
న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి పాల్గొన్న మీడియా సమావేశంలో ప్రధాని మోదీ విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోవడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఆ మీడియా సమావేశం చూస్తుంటే మోదీకి ఇదే చివరి మన్‌కీ బాత్(మనసులో మాట) ఎపిసోడ్‌లా అనిపిస్తోందని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీప్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. ‘మీరు మోదీ మీడియా సమావేశాన్ని చూశారా? చూస్తుంటే ఇది చివరికి మన్‌కీబాత్ ఎపిసోడ్‌లా అనిపిస్తోంది. క్రమశిక్షణ కలిగిన సైనికుడిలా మోదీ మౌనం వహిస్తే, పాపం జర్నలిస్టులు మాత్రం ఏం చేయాలో తెలియక ఇబ్బందిపడ్డారు’ అని ట్వీట్ చేశారు.
జర్నలిస్టుల ముసుగులో ఓపిగ్గా కూర్చున్న బీజేపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పడాన్ని అమిత్ మర్చిపోలేదని కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఎద్దేవా చేశారు. ‘అసలు అక్కడేముంది? రఫేల్ వ్యవహారంపై అడిగిన ప్రశ్నలకు ప్రధాని జవాబు చెప్పాల్సింది. ఇదంతా చూస్తుంటే ఏదో విషయాన్ని దాస్తున్నారని అనిపిస్తోంది’ అని సీపీఐ నేత డి.రాజా అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయమై కేంద్ర మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం స్పందిస్తూ..‘‘ఈ మీడియా సమావేశానికి హాజరుకావడం ద్వారా ‘సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఏదైనా తేడా వస్తే అందుకు అమిత్ షాయే బాధ్యత వహిస్తారు’ అని మోదీ సందేశం ఇస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment