‘ప్రధాని మోదీ ఇక రజనీకాంత్‌ను కలవరు’
చెన్నై: సినీ నటుడు రజనీకాంత్‌పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి మాటల యుద్ధం కొనసాగుతోంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని, అలాగే ఇకపై రజనీని ప్రధాని నరేంద్రమోదీ కలువబోరని ఆయన పేర్కొన్నారు. చెన్నైలోని శంకరమఠం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి నుంచి సుబ్రహ్మణ్యస్వామి అవార్డు అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రజనీకాంత్ ఇక రాజకీయాల్లోకి రాబోరని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా రజనీకాంత్ ఆర్థిక నేరగాడు అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్వామి అంతటితో సరిపెట్టుకోలేదు..ఆ ఆర్థికనేరాలకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయనే బాంబును సైతం పేల్చారు.
మరోవైపు సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు రజనీ అభిమానుల్లో ఆక్రోశాన్ని రగిల్చాయి. ఆందోళనల బాటకు దూరంగా సామాజిక మాధ్యమాల్లో ట్విట్లతో స్వామిపై దాడికి దిగారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని కమలం పెద్దలపై ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు. రజనీని విమర్శించడం మానుకోకుంటే, తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని స్వామికి హిందూ మక్కల్ కట్చి నేత అర్జున్ సంపత్ హెచ్చరించారు.