లక్నో : బీజేపీని ఓడించడం కోసం ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ - బీఎస్పీ మహా కూటమిగా ఏర్పడినా ఫలితాలు మాత్రం నిరాశ పర్చాయి. ఈ క్రమంలో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి.. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వల్లే ఇంత దారుణంగా ఓడిపోయామని విమర్శించారు. ఈ క్రమంలో మాయావతి కూటిమి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఫలితాల అనంతరం పార్టీ నాయకులతో కలిసి.. సోమవారం ఓటమిపై సమీక్ష జరిపారు మాయావతి. ఈ ఓటమిపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థులకు యాదవుల ఓట్లు ఎక్కువగా పడలేదని ఆమె అభిప్రాయపడ్డారు. యాదవుల ఓట్లను ఆకర్షించడంలో అఖిలేశ్ దారుణంగా విఫలమయ్యారని.. ఆఖరికి ఆయన భార్య డింపుల్ యాదవ్‌ను కూడా గెలిపించుకోలేకపోయారని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని మాయావతి తన పార్టీ నాయకుల ముందు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కూటమిలో చేరకపోతే.. బీఎస్పీ మరో 5 సీట్లు ఎక్కువ గెలుచుకునేదని ఆమె అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ క్రమంలో రానున్న ఎమ్మెల్యే ఉపఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ఎస్పీ - బీఎస్పీ కూటమి 15 స్థానాల్లో విజయం సాధించగా.. వీటిలో బీఎస్పీ 10 స్థానాల్లో గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment