
లక్నో: కొందరు నకిలీ కార్యకర్తలు పార్టీ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సమాజ్‌వాదీ కార్యకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సూచించారు. శనివారం ఇక్కడ జరిగిన పార్టీ సమావేశంలో ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాదీ అధ్యక్షుడిగా మరోసారి నరేశ్ ఉత్తమ్‌ను ఎన్నుకున్నారు. గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్ లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఆశీస్సులు తనకెప్పుడూ ఉంటాయని అఖిలేష్ చెప్పారు. యూపీలో ఇటీవల జరిగిన రైలు ప్రమాదాల విషయంలో కేంద్ర వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అసత్య వాగ్ధానాలు చేసి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాగా, బీజేపీని విమర్శించే ముందు అఖిలేష్ తన ఇంట్లోని సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే హితవు పలికారు.