలు ఉద్యోగ, వ్యాపారావసరాలకు ద్విచక్రవాహనాలను ఉపయోగిస్తున్నారు. వీరు రోజూ కనీసం లీటర్ చొప్పన పెట్రోల్ వాడుతున్నారు. ఈ లెక్కన ప్రతి ఒక్కరూ నెలకు అదనంగా వంద రూపాయలు భరించాలి. పెరిగిన ధరల ప్రభావం చిన్నా చితకా ప్రైవేటు ఉద్యోగులపై తీవ్రంగా ఉంటోంది. పెరిగే ధరలకు అనుగుణంగా జీతాలు పెరగకపోవడంతో ఇక్కట్లు తప్పవు. జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులు పలువురు పొలాలకు నీరు పెట్టేందుకు డీజిల్ మోటార్లు ఉపయోగిస్తున్నారు. పెరిగిన డీజిల్ ధరల ప్రభావం వారిపై నేరుగా పడనుంది.
వాహనం లేకపోయినా ప్రభావం...
డీజిల్ ధరల పెంపు ప్రభావం అన్ని వర్గాల ప్రజలపై పడుతోంది. పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా లారీల రవాణా చార్జీలు పెరిగి, ఆ మేరకు నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరగనున్నాయి. ఫలితంగా పేదల పరిస్థితి మరింత క్లిష్టం కానుంది. సామాన్యుల రవాణా సాధనమైన ఆటోల చార్జీలూ పెరగనున్నాయి.