వారి దారి.. చెరోదారి
వారి దారి.. చెరోదారి
Published Mon, Aug 7 2017 11:06 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
రచ్చకెక్కిన బీజేపీ రాజకీయం
తీవ్రమైన రెండు వర్గాల పోరు
ఉపరాష్ట్రపతి పదవికి ఎం.వెంకయ్యనాయుడు ఎన్నికైన తరువాత.. రాష్ట్రంలో బీజేపీ ప్రాభవం పెంచుకునేందుకు.. అవసరమైన టీడీపీతో మైత్రి కొనసాగకపోవచ్చన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో, బీజేపీలో రెండు వర్గాల విభేదాలు జిల్లాలో ముదిరిపాకన పడ్డాయి. నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో, ఇంతవరకూ అంతర్గతంగా సాగుతోన్న వర్గాల పోరు ఇప్పుడు రచ్చ ఎక్కింది. టీడీపీతో పొత్తు విషయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందని, నగరపాలక సంస్థ ఎన్నికలలో సొంతంగా పోటీ చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడి ప్రకటన.. ఆయన సొంత అభిప్రాయమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీ సమావేశంలో స్పష్టం చేయడం.. టీడీపీతో పొత్తు విషయంపైనే పోరు సాగుతోందన్న అనుమానాలను ఈ రెండు వర్గాలు నివృత్తి చేసేశాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు వీరి పోరుకు వేదిక కావచ్చు. పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం ఈ రెండు వర్గాలు వేర్వేరుగా జాబితాలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ) : జిల్లాలో బీజేపీ వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. 2016లో నిర్వహించిన పార్టీ సంస్థాగత ఎన్నికల్లో రెండు వర్గాలుగా చీలిపోయిన నాయకుల మధ్య పోరు ఇప్పుడు రసకందాయంలో పడింది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడా కృష్ణమోహన్ అప్పట్లో జిల్లా అధ్యక్ష పదవి విషయంలో చెరో అభ్యర్థిని పోటీకి దింపిన విషయం విదితమే. ఆ ఎన్నికలలో వీర్రాజు బలపర్చిన యెనిమిరెడ్డి మాలకొండయ్య గెలుపొందారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకూ పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహిస్తూ వచ్చారు. ఆదివారం కాకినాడ శశికాంత్‌నగర్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉంగరాల చినబాబు నివాసంలో ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గెలుపొందిన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభకు వీర్రాజు వర్గం హాజరుకాలేదు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పాల్గొన్న విషయం విదితమే.
పార్టీ కార్యాలయం ఏర్పాటుపై వివాదం
తమకు ఆహ్వానం పంపకుండానే పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఇటీవల శాంతినగర్‌లో ఏర్పాటు చేయడంతో పైడా వర్గీయులు గుర్రుగా ఉన్నారు. జిల్లాలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోర్ కమిటీ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పలేదని పైడా వర్గం పార్టీ జాతీయ, రాష్ట్ర అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. జిల్లా అధ్యక్షులు మాలకొండయ్య తన అనుచరులతోనే ఈ కార్యాలయం ఏర్పాటు చేసుకొన్నారని, పార్టీకి సంబంధం లేదని వారు చెబుతున్నారు. ఈ విషయం రాష్ట్ర పార్టీ అధిష్టానం వద్ద తాడోపేడో తేల్చుకొనేందుకు సిద్ధం ఉన్నట్టు సమాచారం. పార్టీలో గ్రూపులు ఉన్నాయని ఇటీవల ఒక సమావేశంలో పాల్గొన్న పార్టీ జిల్లా ఇన్‌చార్జి పూడి తిరుపతిరావు అంగీకరించారు. రెండు సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహిస్తుండడంతో.. ఎక్కడికి వెళ్లాలో తెలియక నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో పార్టీ పరిస్థితులపై అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టకుంటే పార్టీ రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని పార్టీ సీనియర్ నాయకులు స్పష్టంచేస్తున్నారు.
అభ్యర్థుల ఎంపికలోనూ చెరో దారి
కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు విషయంలో రెండు వర్గాలు వేర్వేరుగా సన్నాహాలు చేసుకుంటున్నాయి రెండు వర్గాలు తమ అనుయాయులకు టికెట్లు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కార్పొరేషన్ ఎన్నికలకు బీజేపీ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరిస్తున్న విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు సోమవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి కూడా పైడా వర్గీయులు దూరంగా ఉన్నారు. రెండు వర్గాలతో పార్టీ కార్యాలయంలో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని ఆయన చెప్పినా, పార్టీ కార్యాలయానికి వచ్చేది లేదంటూ పైడా వర్గం భీష్మించుకుని కూర్చుంది. బీజేపీలో అంతర్గత పోరును టీడీపీ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి.
Advertisement