రాజకీయ అవినీతి అంటే ఇదేనా?
సాక్షి, లక్నో: ‘రాజ్‌నీతిక్ భ్రష్టాచార్’ అనే పదం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు ఇటీవల ఊతపదంగా మారింది. రాష్ట్రంలోని ఆధిత్యయోగి ప్రభుత్వ వ్యవహారాలను విమర్శించేందుకు ఆయన తరచుగా రాజ్‌నీతిక్ భ్రష్టాచార్ అంటే, ‘రాజకీయ అవినీతి’ పదాన్ని పదే పదే ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయనకు అంత కోపం రావడానికి సరైన కారణాలే ఉన్నాయి.
ఆయనకు అత్యంత విధేయులైన సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్సీలను బీజేపీ కొనుగోలు చేసి పార్టీలో చేర్చుకుంటోంది. 15 రోజుల కాలంలోనే యశ్వంత్ సింగ్, బుక్కల్ నవాబ్, సరోజని ఆగర్వాల్ ఇప్పటికే బీజేపీలో చేరిపోగా, ఆశోక్ బాజ్‌పేయి నేడో, రేపో బీజేపీలో చేరనున్నారు. మాయావతి నాయకత్వంలో బీఎస్పీ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా బీజేపీలో చేరిపోయారు.
వీరందరు బీజేపీలో చేరడానికి బలమైన కారణం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్, ఆయన డిప్యూటీలు దినేష్ శర్మ, కేశవ్ ప్రసాద్ మౌర్య, రాష్ట్ర మంత్రులు మోహిసిన్ రజా, స్వతంత్య్ర దేవ్ సింగ్‌లు సెప్టెంబర్ 19వ తేదీలోగా రాష్ట్ర ఉభయ సభల్లో ఒకదాని నుంచి తప్పనిసరిగా ఎన్నిక కావాలి. రాష్ట్ర శాసన సభలకు ప్రాతినిధ్యం వహించని మంత్రులు తాము పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆరు నెలల కాలంలోపల రాష్ట్ర శాసన సభ లేదా రాష్ట్ర శాసన మండలి నుంచి విధిగా ఎన్నిక కావాల్సి ఉంది. రాష్ట్ర శాసన సభకు ఎన్నిక కావాలంటే ప్రస్తుత శాసన సభ్యుల్లో ఐదుగురు రాజీనామా చేయాలి. వారి స్థానంలో వీరు ఎన్నిక కావాలి. దీనికన్నా శాసన మండలికి ఎన్నికవడం మంచిదని బీజేపీ భావించినట్లు ఉంది.
అందుకనే ఇతర పార్టీల సభ్యుల కోసం బీజేపీ గాలం వేస్తోంది. అయినప్పటికీ యోగి సహా ఐదుగురు శాసన మండలికి గెలవాలంటే పార్టీకి ఇంకా ఐదు ఓట్లు కావాలి. కనుక మరింత మంది తన పార్టీ నుంచి బీజేపీలోకి దూకే ప్రమాదం ఉందని అఖిలేష్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘రాజ్‌నీతిక్ భ్రష్టాచార్’ అంటూ బీజేపీ నేతలపై మండిపడుతున్నారు. అందులోనూ తన విధేయులు అనుకున్నవారిని ముందుగా లాక్కోవడం పట్ల ఆయన ఆగ్రహంతో ఉన్నారు. బీజేపీలో చేరిన ఎమ్మెల్సీల్లో బుక్కల్ నవాబ్, 2000 సంవత్సరంలో అఖిలేష్ యాదవ్ రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఆయనకు సన్నిహితుడు. ఏ ముస్లిం పండుగైన అఖిలేష్ తన ఇంటికి రాకుండా బుక్కల్ జరపుకునేవారు కాదు.
ఇక సరోజని అగర్వాల్ తన వైద్య కళాశాలకు అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ పేరు పెట్టుకున్నారు. యశ్వంత్ సింగ్‌ను ములాయం సింగ్ విధేయుడు నరేష్ యాదవ్‌ను కాదని అఖిలేష్ పోటీ చేయించారు. పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ అశోక్ వాజ్‌పేయిని అఖిలేష్ ఎమ్మెల్సీకి పోటీ చేయించారు. పార్టీ నుంచి ఎవరు పోవాలనుకున్నా నిరభ్యంతరంగా వెళ్లవచ్చుగానీ సాకులు మాత్రం చెప్పవద్దనీ అఖిలేష్ గాంభీర్యంగా చెబుతున్నారు. ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికైనా పాలకపక్ష బీజే పీకి ప్రత్యామ్నామ శక్తిగా పార్టీని నిలబెట్టాలంటే ముందు పార్టీలోని వర్గాలను ఏకం చేసుకోవాలి. తండ్రీ, తనయుల గ్రూపులు ఒకటి కావాలి.